సాక్షి, కర్నూలు(కల్చరల్) : అలో! అలో!... ఎవుర్రా మాట్లాడేది.. మీ సిన్నమ్మకీరా ఫోను!.. అలో!.. అలో!... నేనేలే మీ మామను మాట్లాడతాండ... యినిపిస్తుందా!... గుంటూరుకు పోయినోల్లందరు బెరీత రామని సెప్తుండరు. పని ఐపోగొట్టుకొని రేపు మొబ్బులోకంతా రారి... రొండు పండగలుండయ్ మరి... రాంకిట్టి గానికి వాని పెండ్లాముకు కూడా సెప్పు. ఒగటేమో ఉగాది పండగ. అదయినంక ఓట్ల పండగ... ఏం జేసి అందురు రావల్లని యియ్యాల్ల నాయకులు వచ్చి సెప్పి పోయినరు... కట్టమింద కూసోని ఫోనులో గట్టిగట్టిగా మాట్లాడుతున్నాడు రాంసుబ్బయ్య.
ఓయ్! అంత గట్టిగ అర్సేదానికి పోను ఏంటికి. పోను తీసేసి అర్సు. గుంటూరుకు యినపడతది గాని... ఎవురికి పోను జేస్తుండవ్... అడిగాడు పెద్దీరన్న.
ఇంగెవురికి సేస్త.. మా పెద్దకొడకు సిన్నకొడుకు వాల్లకుటింబాలన్ని గుంటూరు మిరపకాయల పనికి పోయినారు గద. వాల్లు బెరీత రామని సెప్తుండ. నిన్న మనూర్ల పెచారం సేసేకి రంగారొడ్డోల్లు వచ్చి సెప్పిపోయిరి కదా. కర్రి పండగ పోయినంక మూన్నాల్లకు ఓట్లు పండగ వుందిరోయ్. మీ వూర్లోన అందరినీ పిలిపియ్యమని సెప్పి పాయ... చెప్పాడు రాంసుబ్బయ్య.
పిలిపిస్తే ఏం పెడ్తారంటలే. ఏమన్న అందరికీ బట్టలు పెట్టి ప్యారంటం సేస్తరంటనా! వొడిబియ్యం పెట్టి నిద్దర సేపిస్తరంటనా! వాల్లు సెప్పడం.. నువ్వు పిలిపియ్యడం.. ఎంకిపెళ్లి సుబ్బి సావుకొచ్చిందన్నట్లు. ఈల్ల ఓట్లు మీ కూలికి గండి కొట్టనీక వచ్చినయ్. యాదో రొండు రోజులు పనిసేస్తే యింత కూలి దుడ్లన్న వస్తయ్ వాల్లకి. అది గూడ ఆగం లేపి అగుడు పట్టియ్యనీక తయ్యారైనారీల్లు.. చెప్పినాడు పెద్దీరన్న.
ఏమట్లంటివి బావా!... రంగా రొడ్డి ఏం సెప్పినాడో తెల్సా!... కర్రి పండగ నాడు యాటలు కొడ్తంలే అందురికి కేజీకేజీ నంజీర ఫ్రీగా యిస్తం. అందురు వుండండి. కర్రి పండగ పోయినంక యింగ పదకొండో తేదీ వరకు దినాం బిర్యాని పెడ్తరంట. అందుకోసం అందుర్ని బెరీన రమ్మని సెప్పినాడు... చెప్పాడు రాంసుబ్బయ్య.
అంతేలే మన బత్కులు పొయ్యినన్నాల్లు నంజిరకు, కల్లుకు, బిర్యానికి బలి.. బలి అయిపోవాల్సిందే. కుక్క బిస్కెట్లు మనకు పారేసి నక్క తొక్కుడు వాల్లు తొక్కుతారు.. చెప్పాడు అప్పుడే వచ్చిన నాగమద్దయ్య.
కరట్టు సెప్పినవ్ రా మద్దయ్యా!... సూడు రాంసుబ్బయ్య బావా! వాడు పిల్లగాడు తెల్సుకున్నంత గూడ నువ్వు తెల్సకల్యాక పోయినావ్. కుక్క బిస్కెట్లకు లొంగిపోయి మన వాల్లందరూ వాల్లకు జైకొట్టడం. వాల్లెంబడి తిర్గడం. వాల్లకు ఓట్లు ఎయ్యడం. కర్రి పండగ సేపిస్తమంట ఎర్రి నాయాల్లందరు గుంటూరు పనికాన్నుండి ఎగేస్కుంట వస్తరంట... చెప్పాడు పెద్దీరన్న.
సుబ్బయ్య మామా!... కర్రి పండగ అయినంక మూడునాల్లు అయినంక పోలింగు వుంది. మూడు నాల్ల కూలీ కత పక్కన పెట్టు. అస్సలీ సుగ్గికి పొయ్యేది ఎవరు తప్పిస్తరో వాల్లకు మాత్రమే ఓటేస్తం అని అందరితో ఒట్టేపిస్తం. మన వూర్లోనే మర్యాదగా పనిచేసుకుంట బతికేటట్ల సేస్తే సాలు. సుగ్గికి పోయినోల్లకు కర్రి పండగ సేపియ్యడం. బిర్యానీలు పెట్టడం కాదు. సుగ్గికి పోకుండా వుండల్లంటే మన వూరి పొలాలకు నీల్లు వచ్చేతట్ల సెయ్యల్ల. ఎట్ల సేస్తరో ఏం సేస్తరో మాకు మాటియ్యమను... అప్పుడు ఆలోచన చేస్తం... చెప్పాడు నాగమద్దయ్య. కర్నూలు(కల్చరల్)
ఓట్ల పండుగొచ్చే అందరికీ బట్టలు పెట్టి, పేరంటం సేద్దాం..
Published Sun, Apr 7 2019 11:20 AM | Last Updated on Sun, Apr 7 2019 11:22 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment