
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదాల పరిష్కారానికి వీలుగా దీపావళి అనంతరం అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించాలని కేంద్ర జల వనరుల శాఖ ప్రాథమిక నిర్ణయం చేసినట్లు తెలిసింది. ఈ మేరకు కేంద్రం నుంచి సంకేతాలు వెలువడినట్లుగా కృష్ణా, గోదావరి బోర్డు వర్గాలు చెబుతున్నాయి. అపరిష్కృతంగా ఉన్న వివాదాలకు అపెక్స్ భేటీ ఒక్కటే శరణ్యమన్న తమ వినతి మేరకు కేంద్రం ఆ దిశగా నిర్ణయం చేసినట్లుగా ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
కృష్ణా, గోదావరి బేసిన్‌లోని వివాదాలపై గత రెండేళ్లలో అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించిన కేంద్రం.. ఇరు రాష్ట్రాల మధ్య ఓ అవగాహన కుదర్చడంతో తాత్కాలిక పరిష్కారం దొరికింది. ఈ ఏడాది ఎలాంటి భేటీ జరగలేదు. దీంతో జల వివాదాలు మరింత ముదిరాయి. తెలంగాణ రీ–ఇంజనీరింగ్ చేస్తున్న పాలమూరు–రంగారెడ్డి, డిండి, సీతారామ, భక్తరామదాస, తుమ్మిళ్ల, కంతనపల్లి వంటి ప్రాజెక్టులకు కేంద్రం, బోర్డు అనుమతులు లేవని ఏపీ అంటోంది.
ప్రతిగా ఏపీ చేపట్టిన పులికనుమ, సిద్ధాపురం, గాజులదిన్నె, గుండ్రే వుల, శివభాష్యం సాగర్, మున్నేరు, ముచ్చు మర్రి, గురు రాఘవేంద్ర, ఆర్డీఎస్ కుడి కాల్వ అంశాలని తెలంగాణ తెరపైకి తెచ్చింది. ఈ వివాదాన్ని తేల్చే బాధ్యతను బోర్డులు కేంద్రం కోర్టులోకి నెట్టాయి. ఈ నేపథ్యంలో కేంద్రం దీపావళి తర్వాత అపెక్స్ కౌన్సిల్ భేటీకి కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ సుముఖత తెలిపినట్లు తెలిసింది. ఆలోపే బోర్డులతో భేటీ కావాలని సైతం ఆయన నిర్ణయించినట్లుగా సమాచారం.