సాక్షి, ముదినేపల్లి : నియోజకవర్గంలో టీడీపీకి కంచుకోటలాంటి ముదినేపల్లి మండలం ఈ ఎన్నికల్లో బీటలు వారే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఓటింగ్ సరళిని బట్టి వైఎస్సార్ సీపీ అధిక్యం సాధిస్తుందనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. మండలంలో 48,262 మంది ఓటర్లు ఉండగా 80శాతంపైగా ఓటింగ్ జరిగినట్లు అంచనా. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తండోపతండాలుగా తరలి రావడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.
మండలంలో ఉపాధి హామీ పనులు సైతం పూర్తిగా నిలిచిపోయాయంటే ఓటేసేందుకు ఏస్థాయిలో ఆసక్తి చూపారో తెలుస్తోంది. గతంలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మండల ఓటర్లు టీడీపీకే పట్టం కట్టారు. ప్రస్తుత పరిస్థితి అందుకు విరుద్ధంగా మారినట్లు పలు గ్రామాల్లోని ఓటింగ్ సరళి స్పష్టం చేస్తోంది. టీడీపీకి అండగా ఉండే బీసీ ఓటర్లు సైతం ఈఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి పూర్తిగా అండగా నిలవడంతో పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
అదే విధంగా మండలంలో అత్యధిక సంఖ్యలో ఉన్న ఎస్సీ ఓటర్లు పార్టీకి పూర్తి అండగా నిలిచి జగన్‌పై అభిమానాన్ని చాటుకున్నారు. మండలంలోని 32 గ్రామాల్లో కేవలం 10లోపు గ్రామాల్లో మాత్రమే టీడీపీ మెజార్టీ సాధించే అవకాశాలున్నాయని మిగిలిన అన్ని గ్రామాల్లో వైఎస్సార్ సీపీ అధిక్యం సాధిస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు. డ్వాక్రా మహిళలు, రైతులు అండగా నిలుస్తారని అంచనా వేసిన టీడీపీ నేతల ఆశలు తలకిందులయ్యాయి.
రుణాలు రద్దు చేస్తానని హామీ ఇచ్చి నెరవేర్చకుండా ఎన్నికల ముందు పసుపు–కుంకుమ, అన్నదాత సుఖీభవతో మోసం చేయాలని భావించిన చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పనున్నట్లు మహిళలు, రైతులు వ్యాఖ్యానించడం గమనార్హం. దీనిని బట్టి చూస్తే అన్ని వర్గాల ప్రజలు వైఎస్సార్ సీపీకి అండగా నిలిచి టీడీపీ కంచుకోటను కూల్చుతారనడంలో సందేహం లేదనే అభిప్రాయం సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment