సాక్షి, తిరువూరు : ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఓటును ఎవరికీ వేస్తారో చెప్పాలంటూ నియోజకవర్గాల వారీగా ఓటర్లకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. నమస్కారం ఇది ప్రజాభిప్రాయ సేకరణ. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థికి మీరు ఓటు వేస్తారు. టీడీపీ అయితే ఒకటి, వైఎస్సార్‌సీపీ అయితే రెండు, జనసేన లేక ఇతర పార్టీలకు అయితే మూడు నొక్కండి అంటూ నిత్యం ఫోన్లు చేస్తున్నారు. 83339 99999 నంబరు నుంచి రికార్డ్ వాయిస్‌తో ఫోన్ కాల్స్ వస్తున్నాయి.
ఒక సారి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అరగంట తర్వాత లేదా ఫోన్ లిఫ్ట్ చేసి సమాధానం చెప్పేంత వరకు ఈ విధమైన ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. ఫ్యాన్సీ నంబరు కావడంతో కాల్ వచ్చిన ప్రతి ఒక్కరూ ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారు. తిరిగి ఈ నంబరుకు డయల్ చేస్తే నంబరు ఉపయోగంలో లేదు అనే రికార్డ్‌డెడ్ వాయిస్ వస్తోంది. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వాయిస్‌తో మీ నియోజకవర్గంలో టీడీపీకీ చెందిన ఏ అభ్యర్థికి మద్దతు తెలియజేస్తారో చెప్పాలంటూ అభిప్రాయాలు సేకరిస్తున్నారు.
అది పార్టీకి సంబంధించిన వ్యవహారంగా ఉండేదని, కాని ఇప్పుడు ఏకంగా ఏ పార్టీకి ఓటు వేస్తారో ముందుగానే చెప్పాలంటూ ఫోన్ కాల్స్ చేస్తున్నారని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలా చేయడం సరికాదని ఓటర్లు వాపోతున్నారు. పోలింగ్ బూత్‌లో రహస్యంగా ఉండాల్సిన వివరాలను ఈ విధంగా నిత్యం బహిరంగంగా అడగడం ఏమిటంటూ ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల అధికారులు కోడ్ ఉల్లంఘనులపైనే కాకుండా ఇలాంటి అంశాలపై కూడా దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment