మరిన్ని నీళ్లు కావాలి..
♦ సాగర్ కింద అదనంగా 10.5 టీఎంసీలు కోరుతున్న ఏపీ
♦ నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని కృష్ణా బోర్డు లేఖ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ ప్రాజెక్టు నీటి విడుదలపై తెలంగాణ ఎంత దిగొస్తోంటే... ఏపీ అంత బెట్టు చేస్తోంది. బోర్డు సూచన మేరకు ఆవిరి, సరఫరా నష్టాలను సైతం పక్కనపెట్టి కుడి కాల్వకు నీటిని విడుదల చేస్తున్నా, మరింత అదనపు నీటికై పట్టుపడుతోంది.నాగార్జునసాగర్ నుంచి తమ తాగు, సాగు అవసరాలకు 10.5టీఎంసీల నీటిని కేటాయిం చాలంటూ ఏపీ కృష్ణా బోర్డుకు లేఖలు రాసింది. ఈ లేఖలపై వెంటనే స్పందించిన బోర్డు నీటి విడుదలకై చర్యలు తీసుకోవాలని తెలంగాణను ఆదేశించింది.
తెలంగాణ వాదన బేఖాతరు...
నిజానికి ఏపీకి దక్కాల్సిన సంపూర్ణ వాటా ఇచ్చే శామని తెలంగాణ తొలి నుంచీ చెబుతూ వస్తోంది. దీన్ని ఖాతరు చేయని ఏపీ... సాగర్ డ్యామ్ వద్ద గొడవకు దిగడంతో బోర్డు సూచన మేరకు తెలంగాణ నీటిని విడుదల చేసింది. అదీ చాలదన్నట్లు తాజాగా సాగర్ కుడి కాల్వ కింద 15.20 టీఎంసీలకు గానూ 13.89 టీఎంసీలే విడుదల చేశారని, తమకు ఇంకా 1.3 టీఎంసీలు రావాలని లేఖ రాసింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాల దృష్ట్యా ఈ నీటిని విడుదల చేయాలని కోరింది.
దీంతో పాటే కృష్ణాడెల్టా కింద మరో 6.48 టీఎంసీలు కావాలం టోంది.కుడి కాల్వ కింద సైతం తమకు 3.5 టీఎంసీల కేటాయింపులున్నా.. 0.98టీఎంసీలే విడుదల చేశార ని, మరో 2.52 టీఎంసీలు కావాలని కోరుతోంది. ఇక సాగర్‌లో వాస్తవ నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం అది 511.4 అడుగులకు చేరింది. ఇంకో అడుగు దాటితే కనిష్టానికి పడిపోతుంది.