చిత్తూరు జిల్లాలో ఇద్దర్ని చావగొట్టిన పచ్చ నేతలు
దాదేపల్లిలో ముస్లింలపై విరుచుకుపడిన టీడీపీ శ్రేణులు
టీడీపీకి ఓటేయలేదని నడవలేని మహిళను నిర్బంధించి ఇంటికి తాళం
పల్నాడు జిల్లాలోఇల్లు ధ్వంసం చేసి.. ఇద్దరిపై దాడి
పులివెందులలోనూ ఆగని దాడులు
గుండె ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తిపై బీజేపీ, టీడీపీ మూకుమ్మడి దాడి
సాక్షి నెట్‌వర్క్:ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా దాడులు, విధ్వంసాలకు పాల్పడుతున్న టీడీపీ శ్రేణులు నెల రోజులు దాటినా నేటికీ అదే పంథాను అనుసరిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు.
ఇళ్లు, వాహనాలు, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. తాము అధికారంలో ఉన్నందున ఏదైనా చేస్తామనే ధోరణిలో ఎక్కడికక్కడ రెచ్చిపోతూ స్వైరవిహారం చేస్తున్నారు. తమకు ఓటేయలేదనే అనుమానంతో ఓటర్లపైన.. వైఎస్సార్‌సీపీకి ఓటేయించారనే నెపంతో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపైన ప్రతాపం చూపిస్తున్నారు. చివరకు మధ్యాహ్న భోజన పథకం వంట మహిళలనూ టీడీపీ నేతలు వదలటం లేదు.
ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించాడనే కక్షతో దాడి
చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం సింగసముద్రం గంగమ్మ జాతరలో టీడీపీ నేతలు బుధవారం రాత్రి మూకుమ్మడి దాడికి తెగబడ్డారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్త అశోక్, అతడి బావమరిది విఘ్నేష్ (సుబ్రహ్మణ్యం)లను తీవ్రంగా గాయపరిచారు. బాధితుల కథనం ప్రకారం.. సింగసముద్రం గ్రామానికి చెందిన అశోక్ గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేయించాడని అతడిపై కక్ష పెంచుకున్నారు.
బుధవారం గ్రామంలో గంగమ్మ జాతర సందర్భంగా అశోక్ బావమరిది విఘ్నేష్‌ని టీడీపీ నేతలు కొడుతున్నారన్న సమాచారం తెలియడంతో అశోక్ జాతర వద్దకు వెళ్లాడు. దీంతో టీడీపీ నేత సుబ్రహ్మణ్యం ఆగ్రహంతో ఊగిపోతూ ‘అశోక్ వచ్చాడు. వీడే మన టార్గెట్’ అంటూ 40 మందితో కలిసి అశోక్‌పై మూకుమ్మడిగా దాడిచేశాడు. గాయపడిన అశోక్ గురువారం ఉదయం రామకుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అశోక్, విఘ్నేష్ భయపడి గ్రామం వదిలి కుప్పం వెళ్లిపోయారు. దాడులతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది.
పులివెందులలో మామా అల్లుళ్లపై..
వైఎస్సార్ జిల్లా పులివెందులలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త అబ్దుల్, ఆయన మామ కుల్లాయప్పపై టీడీపీ కార్యకర్తలు శ్రీను, సంజీవ్, ఫయాజ్, సుమంత్ బుధవారం రాత్రి దాడి చేశారు. అబ్దుల్‌కు, కుల్లాయప్ప ఇంట్లో ఉండగా టీడీపీ కార్యకర్తలు దాడి జరిపి గాయపరిచారు. క్షతగాత్రులిద్దరినీ ప్రభుత్వాస్పత్రికి తరలించి.. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. గాయపడిన అబ్దుల్, కుల్లాయప్పను పార్టీ మునిసిపల్ ఇన్‌చార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి, చైర్మన్ వరప్రసాద్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిన్నప్ప పరామర్శించారు.
అనపర్తి మండలంలో బీజేపీ, టీడీపీ కలిసి..
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు కూటేశ్వరస్వామి కాలనీలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త కర్రి కోటేశ్వరరెడ్డిపై రామవరం, కుతుకులూరు గ్రామాలకు చెందిన బీజేపీ, టీడీపీ కార్యకర్తలు బుధవారం రాత్రి కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన కోటేశ్వరరెడ్డి అనపర్తి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడి కారణంగా కోటేశ్వరరెడ్డి చెవి కర్ణభేరికి రంధ్రం పడినట్టు గుర్తించారు.
దాడితో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. అనపర్తి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి బాధితుడిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోటేశ్వరరెడ్డి గతంలో గుండె ఆపరేషన్ చేయించుకుని అనారోగ్యంతో ఉన్నారని, దాడి సమయంలో ఆందోళనకు గురై అతడు ప్రాణాలు కోల్పోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. అన్యాయంగా దాడులకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
వైఎస్సార్‌సీపీ నాయకుడి వాహనం ధ్వంసం
వైఎస్సార్‌సీపీ మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ నాయకుడు బంగారు నాగేంద్ర కారును బుధవారం రాత్రి టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరులో ఉంటున్న వైఎస్సార్‌సీపీ నాయకుడు బంగారు నాగేంద్ర తన కారును ఇంటి బయట పార్క్ చేసి ఉంచాడు. బుధవారం అర్ధరాత్రి టీడీపీ నేతలు కారు అద్దాలు ధ్వంసం చేశారు. సమీపంలో ఉన్న వైఎస్సార్‌సీపీ బ్యానర్లను చించివేశారు. ఘటనపై బాధితుడు పెనమలూరు పోలీసులకు నాగేంద్ర బుధవారం ఫిర్యాదు చేశారు.
వంట మహిళపైనా టీడీపీ దౌర్జన్యం
ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కుదప గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వంట ఏజెన్సీ నిర్వాహకురాలిపై టీడీపీ నాయకులు గురువారం దౌర్జన్యం చేశారు. కుదప గ్రామానికి చెందిన పోతురాజు పద్మావతి 23 ఏళ్లుగా మధ్యాహ్న భోజనం పథకంలో విద్యార్థుల కోసం వంట చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వంట ఏజెన్సీ నిర్వాహకురాలిని మార్చాలని ఆ పార్టీ నాయకులు ఒత్తిడి చేస్తున్నారు.
పాఠశాల హెడ్మాస్టర్ బుధవారం విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం జరపగా.. మెజార్టీ సభ్యులు పద్మావతి వంట ఏజెన్సీ నిర్వహించేందుకు అంగీకరించారు. అయితే.. టీడీపీ నాయకులు ‘మా పార్టీ అధికారంలోకి వచ్చింది. మా ఇష్టం వచ్చిన మనుషుల్ని మేం పెట్టుకుంటాం. నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపో. వంట చేయడానికి వీల్లేదు’ అంటూ తనపై దౌర్జన్యం చేశారని పద్మావతి వాపోయారు. ఈ ఘటనపై ఎంఈవోకు ఫిర్యాదు చేశారు.
రాడ్లు, కర్రలతో దాడి
అన్నమయ్య జిల్లా ములకలచెరువులో వైఎస్సార్‌సీపీ నాయకులపై టీడీపీ నాయకులు దాడి తెగబడ్డారు. మాజీ సర్పంచ్, వైఎస్సార్‌సీపీ నేతలు దిన్నెపాటి రవీంద్రారెడ్డి, శ్రీనివాసులు గురువారం రాత్రి మండల కేంద్రానికి రాగా.. టీడీపీ మండల కన్వీనర్ పాలగిరి సిద్ధ, చిన్ని కృష్ణ, శివకుమార్ తదితరులు వారిపై రాడ్లు, కర్రలతో దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు టీడీపీ నేతలను ప్రతిఘటించి ఇద్దరి ప్రాణాలను కాపాడారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు బాధితులను చికిత్స నిమిత్తం మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పంచాయతీపై టీడీపీ ఫ్లెక్సీ
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం నీలిగుంటలో పంచాయతీ కార్యాలయంపై టీడీపీ నాయకుల ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీ ఏర్పాటుపై సర్పంచ్ కన్నంరెడ్డి వరహాలబాబు ఎంపీడీవో కాశీవిశ్వనాథరావుకు ఫిర్యాదు చేశారు. వెంటనే రాజకీయ పరమైన ఫ్లెక్సీని పంచాయతీ కార్యాలయం నుంచి తొలగించాలని కోరారు.
ఇలా వివాదాస్పదంగా వ్యవహరించడం వల్ల గ్రామంలో ఇరుపార్టీల మధ్య గొడవలు జరిగి శాంతిభద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని సర్పంచ్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని ఓ గ్రామంలో బంధువుల ఇళ్లలో శుభకార్యానికి హాజరైన వైఎస్సార్‌సీపీ దళిత నాయకుడు వినోద్‌పై టీడీపీ శ్రేణులు దాడికి యత్నించారు. అతడిని అడ్డగించి ద్విచక్రవాహనాన్ని లాక్కున్నారు.
ఇంటికి తాళం వేసి మహిళ నిర్బంధం
వైఎస్సార్ సీపీకి ఓటేసిందనే అనుమానంతో నడవలేని స్థితిలో ఉన్న మహిళను ఇంట్లో ఉండగా.. ఆ ఇంటికి తాళం వేసి నిర్బంధించిన ఘటన తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మిట్టమీదకండ్రిగలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన నాగేశ్వరరావు, మరో 10 మందికి వైఎస్సార్‌సీపీ హయాంలో ఇంటి పట్టాలు ఇచ్చారు. నాగేశ్వరరావు కుటుంబం గృహం నిర్మించుకుని అందులోనే కాపురం ఉంటోంది.
ఈ క్రమంలో నాగేశ్వరరావు కుటుంబం ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఓటేసిందనే అనుమానంతో ఓ టీడీపీ నాయకుడు కక్షపూరితంగా ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించారని రెవెన్యూ అధికారుల ద్వారా గురువారం నాగేశ్వరరావు ఇంటికి తాళం వేయించాడు. నడవలేని స్థితిలో ఇంటిలో ఉన్న మునెమ్మ కేకలు వేస్తున్నా పట్టించుకోకుండా తాళం వేసి నిర్బంధించారు. ఈ విషయంపై తహసీల్దార్ ఉదయ్‌భాస్కర్‌రాజును వివరణ కోరగా.. వీఆర్వో లోకేశ్వరి పొరబాటుగా ఇంటికి తాళం వేయడంతో మందలించినట్టు చెప్పారు.
ఇల్లు ధ్వంసం చేసి.. ఇద్దరిపై దాడి
పల్నాడు జిల్లా శ్రీరామపురం తండాలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కేతావత్ గోవిందు నాయక్, కేతావత్ అంజి నాయక్‌లకు చెందిన గృహాన్ని బుధవారం రాత్రి టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ పాత్లావత్ అంజి ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు వెళ్లిన కేతావత్ గోవిందు నాయక్, కేతావత్ అంజి నాయక్‌పై టీడీపీ నేత పాత్లావత్ అంజి, మరో 10 మంది రాడ్లు, కర్రలతో దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారు.
దాడిలో గాయపడిన గోవిందు నాయక్, అంజి నాయక్‌లను మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు తీసుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా వెల్దుర్తి ఎస్‌ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు.
ముస్లింలపై విరుచుకుపడిన టీడీపీ శ్రేణులు
వక్ఫ్ బోర్డు అధికారి లెక్కలు చూస్తుండగా ముస్లింలపై దాడి చేసిన ఘటన చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం దాదేపల్లెలో గురువారం చోటుచేసుకుంది. ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామంలోని మసీదు మరమ్మతు పనులకు సంబంధించిన నిధుల వినియోగంలో అవకతవకలు జరిగాయని టీడీపీ నేతలు వక్ఫ్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. విచారణ నిమిత్తం వచ్చిన వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్ గౌస్ మొహిద్దీన్ గ్రామానికి చేరుకుని లెక్కలు పరిశీలిస్తుండగా.. వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ నేతలు మూకుమ్మడి దాడికి తెగబడ్డారు.
ఘటనలో ఎస్.బావాజాన్, ఎస్.సనావుల్లా, పి.షేర్‌ఖాన్, ఎస్.మషాయక్, ఎస్.మహమ్మద్ ఖైఫ్, ఎస్.జహీర్లకు గాయాలయ్యాయి. బావాజాన్ ఎముకలు విరగడంతో అపరస్మారక స్థితికి చేరాడు. సనావుల్లాకు ముఖం, ఛాతిపై బలమైన గాయాలయ్యాఇ. ఈ ఘటనతో దాదేపల్లెలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బాధితులను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోన్ ద్వారా పరామర్శించి, ఘర్షణకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.
వైఎస్సార్‌సీపీ నేతపై హత్యాయత్నం
పొలంలో నిద్రిస్తుండగా కత్తులతో దాడి చేసిన టీడీపీ నాయకులు
తీవ్ర గాయాలతో అటవీ ప్రాంతంలోకి పారిపోయి ప్రాణం దక్కించుకున్న బాధితుడు
పీలేరు ఆస్పత్రిలో చికిత్స
సాక్షి టాస్క్‌ఫోర్స్: చిత్తూరు జిల్లా సోమల మండలం నెల్లిమంద పంచాయతీ ఎగువపల్లెకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత కిరణ్ గురువారం పొలంలో నిద్రించగా..టీడీపీ నాయకులు కత్తులతో విరుచుకుపడి హత్యాయత్నం చేశారు. తీవ్రంగా గాయపడిన అతడు ప్రాణభయంతో అటవీ ప్రాంతంలోకి పరుగులు తీసి అన్నమయ్య జిల్లా పీలేరుకు చేరుకున్నారు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా ఎగువపల్లెకు చెందిన కిరణ్ వైఎస్సార్‌సీపీ మండల స్థాయి నాయకుడు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంతో సన్నిహితంగా మెలుగుతున్నారు.
వైఎస్సార్‌సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇటీవల ఎన్నికల సందర్భంగా పార్టీ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. గురువారం మధ్యాహ్నం కిరణ్ ఎగువపల్లెలోని తన టమాటా తోటలో పడుకుని ఉండగా.. టీడీపీ నాయకులు కిరణ్‌పై కత్తులు, కర్రలతో ఒక్కసారిగా దాడి చేశారు. కిరణ్ తలపై కత్తులతో నరికారు. ఛాతీపై కర్రలతో కొట్టారు. తీవ్రంగా గాయపడ్డ కిరణ్ ప్రాణ భయంతో సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పరుగులు తీశాడు. అక్కడ నుంచి అన్నమయ్య జిల్లా పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నాడు.
చికిత్స పొందుతూ రాత్రి 9 గంటల సమయంలో కొంత తేరుకున్నాక పుంగనూరు నియోజకవర్గ నాయకులకు ఫోన్‌చేసి తన పరిస్థితిని వివరించాడు. నియోజకవర్గంలో ప్రతిరోజు ఏదో ఒకచోట దాడులు జరగడంతో స్థానిక ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఈ ఘటనలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment