పాలమూరు, డిండిలకు అడ్డు తొలగినట్లే! | Apex Council meeting with Palamuru, dindi | Sakshi
Sakshi News home page

పాలమూరు, డిండిలకు అడ్డు తొలగినట్లే!

Published Fri, Sep 23 2016 3:39 AM | Last Updated on Fri, Mar 22 2019 2:57 PM

పాలమూరు, డిండిలకు అడ్డు తొలగినట్లే! - Sakshi

పాలమూరు, డిండిలకు అడ్డు తొలగినట్లే!

ప్రాజెక్టుల నిర్మాణానికి అభ్యంతరాల్లేవన్న కేంద్రం
* అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే స్పష్టత
* ట్రీబ్యునల్ చేసే కేటాయింపులకు అనుగుణంగానే నీటి వినియోగం
* ప్రాజెక్టుల నియంత్రణ అంశం సైతం ఇప్పట్లో లేనట్లే!

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి ఒక అడ్డు తొలిగింది. ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపేయాలంటూ ఆంధ్రప్రదేశ్ చేసిన వాదన అపెక్స్ కౌన్సిల్ ముందు వీగిపోయింది. ప్రాజెక్టుల నిర్మాణానికి అభ్యంతరాలేమీ లేవని.. కానీ బ్రిజేష్ ట్రిబ్యునల్ చేసే కేటాయింపులకు అనుగుణంగా నీటి వినియోగానికి కట్టుబడి ఉండాలని కేంద్రం సూచించడం రాష్ట్రానికి ఊరటనిచ్చింది. అయితే బ్రిజేష్ ట్రిబ్యునల్ విచారణ ఎప్పటికి పూర్తి చేస్తుంది, ఏ మేరకు నీటి వాటాను కేటాయిస్తుందన్నది ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది.
 
కేటాయింపుల మేర వాటా దక్కేనా?

బచావత్ ట్రిబ్యునల్ కృష్ణానదిలో 75 శాతం నీటి లభ్యత లెక్కన మొత్తంగా 2,060 టీఎంసీలను లెక్క తేల్చింది. అందులోంచి ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల నికర జలాలు, మరో 227 టీఎంసీల మిగులు జలాలను కేటాయించింది. ఇందులో ఏపీకి 512 టీఎంసీల నికర జలాలు, 150 టీఎంసీల మిగులు జలాలు దక్కగా.. తెలంగాణకు 299 టీఎంసీల నికర జలాలు, 77 టీఎంసీల మిగులు జలాలు దక్కాయి. అయితే మొత్తంగా కూడా తెలంగాణ 200 టీఎంసీలకు మించి వినియోగించుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే 120 టీఎంసీల సామర్థ్యంతో పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను చేపట్టింది.

ఇక ఏపీ చేపట్టిన పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల ద్వారా తెలంగాణకు కృష్ణాలో అదనంగా 90 టీఎంసీల వాటా రావాలని స్పష్టం చేస్తోంది. మరోవైపు బ్రిజేష్ ట్రిబ్యునల్ కొత్తగా 65 శాతం నీటి లభ్యత అంచనాలతో కృష్ణాలో 2,578 టీఎంసీల లభ్యత జలాలున్నట్టు తేల్చింది. ఈ లెక్కన మరో 163 టీఎంసీల నికర జలాలు, 285 టీఎంసీల మిగులు జలాలు (మొత్తం 448 టీఎంసీలు) అదనంగా ఉన్నట్లు చూపింది. ఈ అదనపు జలాల్లో కర్ణాటకకు 177, మహారాష్ట్రకు 81, ఏపీకి 190 టీఎంసీలు కేటాయించింది. కానీ బచావత్ తీర్పుకు వ్యతిరేకంగా మిగులు జలాలను ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలకు పంచడమేమిటని.. వాటిని దిగువ రాష్ట్రాలకే పంచాలని ప్రస్తుతం బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదిస్తోంది.

దీనిపై విచారణ ముగిస్తే తెలంగాణకు మిగులు జలాల్లో మరింత వాటా పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ లెక్కన మొత్తంగా పాలమూరు, డిండిలకు నిర్ణీత నీటిని వాడుకోవచ్చని తెలంగాణ భావిస్తోంది. అయితే దీనిపై వాదనలు విన్న కేంద్రం వాటాలు తేల్చే పనిని తిరిగి ట్రిబ్యునల్‌కే అప్పగించింది. తెలంగాణ వాదనలకు అనుగుణంగా నీటి వాటా పెరిగితే పాలమూరు, డిండికి ఎలాంటి నష్టం ఉండదని.. లేకపోతే ఇబ్బందేనని రాష్ట్ర నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి.
 
నియంత్రణ ఇప్పట్లో లేనట్లే
కృష్ణా నదీ జలాల వినియోగం, ప్రాజెక్టుల నియంత్రణపై ముసాయిదా నివేదికను సమర్పించాలని ఇప్పటిదాకా కృష్ణా బోర్డు తొందరపెట్టిందని.. ప్రస్తుతానికి ఆ అంశం మరుగున పడినట్లేనని రాష్ట్ర నీటిపారుదల శాఖ చెబుతోంది. అపెక్స్ భేటీలో ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంపకాల్లో స్పష్టత వచ్చే వరకు ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి చేర్చే విషయంలో తొందర అవసరం లేదని తెలంగాణ వాదించింది. అసలు ప్రాజెక్టుల వారీగాఎవరి వాటా ఎంత, వినియోగం ఏ రీతిన ఉండాలో ట్రిబ్యునల్ చెప్పాకే ప్రాజెక్టుల నియంత్రణ చేపట్టాలని సూచించింది. ఈ వాదనతో కేంద్రం ఏకీభవించిందని, ఏపీ మౌనం దాల్చిందని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement