వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారన్న నెపంతో అక్రమ కేసు
భర్తపై అకారణంగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదుతో తీవ్ర మనస్తాపం
కుమార్తెను చంపి తల్లి ఆత్మహత్య
అనంతపురం జిల్లా మల్లికార్జునపల్లిలో ఘటన
కళ్యాణదుర్గం: టీడీపీ నాయకుల కక్ష సాధింపులకు తల్లి, కుమార్తె బలయ్యారు. తన భర్తపై అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బనాయించడంతో తీవ్ర మనస్తాపం, ఆందోళనకు గురైన గొల్ల మమత (24).. తన 8 నెలల కుమార్తెను చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మల్లికార్జునపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లికార్జునపల్లికి చెందిన గొల్ల శాంతకుమార్ వైఎస్సార్‌సీపీ కార్యకర్తగా పార్టీ తరఫున గ్రామంలో చురుగ్గా పనిచేశారు.
ఐదు రోజుల క్రితం గ్రామంలోని ఓ కిరాణా దుకాణం వద్ద జగన్‌కు అనుకూలంగా మాట్లాడాడు. అనంతరం గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నేతలు శాంతకుమార్‌ను మందలించేందుకు కళ్యాణదుర్గం పట్టణ పోలీసు స్టేషన్‌లో పంచాయితీ పెట్టారు. శాంతకుమార్‌ను ఎలాగైనా కేసులో ఇరికించి జైలుకు పంపాలని ఎత్తుగడ వేశారు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన హనుమంతు అనే టీడీపీ కార్యకర్తను ఉసిగొల్పి శాంతకుమార్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారు. ఈ విషయంపై బుధవారం పోలీసులు శాంతకుమార్‌ను స్టేషన్‌కు పిలిపించారు.
భర్త జైలుకు వెళ్తాడన్న భయంతో..
తన భర్త శాంతకుమార్‌ను స్థానిక టీడీపీ నాయకులు అక్రమంగా కేసులో ఇరికిస్తున్నారని, అతన్ని జైలులో పెట్టిస్తారన్న భయంతో అతడి భార్య మమత తీవ్రంగా కుంగిపోయింది. ముందుగా తన 8 నెలల కుమార్తెను ఇంటి ఆవరణలోని నీటి తొట్టెలో ముంచి ప్రాణం పోయాక.. బాత్‌రూంలో ఉన్న ఇనుప కడ్డీలకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
కుటుంబ సభ్యులు, స్థానికులు గుర్తించేసరికే చిన్నారితో పాటు మమత మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల్లీకుమార్తె మృతితో మల్లికార్జునపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రికి తరలివచ్చారు. తల్లీకుమార్తె మృతదేహాలపై పడి గుండెలవిసేలా రోదించారు.
ఇవి రాజకీయ హత్యలే: వైఎస్సార్‌సీపీ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు గడవక ముందే వారి అధికార దాహానికి రెండు నిండు ప్రాణాలు బలయ్యాయని వైఎస్సార్‌సీపీ నేతలు మాదినేని ఉమామహేశ్వర నాయుడు, బోయ తిప్పేస్వామి అన్నారు. కుమార్తెను చంపి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసి మాదినేని ఉమా మహేశ్వర నాయుడు, బోయ తిప్పేస్వామి, పార్టీ నేతలు రామచంద్ర, హనుమంతరెడ్డి, చిత్తప్ప, తలారి సత్యప్ప, కృష్ణమూర్తి, ఆంజనేయులు తదితరులతో కలిసి కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. ఇద్దరి మృతదేహాల వద్ద నివాళులర్పించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇవి అధికార పార్టీ చేసిన రాజకీయ హత్యలని వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారన్న కారణంతో టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఆస్తులను ధ్వంసం చేయడం, అక్రమ కేసులు బనాయించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. కళ్యాణదుర్గాన్ని అభివృద్ధి చేస్తామన్న ఎమ్మెల్యే సురేంద్రబాబు ఇక్కడ విష సంస్కృతికి తెర లేపారని విమర్శించారు. తల్లీకూతురు మృతికి కారణమైన టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment