dindi
-
ఇప్పటికి ఈ స్మారక శిల వయసు 3,500 ఏళ్లు
సాక్షి, హైదరాబాద్: మూడున్నర వేల ఏళ్ల క్రితం నాటి స్మారక శిల (మెన్హిర్) వెలుగు చూసింది. నాగర్‌కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం కంసానిపల్లె గ్రామ శివారులో డిండి నదీ తీరంలో దీన్ని గుర్తించారు. వారసత్వ ప్రాంతాలను పరిరక్షించాలంటూ ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాల్లో భాగంగా ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో, పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గురువారం డిండి నదీ తీరాన్ని సందర్శించారు. కొండారెడ్డి పల్లి– ఉప్పునుంతల మధ్యలో నదీ తీరంలో ఈ నిలువురాయిని గుర్తించారు. భూ ఉపరితలంలో ఎనిమిది అడుగుల ఎత్తు, రెండడుగుల వెడల్పు, ఒకటిన్నర అడుగు మందంతో ఉన్న ఈ స్మారక శిల కొంతమేర పక్కకు ఒరిగి ఉంది. గ్రానైట్ శిలతో చేసిన ఈ స్మారకం 3,500 ఏళ్ల క్రితం ఇనుపయుగం నాటిదిగా ఆయన పేర్కొన్నారు. అప్పట్లో స్థానిక మానవసమూహంలో చనిపోయిన ప్రముఖుడికి గుర్తుగా దీన్ని పాతారని, గతంలో ఈ ప్రాంతంలో ఆదిమానవుల కాలం నాటి బంతిరాళ్ల సమాధులు ఉండేవని, వ్యవసాయ పనుల్లో భాగంగా అవి కనుమరుగయ్యాయని స్థానికులు తిప్పర్తి జగన్మోహన్రెడ్డి, అభిలాశ్రెడ్డి, సాయికిరణ్‌రెడ్డి తదితరులు ఆయన దృష్టికి తెచ్చారు. మన చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఉన్న ఈ నిలువు రాయినైనా కాపాడుకోవాలని ఆయన స్థానికులకు సూచించారు. -
ప్రభుత్వ పాఠశాలలో క్షుద్రపూజల కలకలం! హెడ్మాస్టర్ గది ముందే..
డిండి (నల్గొండ): మండల పరిధిలోని టి.గౌరారం స్జేజి వద్ద ఉన్న దొంతినేని హన్మంతురావు ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గుర్తుతెలియని వ్యక్తులు వరుసగా చేస్తున్న క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. పాఠశాల ప్రధానోపధ్యాయుడు పంతులాల్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం పాఠశాల సమయం ముగిసిన తర్వాత తాళం వేసి ఉన్న పాఠశాలకు ఆదివారం సెలవు దినం కావడంతో అటువైపుగా ఎవరూ వెళ్లలేదు. గుర్తు తెలియని వ్యక్తులు హెచ్ఎం గది ఎదురుగా కుంకుమ,పసుపు, నిమ్మకాయలంతో చేసిన క్షుద్ర పూజలు సోమవారం పాఠశాలకు వెళ్లిన ఉపాధ్యాయులు, విధ్యార్థులకు కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని వెంటనే ఎంఈఓ సామ్యనాయక్ దృష్టికి తీసుకెళ్లినట్లు పంతులాల్ తెలిపారు. అదేవిధంగా గతంలో కూడా ఇలాంటి క్షుద్ర పూజలు చేసిన విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు,పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. పాఠశాల ఆవరణలో ఏమైనా ని«ధులు ఉన్నాయా లేక ఉపాధ్యాయులు, విధ్యార్థులను భయపెట్టడానికి ఆకతాయిలు చేస్తున్న పనినా అని పలువురు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గుర్తు తెలియని ఆకతాయిలు పాఠశాలలో చేస్తున్న క్షుద్రపూజలపై విచారణ చేపట్టామని ఎస్ఐ.సరేష్ తెలిపారు. చదవండి: సమాచారం ఇచ్చి మరీ.. స్వాతి మీ చెల్లెను చంపేశాను -
పిల్లలు పెద్దయ్యారు.. సఖ్యతగా మెలగడం కుదరదని చెప్పినా..
సాక్షి, నల్గొండ: దివ్యాంగుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన డిండి మండల పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండల పరిధిలోని పడమటితండాకు చెందిన జర్పుల చీన్యా(45) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 25ఏళ్ల క్రితం విద్యుదాఘాతం చోటు చేసుకోవడంతో రెండు చేతులు కోల్పోయాడు. చీన్యాకు అదే తండాకు చెందిన మహిళతో వివాహం జరిగింది. వారికి కుమారుడు శివ జన్మించాడు. దంపతుల మధ్య మనస్పర్థల కారణంగా చీన్యా భార్య కుమారుడిని వదిలి ఇంటినుంచి వెళ్లిపోయింది. అప్పటినుంచి చీన్యా కుమారుడితో కలిసి జీవనం సాగిస్తున్నాడు. కాగా, చీన్యా అదే తండాకు చెందిన రాత్లావత్ మహిళ (పండు)తో సఖ్యతగా మెలుగుతున్నాడు. ఈ విషయం పెద్ద మనుషుల వద్దకు వెళ్లినా తీరు మార్చుకోలేదు. 20ఏళ్లుగా సఖ్యతగానే ఉంటున్నారు. చదవండి: మరణించిన టీచర్ పేరుతో రూ.33 లక్షలు డ్రా... కొడుక్కి విషయం తెలియడంతో.. పిల్లలు పెద్దయ్యారని.. చీన్యా కుమారుడు శివకు 20 ఏళ్లుగా కాగా, పండు కుమారుడికి వివాహం జరిగింది. ఇకపై ఇద్దరం కలుసుకోవడం కుదరదని పండు ప్రియుడు చీన్యాకు చెప్పింది. అయినా చీన్యా వినకుండా ఆమెపై ఒత్తిడి చేస్తున్నాడు. దీంతో అతడిని అంతమొందించాలని నిర్ణయించుకుంది. ఈ విషయం తన కుమారుడు సురేష్‌కు తెలిపి పథకం రచించింది. అనుకున్న విధంగానే చీన్యా ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత భర్త లేని సమయంలో పండు ఇంటికి వెళ్లాడు. అప్పటికే మాటు వేసి ఉన్న పండు, ఆమె కుమారుడు సురేష్ చీన్యాపై గొడ్డలితో దాడి చేశారు. దీంతో చీన్యా అక్కడినుంచి పారిపోతుండగా పట్టుకుని ఇంటి వద్దకు లాకెళ్లి నరికి దారుణంగా మట్టుబెట్టారు. సమాచారం తెలుసుకున్న చీన్యా కుమారుడు శివ అతడి కుంటుంబ సభ్యులు, బంధువులు ఘటన స్థలానికి చేరుకునే సరికి అతడు రక్తపు మడుగులో విగతజీవుడిగా పడి ఉన్నాడు. చదవండి: ఎక్కువరోజులు ఉండలేను.. హైదరాబాద్ వచ్చేస్తా.. సీన్ కట్ చేస్తే.. సర్పంచ్‌కు ఫోన్ చేసి.. చీన్యాను హత్య చేసిన విషయాన్ని పండు స్థానిక సర్పంచ్ పాండుకు ఫోన్ చేసి చెప్పింది. పిల్లలు పెద్దయ్యారని సఖ్యతగా మెలగడం కుదరదని, గతంలో చేసినా పొరపాటు మళ్లీ చేయవద్దని కోరినా ఒత్తిడి చేయడంతో మట్టుబెట్టగా తప్పలేదని వివరించింది. వెంటనే సర్పంచ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలాన్ని సీఐ బీసన్న, డిండి ఎస్ఐ సురేష్, చందంపేట ఎస్ఐ యాదయ్య పరిశీలించారు. చీన్యాను తానే గొడ్డలితో నరికి చంపానని పండు పోలీసుల వద్ద లొంగిపోవడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె కుమారుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహానికి దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం చేయించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి కుమారుడు శివ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ.సురేష్ తెలిపారు. -
బీజేపీ Vs టీఆర్ఎస్.. చిచ్చురేపిన వాట్సాప్ మెసేజ్
సాక్షి, నల్గొండ: దిండి మండల కేంద్రంలోని హైవే మధ్యలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు భూమిపూజ జరుగుతోందని వాట్సాప్ గ్రూపుల్లో వచ్చిన మెసేజ్ టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య చిచ్చురేపింది. డిండిలోని హైవే డివైడర్‌పై దాదాపు 1.5 కిలో మీటర్ల దూరం ఏర్పాటు చేసే సెంట్రల్ లైటింగ్, రెండు జంక్షన్ల నిర్మాణానికి రోడ్డు రవాణా, హైవే రహదారుల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కోటా నుంచి రూ.85 లక్షలు మంజూరయ్యాయి. కాగా, బీసీ జాతీయ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు భూమిపూజ చేయడానికి డిండికి వస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, స్థానిక టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు ఎలాంటి సమాచారం లేకుండానే ఆచారి భూమి పూజకు రావడం ఏమిటని టీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: నమ్మించి ఫోన్‌తో పరార్.. కట్ చేస్తే.. ‘నీ ఫోన్ తీసుకెళ్లినందుకు క్షమించు’ పోలీసులతో మాట్లాడుతున్న తల్లోజు ఆచారి శనివారం కార్యకర్తలను కలిసేందుకు డిండికి వచ్చిన జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారిని టీఆర్ఎస్ నాయకులు రాజీవ్‌గాంధీ చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి ఆచారి గోబ్యాగ్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో బీజేపీ, టీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని తోపులాట జరిగింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ అంతరాయం కలుగడంతో పోలీసులు రెండు పార్టీల నాయకులను అక్కడి నుంచి పంపించి వేశారు. టీఆర్ఎస్ నాయకుల నిరసనపై ముందస్తు సమాచారం ఉండడంతో డిండి ఎస్ఐ.సరేష్, కొండమల్లేపల్లి పోలీసుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చదవండి: సాధారణ సబ్బు రూ.20 నుంచి 60 ఉంటే.. ఈ సబ్బు రూ.96 అట.. కారణం ఏంటో తెలుసా? తెలంగాణలో నియంత పాలన తెలంగాణలో నియంత పాలన నడుస్తోందని బీసీ జాతీయ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి అన్నారు. స్థానిక ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలకులు పాలనపై దృష్టి పెట్టకుండా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను గూండాలుగా తయారు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాను, డిండి మీదుగా నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలానికి వెళ్తున్న క్రమంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించినందుకు కార్యకర్తలు స్వాగతం పలికేందుకు వచ్చారని తెలిపారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ వర్గాలు ఘర్షణకు దిగడం బాధాకరమన్నారు. కేవలం తాను పార్టీ కార్యకర్తలను కలవడానికి మాత్రమే డిండిలో కాసేపు ఆగానని, భూమిపూజకు రాలేదని స్పష్టం చేశారు. ఆయన వెంట ఆ పార్టీ జిల్లా నాయకుడు ఏటి.కృష్ణ, ఎంపీటీసీ ఏటి.రాధిక, సైదా, వెంకటయ్య, శ్రీను, జైపాల్, రాఘవ, అంజి,అజయ్, రమేష్ తదితరులున్నారు. -
ఏపీలో గోవా తరహా బీచ్‌లు, కేరళ బ్యాక్ వాటర్ అందాల.. ఎక్కడో తెలుసా?
సాక్షి, అమరావతి: మంచు సోయగాల సొగసులో.. పైరగాలుల చలిలో.. పచ్చని దుప్పటిలో.. హాయిగా ఒదిగి.. గోదావరి గలగలల మధ్య.. పిల్లకాలువల సవ్వడిలో మునిగి.. దివిని మించిన దీవిలా ప్రకృతి ఒడిలో దిండి సేదతీరుతోంది. గోవా తరహా బీచ్‌లు.. కేరళలో కనిపించే బ్యాక్‌వాటర్స్ అందాలు.. హౌస్ బోట్ల పరుగుల సమాహారంతో కోనసీమ సిగలో సరికొత్త అందాలను సంతరించుకుని .. పర్యాటకులను ‘దిండి’ యాత్రకు ఆహ్వానిస్తోంది. అటు గోదావరి.. ఇటు సముద్రం ఒకవైపు బంగాళాఖాతం.. మరోవైపు గోదావరి.. ఈ రెండింటి సంగమం అన్నాచెల్లెళ్ల గట్టును బోటు ప్రమాణంలో వీక్షించవచ్చు. సముద్రం ఒడ్డును కొలువైన లక్ష్మీనరసింహస్వామి, సమీపంలోని అయినవిల్లి, ముక్తేశ్వరం ఆలయాలను దర్శించవచ్చు. శతాబ్దాలుగా భద్రపరచబడిన తమిళ సంస్కృతిని చాటే పేరూరు వారసత్వం గ్రామం, లైట్‌హౌస్ ఇతర సందర్శనీయ స్థలాలు. రాజమండ్రి విమానాశ్రయం నుంచి 80 కిలో మీటర్లు, రాజోలు నుంచి 8 కిలోమీటర్లు, పాలకొల్లు రైల్వే స్టేషన్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో దిండి ఉంది. అక్టోబర్ నుంచి మార్చి వరకు పర్యటనకు అనుకూలం. దిండిలో రెండు రిసార్టులు దిండిలో పర్యాటక శాఖకు చెందిన హరిత కోకోనట్ కంట్రీ రిసార్ట్‌లో 32 ఏసీ గదులతో పాటు రెస్టారెంట్, కాన్ఫరెన్స్ హాల్, స్విమ్మింగ్ పూల్ ఉంది. సాధారణ రోజుల్లో రోజుకు 50శాతం ఆక్యుపెన్సీతోనూ, వీకెండ్లో వంద శాతం గదులు నిండిపోతున్నాయి. అంతేకాకుండా దిండిలో వాటర్ స్పోర్ట్స్ ఆస్వాదించేందుకు 200 నుంచి 500 మందికి పైగా పర్యాటకులు వస్తున్నారు. దిండి కోనసీమ గాడ్ సిటీ కేరళ తరహా అందాలకు దిండి పెట్టింది పేరు. ఇక్కడ పర్యాటక శాఖ రిసార్టు అత్యాధుని సౌకర్యాలతో బస కల్పిస్తోంది. హౌస్ బోట్ల ప్రయాణం కోసం పర్యాటకులు పోటీపడుతుంటారు. వీటిని కుటుంబ సమేతంగా గడపడానికి అనువుగా తీర్చిదిద్దాం. – సత్యనారాయణ, ఎండీ, ఏపీటీడీపీ ప్రత్యేక ఆకర్షణగా హౌస్ బోట్లు.. తూర్పుగోదావరి జిల్లాలోని దిండిలోని దట్టమైన మడ అడవులు మధ్య బ్యాక్ వాటర్స్‌లో బోటు ప్రయాణం పర్యాటకులను కట్టిపడేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర పర్యాటక శాఖ కేరళ తరహా హౌస్బోట్లను ప్రవేశపెట్టింది. వీటిలో అటాచ్డ్ బాత్రూమ్, ఏసీ, సిటౌట్, డైనింగ్ ఏరియా... ఇలా నక్షత్రాల హోటల్‌ను మరిపించే సౌకర్యాలతో రెండు హౌస్ బోట్లు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. ఈ బోట్లు దాదాపు 40 కిలో మీటర్ల మేర గోదావరిలో ప్రయాణిస్తాయి. దిండిలో బయలు దేరి రాజోలు లంక ఐలాండ్Š, నరసాపురం రేవు నుంచి తిరిగి గమ్యస్థానానికి చేరుకుంటాయి. మరోవైపు రెండు పాంటూన్ బోట్లు, ఒక లగ్జరీ బోటు, స్పీడ్ బోటు సౌకర్యం కూడా ఉంది. చదవండి: ఒంగోలు జాతి కోడె దూడ ధర రూ.2 లక్షలు -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం.. మెట్టినింటి బాధలు పడలేక
సాక్షి, నల్లగొండ: ప్రేమించానని వెంటపడి మాయమాటలు చెప్పాడు.. ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో ఎదిరించి మరీ వివాహం చేసుకున్నాడు.. మూడు నెలలు గడిచాయో లేదో.. వరకట్నం తీసుకురావాలని తల్లితో కలిసి వేధించాడు.. ఇటు కన్నవారికి దూరమై.. అటు మెట్టినింటి బాధలు తట్టుకోలేక ఆ.. అభాగ్యురాలు మరణశాసనం లిఖించుకుంది. ఈ విషాదకర ఘటన నల్లగొండ జిల్లా డిండి మండల పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండలం వావిల్‌కొల్ గ్రామానికి చెందిన మబ్బు అలెమ్మ, చిన నాగయ్య దంపతుల కూతురైన శ్రీలత(24), అదే గ్రామానికి చెందిన జుట్టు బొజ్జమ్మ, మొగిలయ్య కుమారుడు చిన్నయ్య ఏదాది కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో పోలీసులను ఆశ్రయించి వివాహం చేసుకున్నారు. మూడు మాసాలకే.. వివాహమైన తర్వాత చిన్నయ్య, శ్రీలత దంపతులు గ్రామంలోనే కిరాణ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, కొంత కాలం సజావుగా సాగిన వీరి కాపురంలో వరకట్నం చిచ్చురేపింది. పుట్టింటి నుంచి కట్నం, బైక్ తీసుకురావాలంటూ చిన్నయ్య తన తల్లి బొజమ్మతో కలిసి వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో, శ్రీలత పుట్టింటికి వెళ్లలేక.. ఇటు భర్త, అత్తల చిత్రహింసలు తట్టుకోలేక చనిపోవాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే గురువారం రాత్రి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా గ్రామ శివారులోని ఓ వ్యవసాయ భూమిలో చెట్టుకు ఉరేసుకుంది. అయితే, అనుమానంతో కుటుంబ సభ్యులు వెతకగా అప్పటికే విగతజీవిగా మారింది. సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అత్తింటి వేధింపులతోనే శ్రీలత ఆత్మహత్య చేసుకుందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతురాలి సోదురుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పోచయ్య తెలిపారు. -
పవన్ అభిమానుల ఓవర్‌యాక్షన్
సాక్షి, రాజోలు: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభిమానుల అత్యుత్సాహంతో పోలీసు గాయపడిన ఘటన తూర్పుగోదావరి జిల్లా దిండి రిసార్ట్స్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. దిండి రిసార్ట్స్ ముఖద్వారం వద్ద పవన్ అభిమానులు అత్యుత్సాహంతో ముందుకు తోసుకురావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో అక్కడే విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ మురళీకృష్ణ గాయపడ్డారు. చికిత్స కోసం ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పవన్ అభిమానుల ఓవర్ యాక్షన్‌పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, రాజోలు నియోజక వర్గంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ గురువారం రాత్రి దిండి రిసార్ట్స్‌కు చేరుకున్నారు. ఈ ఉదయం పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. అనంతరం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. (చదవండి: ‘పావలా కల్యాణ్’ అంటూ ట్వీట్ చేసిన హీరోయిన్) -
సర్పంచ్‌గా పోటీ చేయాలని వేధింపులు.. వివాహిత సూసైడ్..!
సాక్షి, దిండి : సర్పంచ్ ఎన్నికలు ఓ కుటుంబంలో చిచ్చు రేపాయి. భార్యను సర్పంచ్‌గా పోటీ చేయాలని ఓ భర్త వేధింపులకు గురిచేశాడు. దాంతోపాటు పుట్టింటి నుంచి రూ.5 లక్షల తీసుకురావాలని ఒత్తిడి చేశాడు. దీంతో ఆమె బలన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన నల్లగొండ జిల్లాలోని దిండి మండలంలో శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఎర్రగుంటపల్లికి చెందిన జంతుక లింగమయ్య, రాధ (22) దంపతులు. వీరికి 8 నెలల కిందట వివాహమైంది. పెళ్లి సమయంలో ఒప్పుకున్న బైక్ కోసం లింగమయ్య రాధను నిత్యం వేధింపులకు గురిచేసేవాడు. ఇదే క్రమంలో ఎర్రగుంటపల్లి సర్పంచ్ స్థానాన్ని ఎస్సీ మహిళకు కేటాయించడంతో తన భార్యను పోటీచేయించడానికి లింగమయ్య ఆసక్తి చూపించాడు. సర్పంచ్‌గా పోటీ చేయాలని రాధను ఒత్తిడి చేశాడు. పుట్టింటికి వెళ్లి 5 లక్షల రూపాయలు తేవాలని వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె ఈ నెల 6న నిజాంనగర్‌లో ఉంటున్న తల్లిదండ్రులు భైరాపురం మీనయ్య, శారదలకు తన గోడు వెళ్లబోసుకున్నా లాభం లేకపోయింది. బుధవారం పుట్టింట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రాధను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. రాధ అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. -
వినపడని కుయ్..కుయ్
దివంగత సీఎం రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన అద్భుత పథకం 108. ఈ అంబులెన్స్ సేవ వల్ల ఎంతో మంది ప్రాణాపాయం నుంచి బయట పడగలిగారు. ఇతర రాష్ట్రాలకు సైతం మార్గ దర్శకంగా ఉన్న ఈ పథకం నేడు తెలుగు రాష్ట్రం లోనే కొన్ని మండలాల్లో అమలు కావడం లేదు. అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు 108 వాహనం లేక ప్రైవేట్ వాహనాలకు డబ్బులు చెల్లించలేక డిండి మండల ప్రజలు ఇబ్బందులుపడుతున్నారు. డిండి : అత్యవసర పరిస్థితుల్లో ప్రమాదాలు జరిగినప్పుడు లేదా ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తినప్పుడు వెంటనే సమీప ఆస్పత్రికి బాధితులను తరలించే ఉద్దేశంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్ అందించే సేవలకు డిండి మండల ప్రజలు నోచుకోవడం లేదు. హైదరాబాద్–శ్రీశైలం రోడ్డుపై ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మండలం లోని 16గ్రామ పంచాయతీల్లో 11 సబ్సెంటర్లున్నా యి. మండల పరిధిలోని వీరబోయనపల్లి, సింగరాజుపల్లి, రహమంతపూర్, తవక్లాపూర్, కందుకూర్, బ్రా హ్మణపల్లి, వావిల్‌కొల్, టి గౌరారం, కామేపల్లి, గోనబోయినపల్లి, ప్రతాప్‌నగర్, ఖానాపూర్, చెర్కుపల్లి, బొగ్గులదొన తదితర గ్రామాల ప్రజలు దాదాపు 20కిలోమీటర్ల దూరం నుంచి వైద్య సేవలకు వందల సంఖ్యలో ప్రతినిత్యం మండల కేంద్రంలోని పీహెచ్‌సీకి వస్తుంటారు. ఆయా గ్రామాల్లోని ప్రజలకు ఏదైనా అత్యవసర వైద్య పరిస్థితి ఏర్పడితే డిండికి 108 అంబులెన్స్ సౌకర్యం లేక సమీప మండలాలైన దేవరకొండ, వంగూరు, అచ్చంపేట అంబులెన్స్‌లను ఆశ్రయించాల్సి వస్తుంది. ఆ సమయంలో అక్కడ కూడా లేకుంటే వారి ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. పీహెచ్సీలో సిబ్బంది కొరత.. స్థానిక మండల కేంద్రంలోని పీహెచ్సీలో సిబ్బంది కొరత కొన్నేళ్లనుంచి కొనసాగుతూనే ఉంది. ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో 24 గంటల వైద్య సౌకర్యానికి ఇద్దరు వైద్యులు ఉండాలి కానీ ఇక్కడ ఒక్క డాక్టర్ మాత్రమే విధులు నిర్వహిస్తుండడంతో మండల రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 22 మంది ఏఎన్‌ఎంలకుగాను 14 మంది ఉద్యోగులు ఉంటూ 8 ఖాళీలు, ఎంపీహెచ్ఏ మేల్ 1, పీఎస్ఓ 1 పోస్టులు ఖాళీలున్నాయి. అత్యవసర పరిస్థితి వస్తే అంతే సంగతులు.. మండలంలోని మారుమూల గ్రామాల్లో ప్రజలకు ముఖ్యంగా రాత్రి సమయాల్లో కాన్పులు జరుతుగున్న గర్భిణులు ఇబ్బందులకు గురవుతున్నామని వారు పే ర్కొంటున్నారు. ఎమర్జెన్సీ అపుడు డిండి నుంచి హైదరాబాద్‌కు ప్రైవేటు వాహనాల్లో తరలించడానికి 3 గం టల సమయం పడుతుందని, ఎమర్జెన్సీ ప్రభుత్వ వాహనమైన 108 అంబులెన్స్ గంటన్నర వ్యవధిలోనే చేరుతుందని వారు పేర్కొంటున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లాం మండలానికి 108 అంబులెన్స్ సౌకర్యం లేక పోవడంతో రోగులు ఇబ్బందులు ఎదరుర్కొంటున్న మాట వాస్తవమే. ఈ విషయంతో పాటు పీహెచ్సీలో సిబ్బంది కొరతను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తామన్నారు. -
‘డిండి’ భూసేకరణ వేగం పెంచండి
♦ అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం ♦ 2013 చట్టం ప్రకారమే సేకరించాలని సూచన ♦ డిండి, ఏఎమ్మార్పీ ప్రాజెక్టులపై సమీక్ష సాక్షి, హైదరాబాద్: డిండి ఎత్తిపోతల కింద భూసేకరణను వేగవంతం చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికా రులను ఆదేశించారు. ప్రస్తుతానికి 2013 భూసేకరణ చట్టం కింద భూములను సేకరిం చాలని, దీనిలో ఇబ్బందులు తలెత్తిన చోట స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు. అసైన్డ్ భూములకు కూడా పట్టా భూముల లెక్క ప్రకారమే పరిహారం ఇవ్వాలని చెప్పా రు. బుధవారం డిండి, ఎలిమినేటి మాధవ రెడ్డి ప్రాజెక్టు, ఉదయ సముద్రం, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, సంగంబండ పథకం తదితరాలపై హైదరాబాద్‌లోని జలసౌధలో మంత్రి సమీక్షించారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, బాలరాజు, భాస్కరరావు, ప్రభాక రరెడ్డి, స్పెషల్ సీఎస్ ఎస్కే జోషి, పలు జిల్లా ల కలెక్టర్లు పాల్గొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల భూసే కరణ, పనుల పురోగతి, ఇతర సమ స్యలపై కలెక్టర్లు వారానికోసారి సమీక్షిం చాలని.. కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు, సాగునీటి శాఖ ఇంజనీర్లు ఆ సమావే శాల్లో పాల్గొనాలని మంత్రి ఆదేశించారు. రంగా రెడ్డి జిల్లా మాడ్గుల, ఆమనగల్ మండ లా లకు కల్వకుర్తి లిఫ్ట్ పథకం నీరందించేందుకు కార్యాచరణ అమలు చేస్తున్నట్టు తెలిపారు. భూగర్భ జలాలపైనా సమీక్ష భూగర్భ జలాల వినియోగంపై ఆ విభాగం అధికారులతో హరీశ్‌రావు సమీక్షించారు. మిషన్ కాకతీయ వల్ల రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయని, 9 గంటల నిరంతర విద్యుత్ సరఫరా కారణంగా సాగు పెరిగిం దని మంత్రి పేర్కొన్నట్లు తెలిసింది. అయితే ప్రతి జిల్లాలో ఒక్కో చోట ప్రయోగాత్మకంగా భూగర్భజలాల రీచార్జి అధ్యయనాలు చేయాలని మంత్రి సూచించారు. -
వృద్ధుడి అనుమానాస్పద మృతి
మలికిపురం : దిండి గ్రామంలో ఆదివారం గుడాల ప్రకాష్ (96) అనే వృద్ధుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. అతని మృత దేహం తన ఇంటిలోనే రక్తపు మడుగులో కుర్చీలోనే ఉంది. ఇది హత్యా, లేక ఆత్మ హత్యా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కత్తితో గొంతు కోసి రక్తపు మడుగులో మృత దేహం పడి ఉన్న తీరు అనుమానాస్పదంగా ఉంది. కుటుంబ సభ్యులు మాత్రం ఇది ఆత్మహత్యేనని పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో పేర్కొంటున్నారు. సీఐ క్రిస్టోఫర్ మాట్లాడుతూ ప్రకాష్ భార్య ఆదెమ్మ గత ఏడాది నవంబరు 29న మృతి చెందారని అప్పటి నుంచి మానసిక స్థితి సరిగా లేక భార్య వద్దకే వెళ్లిపోతానంటూ ఇంతకు ముందు రెండుసార్లు ఆత్మహత్యకు పాల్పడ్డారని అప్పట్లో అడ్డుకున్నామని కుటుంబ సభ్యులు చెప్పినట్టు పేర్కొన్నారు. ఆదివారం ప్రకాష్ బంధువులు అల్పాహారం పెట్టారని తెలిపారు. ఇంటిలో ఓ పక్క అద్దెకు ఉంటున్న వారు చర్చికి వెళ్తూ ప్రకాష్‌కు చెప్పేందుకు వెళ్లగా తలుపు గడియ వేసి ఉందని, తీయడం లేదన్నారు. దీంతో ఆమె గ్రామంలో మరో చోట నివాసం ఉంటున్న అతని కుమార్తెకు తెలియచేసింది. ప్రకాష్ మానసిక పరిస్థితి మేరకు అతని బంధువులు అతని గదికి మరో వైపు తలుపులు బయట వైపు తాళం వేసి ఉంచుతున్నారు. దీంతో ఆ తలుపులు తెరిచి చూడగా రక్తపుమడుగులో ఉన్న ప్రకాష్‌ను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృత దేహాన్ని పోస్టు మార్టంకు రాజోలు ప్రభుత్వాస్పత్రికి పంపి రిపోర్టు అనంతరం తదుపరి విచారణ చేస్తామని ఆయన తెలిపారు. -
పాలమూరు, డిండిలకు అడ్డు తొలగినట్లే!
ప్రాజెక్టుల నిర్మాణానికి అభ్యంతరాల్లేవన్న కేంద్రం * అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే స్పష్టత * ట్రీబ్యునల్ చేసే కేటాయింపులకు అనుగుణంగానే నీటి వినియోగం * ప్రాజెక్టుల నియంత్రణ అంశం సైతం ఇప్పట్లో లేనట్లే! సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి ఒక అడ్డు తొలిగింది. ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపేయాలంటూ ఆంధ్రప్రదేశ్ చేసిన వాదన అపెక్స్ కౌన్సిల్ ముందు వీగిపోయింది. ప్రాజెక్టుల నిర్మాణానికి అభ్యంతరాలేమీ లేవని.. కానీ బ్రిజేష్ ట్రిబ్యునల్ చేసే కేటాయింపులకు అనుగుణంగా నీటి వినియోగానికి కట్టుబడి ఉండాలని కేంద్రం సూచించడం రాష్ట్రానికి ఊరటనిచ్చింది. అయితే బ్రిజేష్ ట్రిబ్యునల్ విచారణ ఎప్పటికి పూర్తి చేస్తుంది, ఏ మేరకు నీటి వాటాను కేటాయిస్తుందన్నది ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది. కేటాయింపుల మేర వాటా దక్కేనా? బచావత్ ట్రిబ్యునల్ కృష్ణానదిలో 75 శాతం నీటి లభ్యత లెక్కన మొత్తంగా 2,060 టీఎంసీలను లెక్క తేల్చింది. అందులోంచి ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల నికర జలాలు, మరో 227 టీఎంసీల మిగులు జలాలను కేటాయించింది. ఇందులో ఏపీకి 512 టీఎంసీల నికర జలాలు, 150 టీఎంసీల మిగులు జలాలు దక్కగా.. తెలంగాణకు 299 టీఎంసీల నికర జలాలు, 77 టీఎంసీల మిగులు జలాలు దక్కాయి. అయితే మొత్తంగా కూడా తెలంగాణ 200 టీఎంసీలకు మించి వినియోగించుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే 120 టీఎంసీల సామర్థ్యంతో పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను చేపట్టింది. ఇక ఏపీ చేపట్టిన పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల ద్వారా తెలంగాణకు కృష్ణాలో అదనంగా 90 టీఎంసీల వాటా రావాలని స్పష్టం చేస్తోంది. మరోవైపు బ్రిజేష్ ట్రిబ్యునల్ కొత్తగా 65 శాతం నీటి లభ్యత అంచనాలతో కృష్ణాలో 2,578 టీఎంసీల లభ్యత జలాలున్నట్టు తేల్చింది. ఈ లెక్కన మరో 163 టీఎంసీల నికర జలాలు, 285 టీఎంసీల మిగులు జలాలు (మొత్తం 448 టీఎంసీలు) అదనంగా ఉన్నట్లు చూపింది. ఈ అదనపు జలాల్లో కర్ణాటకకు 177, మహారాష్ట్రకు 81, ఏపీకి 190 టీఎంసీలు కేటాయించింది. కానీ బచావత్ తీర్పుకు వ్యతిరేకంగా మిగులు జలాలను ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలకు పంచడమేమిటని.. వాటిని దిగువ రాష్ట్రాలకే పంచాలని ప్రస్తుతం బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదిస్తోంది. దీనిపై విచారణ ముగిస్తే తెలంగాణకు మిగులు జలాల్లో మరింత వాటా పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ లెక్కన మొత్తంగా పాలమూరు, డిండిలకు నిర్ణీత నీటిని వాడుకోవచ్చని తెలంగాణ భావిస్తోంది. అయితే దీనిపై వాదనలు విన్న కేంద్రం వాటాలు తేల్చే పనిని తిరిగి ట్రిబ్యునల్‌కే అప్పగించింది. తెలంగాణ వాదనలకు అనుగుణంగా నీటి వాటా పెరిగితే పాలమూరు, డిండికి ఎలాంటి నష్టం ఉండదని.. లేకపోతే ఇబ్బందేనని రాష్ట్ర నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. నియంత్రణ ఇప్పట్లో లేనట్లే కృష్ణా నదీ జలాల వినియోగం, ప్రాజెక్టుల నియంత్రణపై ముసాయిదా నివేదికను సమర్పించాలని ఇప్పటిదాకా కృష్ణా బోర్డు తొందరపెట్టిందని.. ప్రస్తుతానికి ఆ అంశం మరుగున పడినట్లేనని రాష్ట్ర నీటిపారుదల శాఖ చెబుతోంది. అపెక్స్ భేటీలో ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంపకాల్లో స్పష్టత వచ్చే వరకు ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి చేర్చే విషయంలో తొందర అవసరం లేదని తెలంగాణ వాదించింది. అసలు ప్రాజెక్టుల వారీగాఎవరి వాటా ఎంత, వినియోగం ఏ రీతిన ఉండాలో ట్రిబ్యునల్ చెప్పాకే ప్రాజెక్టుల నియంత్రణ చేపట్టాలని సూచించింది. ఈ వాదనతో కేంద్రం ఏకీభవించిందని, ఏపీ మౌనం దాల్చిందని పేర్కొంది. -
బాధ్యత కేంద్రానిదే!
♦ తెలంగాణకు న్యాయం చేయాల్సింది కేంద్రమేన్న రాష్ట్ర ప్రభుత్వం ♦ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది ♦ దానిని ఇప్పుడైనా సరిచేయండి ♦ పాలమూరు, డిండిలు ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులే ♦ ప్రధాని సైతం 2014 ఏప్రిల్ 22న పాలమూరు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ♦ పట్టిసీమ, పోలవరంల కింద తెలంగాణకు 90టీఎంసీలు రావాలి ♦ ఈ మేరకు కృష్ణాలో వాటా 389 టీఎంసీలకు పెంచాలి ♦ పరీవాహకం, ఆయకట్టు ఆధారంగా వాటా పెంచాలని విజ్ఞప్తి ♦ పొరుగు రాష్ట్రాలతో నిర్మాణాత్మక సహకారానికి కట్టుబడి ఉన్నామని వెల్లడి ♦ అపెక్స్ కౌన్సిల్ ముందు తెలంగాణ ప్రజెంటేషన్ ♦ బోర్డు సూచించిన 47 చోట్ల టెలిమెట్రీ అమలుకు ఓకే సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జలాల విషయంలో న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నదీ జలాల కేటాయింపులు, ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని పేర్కొంది. దాన్ని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వమైనా సరిచేయాలని అర్థించింది. ఏపీ ఆరోపిస్తున్నట్టు పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల కొత్త ప్రాజెక్టులేమీ కాదని పునరుద్ఘాటించింది. వాటికి ఉమ్మడి రాష్ట్రంలోనే జీవోలు ఇచ్చారని గుర్తు చేసింది. గోదావరి, కృష్ణా ట్రిబ్యునల్ల గత తీర్పుల మేరకు పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల కింద తెలంగాణకు న్యాయంగా 90 టీఎంసీల వాటా దక్కాలని, ఆ మేరకు రాష్ట్ర వాటాను పెంచాలని విజ్ఞప్తి చేసింది. జల వనరుల పంపకాల విషయంలో పొరుగు రాష్ట్రాలతో నిర్మాణాత్మక సహకారానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. కేంద్ర మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 17 పేజీల ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఒక్కో అంశాన్ని ప్రస్తావిస్తూ.. వాస్తవాలు, వాటిపై జరిగిన నిర్ణయాలు, ట్రిబ్యునల్ తీర్పులను వివరించారు. సీఎం ప్రజెంటేషన్‌లోని ప్రధాన అంశాలివీ.. ఉమ్మడి రాష్ట్రంలోనే పాలమూరు, డిండి ⇒ కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం పూర్తిగా ఎత్తిపోతలతో కూడిన సాగునీటిపై ఆధారపడి ఉంది. మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలను అత్యంత తక్కువ సాగునీటి సౌకర్యం గల జిల్లాలుగా కేంద్రం కూడా గుర్తించింది. ⇒ పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు కొత్తగా చేపట్టారని.. కృష్ణా డెల్టా రైతులకు నష్టం చేకూర్చేలా ఉందని ఏపీ ఆరోపిస్తోంది. ప్రాజెక్టుల నిర్మాణ ప్రక్రియ ఆలోచనతో మొదలై, పరిశోధన, డిజైన్, వాస్తవ అమలు, పూర్తి చేయడం వరకు ఉంటుంది. కేవలం ఆలోచనల దశలోనే ఉంటే కొత్త ప్రాజెక్టవుతుంది. కానీ పాలమూరు-రంగారెడ్డి, డిండిలను ఉమ్మడి ఏపీలోనే చేపట్టారు. వాటికి నీటి కేటాయింపులు చేసి, నిర్మాణమూ ప్రారంభించారు. ⇒ పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయన నివేదిక తయారు చేయాలంటూ 2013 ఆగస్టు 8న జీవో 72 ఇచ్చారు. ప్రాజెక్టును పూర్తి చేస్తామని అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోల్లో హామీ ఇచ్చాయి. 2014 ఏప్రిల్ 22న అప్పటి ప్రధాని సైతం ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని బహిరంగ సభలో హామీ ఇచ్చారు. డిండి ప్రాజెక్టు చేపట్టేందుకు 2007 జూలై 7న జీవో 159 ఇచ్చారు. 2010 డిసెంబర్ 10న ప్రధాని కార్యాలయం సైతం డిండిని జాతీయ ప్రాజెక్టుగా పరిగణనలోకి తీసుకొనేందుకు ప్రతిపాదన కోరింది. వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంపై ఉంది. ఈ ప్రాజెక్టులకు వినియోగిస్తున్న నీరు రాష్ట్ర కేటాయింపుల్లోంచే ఉంది గనుక ఇవి కృష్ణా డెల్టాకు ఏ మాత్రం నష్టం చేకూర్చవు. ⇒ నదీ బోర్డుల నిర్వహణ గురించి చెప్పే విభజన చట్టం షెడ్యూల్-11లో గోదావరి బేసిన్ వివరాలను అసంపూర్తిగా ఉంచారు. దేవాదుల, ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ వరద కాల్వ స్టేజ్-2, ఇందిరాసాగర్ ఎత్తిపోతల, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తాడిపుడి, పుష్కర ఎత్తిపోతల వివరాలేవీ ఆ జాబితాలో లేవు. కృష్ణా బేసిన్‌లోని ఎస్ఎల్బీసీ, పాలమూరు-రంగారెడ్డి, డిండి, ఎస్సార్బీసీ, ముచ్చుమర్రి, గురు రాఘవేంద్ర పథకాల వివరాలూ పొందుపర్చలేదు. 47 చోట్ల టెలిమెట్రీకి ఓకే ‘కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో లెక్కలు పక్కాగా ఉండేందుకు పారదర్శక పర్యవేక్షణ వ్యవస్థ అవసరం. ఈ విషయంలో ప్రస్తుత తీరు అసంతృప్తికరంగా ఉంది. కాబట్టి ప్రధాన పాయింట్ల వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో లెక్కింపుకు టెలిమెట్రీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. వాటి పరిశీలనకు సంయుక్త బృందాలు ఏర్పాటు చేయాలి’ అని రాష్ట్రం కోరింది. ఇరు రాష్ట్రాల్లో బోర్డు సూచించిన 47 చోట్ల టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు ప్రతిపాదనకు అంగీకరించింది. నీటి వాటా పెరగాలి 1978 గోదావరి అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు రాగానే నాగార్జునసాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయని తెలంగాణ స్పష్టం చేసింది. ‘‘80 టీఎంసీల కేటాయింపుల్లో 21 టీఎంసీలు కర్ణాటకకు, 14 టీఎంసీలు మహారాష్ట్రకు పోగా 45 టీఎంసీలు ఉమ్మడి ఏపీకి వస్తాయని ఒప్పందంలోనే ఉంది. ప్రస్తుతం ఎగువ రాష్ట్రం తెలంగాణే అయినందున ఆ నీటి వాటా హక్కు తెలంగాణదే. బచావత్ అవార్డు ప్రకారం పోలవరం కాకుండా మరేదైనా కొత్త ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే అంతే పరిమాణంలో పై రాష్ట్రాలకు వాటా ఉంటుంది. ప్రస్తుతం ఏపీ చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో అంతర్భాగం కాదు. కేంద్రం కూడా లోక్‌సభలోనే ఈ మేరకు వెల్లడించింది. ఈ లెక్కన పట్టిసీమను కొత్త ప్రాజెక్టుగా పరిగణించి, దాని ద్వారా తరలిస్తున్న 80 టీఎంసీల్లో తెలంగాణకు 45 టీఎంసీలు ఇవ్వాలి. తెలంగాణకు అదనంగా 90 టీఎంసీల వాటా రావాలి. మొత్తం నీటి వాటాను 299 టీఎంసీల నుంచి 389 టీఎంసీలకు పెంచాలి’’ అని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. నిపుణుల కమిటీ సభ్యుల పక్షపాతం కృష్ణా బేసిన్లో నీటి నిర్వహణ తీరుతెన్నులపై కేంద్ర జల వనరుల శాఖ చొరవ హర్షణీయమని ప్రజెంటేషన్‌లో తెలంగాణ పేర్కొంది. అయితే నిపుణుల కమిటీ ఏర్పాటులో రాష్ట్రాన్ని సంప్రదించలేదని గుర్తు చేసింది. ‘‘తటస్థంగా ఉండాల్సిన కమిటీ సభ్యులు కొందరు పక్షపాతంతో వ్యవహరించారు. కమిటీలో ఉన్న మొహిలే గతంలో శ్రీకృష్ణ కమిటీలో జల వనరుల అంశానికి టెక్నికల్ మెంబర్‌గా ఉం డి తెలంగాణకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చారు. మరో సభ్యుడైన ఎంకే గోయల్ కృష్ణా బేసిన్లో ఏపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు నీటి లభ్యతపై అధ్యయనం చేస్తున్న కన్సల్టెన్సీలో పని చేస్తున్నా రు’’ అని ఫిర్యాదు చేసింది. వీరిద్దరినీ తొలగించి తటస్థ సభ్యులను నియమించాలని డి మాండ్ చేసింది. పరీవాహకాన్ని బట్టి కేటాయింపు పెంచాలి సాగర్ ఎగువన లోయర్ కృష్ణా సబ్ బేసిన్ (కే-7) పరీవాహక ప్రాంతం 22,952 చదరపు కిలోమీటర్లని తెలంగాణ వివరించింది. ‘‘ఇందులో 20,164 చదరపు కిలోమీటర్లు (88 శాతం) తెలంగాణ పరిధిలో ఉండగా కేవలం 2,788 చదరపు కిలోమీటర్లు (12) శాతం ఏపీలో ఉంది. సాగర్ ఎగువన ఆయకట్టు పరిధిలో తెలంగాణలో 40 లక్షల ఎకరాలుంది. కానీ అందులో 5 లక్షల ఎకరాలకే నీరందుతోంది. కృష్ణా బేసిన్ పరిధిలో తెలంగాణ జనాభా దాదాపు 2 కోట్లుంటే ఆ పరిధిలో ఏపీ జనాభా కేవలం 78 లక్షలే. ఏపీ చెబుతున్న 512 టీఎంసీల నీటి వినియోగంలో 350 టీఎంసీలు కృష్ణా బేసిన్‌కు ఆవలే వినియోగించుకుంటోంది. ఉమ్మడి రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో ఎస్ఎల్బీసీకి ప్రతిపాదించిన 45 టీఎంసీల నీటి వాటాలో 30 టీఎంసీలను గోదావరి నుంచి పోలవరం ద్వారా ఏపీ మళ్లిస్తోంది. వీటన్నింటి దృష్ట్యా తెలంగాణకు న్యాయమైన వాటా దక్కేలా చూడాలి’’ అని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. -
డిండికి చేరిన సైకిల్‌యాత్ర
డిండి : కర్నాటక – తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కృష్ణా– భీమానది సంగం నుంచి ప్రారంభించిన సైకిల్‌యాత్ర గురువారం డిండి మండల కేంద్రానికి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల ప్రజల అభ్యున్నతి కోసమే కృష్ణా నదమ్మ సైకిల్‌యాత్ర సుమారు 3,500 కిలోమీటర్లు నిర్వహిస్తున్నట్లు ఆధ్యాత్మిక అధ్యయన పర్యావరణ పరిరక్షణ వేత్త పొన్నాల గౌరీశంకర్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సుపరిపాలన అందించాలని ధర్మపరిరక్షణకు ప్రతిఒక్కరూ ఉద్యమించాలని కోరారు. కృష్ణానది పరీవాహక ప్రాంతాలను సందర్శిస్తూ దేవాలయాలను దర్శిస్తూ తెలంగాణ, ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలో ఈ యాత్ర సాగుతున్నట్లు ఆయన తెలిపారు. -
అలరించిన డ్యాన్స్ బేబీ డ్యాన్స్ పోటీలు
డింyì స్వాతంత్య్ర దిన వేడుకలను పురస్కరించుకుని మండల కేంద్రంలోని చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు, యువతులకు ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం ఆటల పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన డ్యాన్స్ బేబీ డ్యాన్స్ పోటీలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులు పలు రకాల పాటలకు స్టెప్పులేస్తూ అలరించారు. కార్యక్రమంలో పీఎస్ఐ రాఘవేందర్‌గౌడ్, చైతన్య యువజన సంఘం అధ్యక్షులు ఎలకుర్తి రమేష్, కటికర్ల పర్వతాలు, ఏ.టి. కృష్ణ, సముద్రాల రమేష్, మూఢావత్ రవి, వెంకటయ్య, రమేష్, శ్రీనివాసులు, సందీప్, కుకుడాల శ్రీను, మాధవ్‌గౌడ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
వారం రోజుల్లో ఇవ్వండి
పాలమూరు, డిండి డీపీఆర్‌లు సమర్పించాలని రాష్ట్రానికి కృష్ణా బోర్డు లేఖ సాక్షి, హైదరాబాద్: పాలమూరు, డిండి ఎత్తిపోతలకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లు సమర్పించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు రాష్ట్రానికి డెడ్‌లైన్ విధించింది. వారం రోజుల్లో ఈ ప్రాజెక్టుల డీపీఆర్‌లను సమర్పించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించాలన్నా, కేంద్ర జల వనరుల శాఖ, కేంద్ర జల సంఘానికి తాము వివరణ ఇవ్వాలన్నా డీపీఆర్‌లే ప్రధానమని పేర్కొంది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషికి లేఖ రాశారు. ‘‘పాలమూరు, డిండిలకు సంబంధించిన డీపీఆర్‌లు ఇవ్వాలని ఇప్పటికే పలుమార్లు కోరినా స్పందించలేదు. ఇటీవలే ఈ ప్రాజెక్టుల విషయమై సుప్రీంకోర్టులో దాఖలైన కేసులో ఈ రెండు ప్రాజెక్టుల అంశాన్ని అపెక్స్ కౌన్సిల్ పరిశీలిస్తుందని తెలిపింది. అందువల్ల డీపీఆర్‌లు సమర్పించండి. వీటినే కేంద్ర జల వనరుల శాఖ, కేంద్ర జల సంఘానికి సమర్పిస్తాం. అపెక్స్ కౌన్సిల్ భేటీలోనూ వీటినే ముందుంచుతాం’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. వీటితో పాటే ఈ రెండు ప్రాజెక్టుల ప్రస్తుత పురోగతి వివరాలను నివేదిక రూపంలో తమకు సమర్పించాలని బోర్డు సూచించింది. ఈ లేఖతో పాటు సుప్రీంకోర్టు ఆదేశాల కాపీని జత చేసింది. కృష్ణా జలాల విషయంలో తమకున్న కేటాయింపుల్లోంచే నీటిని వాడుకుంటున్నామని, ఎక్కడా పునర్విభజన చట్టాన్ని, ఇతర నిబంధనలను అతిక్రమించలేదని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే స్పష్టం చేస్తున్న తరుణంలో మరోమారు ప్రాజెక్టుల అంశాన్ని తెరపైకి తేవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం బోర్డుకు రాసిన లేఖలో.. పాలమూరు ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయన నివేదిక తయారు చేయాలంటూ 2013లోనే ఉత్తర్వులివ్వగా, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు చేపట్టేందుకు 2007 జూలై 7న మరో జీవో వెలువరించారని తెలిపింది. అయితే తాజాగా ఏపీ నుంచి వస్తున్న ఒత్తిళ్లు, అపెక్స్ భేటీ నిర్వహించి సమస్య పరిష్కరించాలని సుప్రీం ఆదేశాల నేపథ్యంలో ఈ ప్రాజెక్టుల అంశం మరోసారి చర్చల్లోకి వచ్చింది. -
డిండి ఎత్తిపోతల పూర్తయితే సస్యశ్యాలమం
కొండమల్లేపల్లి : డిండి ఎత్తిపోతల పథకం పనులు పూర్తయితే దేవరకొండ నియోజకవర్గం సస్యశ్యామలమవుతుందని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం దేవరకొండ మండలం గొట్టిముక్కల గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డిండి నుండి శివన్నగూడెం వరకు 5 రిజర్వాయర్లు, ఓపెన్ కెనాల్ మొత్తం 7 ప్యాకేజీలుగా సుమారు రూ. 3640 కోట్లతో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు గాను ప్రభుత్వం టెండర్ ప్రక్రియ ప్రారంభించిందన్నారు. 2018 జూన్ నాటికి డిండి ఎత్తిపోతల పథకం పూర్తయితే దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలతో పాటు మహబూబ్‌నగర్ జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తిలో చెరువులు, కుంటలు నింపడానికి వీలుంటుందన్నారు. సమావేశంలో దేవరకొండ జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, నల్లగాసు జాన్‌యాదవ్, శిరందాసు కృష్ణయ్య, వడ్త్య దేవేందర్, నాగవరం ప్రభాకర్‌రావు, చింతపల్లి పుల్లయ్య తదితరులున్నారు. కాన్వాయ్ వదిలి కాలినడకన 25డివికె504 : రమావత్తండా నుండి కాలి నడకన వస్తున్న ఎమ్మెల్యే రవీంద్రకుమార్ తదితరులు కొండమల్లేపల్లి : కాన్వాయ్ వదిలి... కాలి బాట పట్టారు.. దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్. సోమవారం దేవరకొండ మండల పరిధిలోని రమావత్ తండాలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. తండాకు రోడ్డు మార్గం లేకపోవడంతో సుమారు రెండు కిలో మీటర్లు నడిచి వెళ్లారు. -
‘మిషన్‌కాకతీయ’తో చెరువులకు మహర్దశ
డిండి : మిషన్ కాకతీయతో గ్రామాల్లో చెరువులకు మహర్దశ పట్టనుందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం మండల పరిధిలోని వావిల్‌కోల్ గ్రామంలోని చెరువు పూడికతీత పనులు ప్రారంభించి మాట్లాడారు. అనంతరం జోగ్యతండాలో, ఖానాపూర్‌లలో నూతనంగా ఏర్పాటు చేసిన బోరు మోటార్లను ప్రారంభించారు. అదేవిధంగా ఖానాపూర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి తహసీల్దార్ గణేష్‌నాయక్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, జేఈ జగదీశ్వర్‌రావు, గ్రామ సర్పంచ్ శాంతాభాయి, రాములమ్మ, సుధాకర్‌రెడ్డి, బల్ముల తిరుపతయ్య, వెంకటేశ్వర్రావు, సాగర్, దామోదర్‌రావు, అల్లావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
డిండి: మైనర్ బాలికకు పెద్దలు తలపెట్టిన వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. నల్లగొండ జిల్లా డిండి మండలం రామంతాపూర్ గ్రామానికి చెందిన వేముల తిరుపతయ్య కుమార్తె(14) వివాహం మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి మండలం గట్టుప్పల గ్రామానికి చెందిన సురేష్ అనే యువకుడితో నిశ్చయమైంది. శుక్రవారం ఉదయం రామంతాపూర్‌లో పెళ్లి వేడుకకు సర్వం సిద్ధం చేసుకున్నారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ సీడీపీవో సక్కుబాయి, ఎస్సై శేఖర్ అక్కడికి వెళ్లి పెళ్లిని అడ్డుకున్నారు.రెండు కుటుంబాల వారికి కౌన్సెలింగ్ చేశారు. మైనారిటీ తీరకుండా బాలికకు వివాహం చేయటం నేరమని వారికి వివరించారు. -
‘కృష్ణా’లో మళ్లీ కిరికిరి
పాలమూరు, డిండి, కల్వకుర్తి ప్రాజెక్టులపై తెలంగాణ వివరణ కోరిన కృష్ణా బోర్డు ♦ ఏపీ ఫిర్యాదులే కారణం సాక్షి, హైదరాబాద్: కృష్ణా నది జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య మళ్లీ అగ్గి రాజుకుంటోంది. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలతో పాటు, కల్వకుర్తి నీటి కేటాయింపుల పెంపు, అదనంగా వాటర్ గ్రిడ్‌కు 20 టీఎంసీల నీటి కేటాయింపుపై ఏపీ అభ్యంతరాలు లేవనెత్తుతుండటం, దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేయడం వివాదాన్ని రేపుతోంది. ఏపీ ఫిర్యాదుల నేపథ్యంలో కదిలిన కృష్ణా యాజమాన్య బోర్డు కొత్తగా చేపడుతున్న పథకాలకు నీటిని ఎక్కడి నుంచి ఏ రీతిన వాడుకుంటారో తమకు స్పష్టం చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై జవాబిచ్చేందుకు తెలంగాణ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే వివరణ ఇచ్చినా... ఏపీ అభ్యంతరాలు, ఫిర్యాదులపై ఇప్పటికే తెలంగాణ వివరణ ఇచ్చింది. నిజానికి కృష్ణా జలాల్లో బచావత్ అవార్డు మేరకు ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులున్నాయి. ఈ నీటి వినియోగంలో ప్రాజెక్టు వారీ కేటాయింపులు జరిపినా ప్రస్తుతం అవేవీ పూర్తికాలేదు. దీంతో తమకు జరిపిన కేటాయింపులను రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా వాడుకుంటామని చెబుతూ అదే రీతిని అనుసరిస్తుంది. దీనిపై ఏపీ పలుమార్లు అభ్యంతరాలు లేవనెత్తినా చివరికి జూన్ రెండో వారంలో కేంద్ర జల వనరుల శాఖ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ విధానాన్ని అంగీకరించింది. ఉమ్మడి ఏపీకి క్యారీ ఓవర్ కింద ఇచ్చిన 150 టీఎంసీలు, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో పూడిక కారణంగా వాడుకోలేకపోతున్న 170 టీఎంసీలు, పట్టిసీమలో భాగంగా ఉమ్మడి ఏపీకి ఇచ్చిన 45 టీఎంసీల్లో దక్కే వాటాల నీటితోనే పాలమూరు, డిండిలను చేపట్టామని, కల్వకుర్తి సామర్థ్యాన్ని పెంచామని చెబుతూ వచ్చింది. వాటర్ గ్రిడ్‌కు కృష్ణా జలాల్లో కేటాయించిన 19.59 టీఎంసీలను సైతం గంపగుత్తగా ఇచ్చిన వాటాల్లోంచే వాడుకుంటున్నామంది. తాజాగా మళ్లీ ఫిర్యాదులు... ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు వివరణలు ఇచ్చినా, దీనిపై ఏపీ మళ్లీ బోర్డుకు ఫిర్యాదు చేసింది. కొత్త ప్రాజెక్టులకు నీటిని ఎక్కడి నుంచి తీసుకుంటారో, వాటికి బోర్డు అనుమతి ఉందో లేదో వివరణ తీసుకోవాలని బోర్డుపై ఒత్తిడి తెస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి బోర్డు సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా తెలంగాణకు లేఖ రాశారు. ‘పాలమూరు, డిండి, కల్వకుర్తి నీటి కేటాయింపుల పెంపు, వాటర్ గ్రిడ్‌కు చేసిన కేటాయింపులపై మీరింతవరకు వివరణ ఇవ్వలేదు. ఈ ప్రాజెక్టులకు నీటిని రాష్ట్రానికి ఉన్న కేటాయింపుల్లోంచే వాడుకుంటారా? లేక ఇంకా ఎక్కడి నుంచి ఇస్తారో తెలపండి’ అని లేఖలో కోరారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు ఇరు రాష్ట్రాలు కొత్త ప్రాజెక్టులను చేపడితే బోర్డు అనుమతి పొందాల్సి ఉంటుందని లేఖలో గుర్తు చేశారు. -
దిండిలో రేషన్ బియ్యం పట్టివేత
దిండి : నల్గొండ జిల్లా దిండి మండలకేంద్రంలో పోలీస్‌స్టేషన్ చౌరస్తా వద్ద 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులతో కలిసి విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బోలెరో వాహనంలో దిండి నుంచి కల్వకుర్తి తరలిస్తుండగా బియ్యాన్ని పట్టుకున్నారు. డ్రైవర్‌ను, క్లీనర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిరాశే!
పాలమూరు -రంగారెడ్డికి భారీగా కేటాయింపులు డిండికి అత్తెసరు నిధులు.. ఇక జిల్లాలో చిన్న నీటిపారుదల ప్రాజెక్టులయిన లక్నాపూర్, శివసాగర్ ప్రాజెక్టులకు కొత్త కేటాయింపులు చేయలేదు. ఔటర్ రింగ్‌రోడ్డు లోపలున్న 199 గ్రామాలకు తాగునీటిని అందించే బాధ్యతను జలమండలికి అప్పగించారు. ఇది సంక్షేమ బడ్జెట్.. ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంక్షేమానికి, పారిశ్రామిక అభివృద్ధికి దిక్సూచి. సంక్షేమానికి రూ.13,412 కోట్లు, పారిశ్రామిక అభివృద్ధికి రూ. 4,815 కోట్లు కేటాయించడం ఇందుకు నిదర్శనం. పారిశ్రామిక, సాగునీటి పారుదల రంగాలకు మంచి కేటాయింపులు జరిగాయి. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి ద్వారా ఉపాధి మెరుగుపడుతుంది. - మహేందర్ రెడ్డి, మంత్రి రైతుల పట్ల చిత్తశుద్ధి ఏదీ..? రైతులకు రూ.7 వేల కోట్లు కేటాయించలేదంటే ప్రభుత్వానికి అన్నదాతలపై ఉన్న చిత్తశుద్ధి ఇట్టే అర్థమవుతుంది. డబుల్బెడ్రూం ఇళ్ల హామీతో ఓట్లు వేయించుకుని గెలిచిన ప్రభుత్వం బడ్జెట్లో మాత్రం మొండిచేయి చూపింది. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతలలో జిల్లాకు నీరందించే ప్రాంతంలో చేపట్టే పనులకు ఎలాంటి టెండర్లూ పిలవలేదు. - రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే, పరిగి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : రాష్ట్ర బడ్జెట్లో జిల్లాకు నిరాశే మిగిలింది. పాలమూరు- రంగారెడ్డికి భారీగా నిధులు కేటాయించిన సర్కారు.. డిండి నుంచి ఇబ్రహీంపట్నంకు కృష్ణాజలాలను తర లింపునకు అత్తెసరు నిధులు విదిల్చింది. శ్రీశైలం ఎగువ ప్రాంతం నుంచి కృష్ణాజలాలను తీసుకురావడం ద్వారా నై విచ్చుకున్న జిల్లాలను నేలలను సస్యశ్యామలం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంట్లో భాగంగా పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అంకురార్పణ చేసింది. రూ.35,200 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు ద్వారా మహబూబ్‌నగర్ (7లక్షల ఎకరాలు), రంగారెడ్డి (2.70 లక్షలు), నల్లగొండ (30 వేలు) ఆయకట్టును స్థిరీకరించాలని నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో పాలమూరు -రంగారెడ్డికి రూ.7,860.88 కోట్లు కేటాయించింది. అయితే ఈ నిధులు ఏ మూలకు సరిపోని పరిస్థితి ఏర్పడింది. ఇటీవల 18 ప్యాకేజీలకు టెండర్లను ఖరారు చేసిన ప్రభుత్వం.. దీంట్లో మన జిల్లాకు సంబంధించి ఒక్క ప్యాకేజీని కూడా పొందుపరచలేదు. మహబూబ్‌నగర్ జిల్లా కేపీ లక్ష్మిదేవుపల్లి నుంచి పరిగి, వికారాబాద్, తాండూరు, చేవెళ్ల నియోజకవర్గాలకు సాగు, తాగు నీరందించేలా ప్రాజెక్టుకు డిజైన్ చేసిన సర్కారు.. ఈ ప్యాకేజీలకు సంబంధించి సర్వే ప్రక్రియ కూడా మొదలు పెట్టలేదు. ఈ నేపథ్యంలో తాజా కేటాయింపులు కూడా పొరుగు జిల్లాకే పరిమితం కానున్నాయి. తాజా బడ్జెట్ కేటాయింపులను విశ్లేషిస్తే పాలమూరు దాటి జిల్లా దరికి కృష్ణమ్మ చేరాలంటే మరికొన్నాళ్లు వే చిచూడాల్సిందే! డిండికి రూ.780 కోట్లు! కరువు నేలల్లో హరితసిరులు పండించేందుకు దోహదపడుతుందని భావించిన డిండి ప్రాజెక్టుకు బడ్జెట్లో మోస్తరు నిధులు కేటాయించారు. ఎదుల రిజ ర్వాయర్ నుంచి 22.47 టీఎంసీల సామర్థ్యం కృష్ణాజలాలను దేవరకొండ, క ల్వకుర్తి, మునుగోడు మీదుగా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలకు తరలించాలని నిర్ణయించింది. మార్గమధ్యంలో రిజర్వాయర్లు, పైప్లన్లు, కాల్వల నిర్మాణానికిగాను రూ.7వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. ఈ క్రమంలోనే శివన్నగూడ రిజర్వాయర్ నుంచి ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ప్రాంతాల కు 5 టీఎంసీలను తరలించేలా ప్రతిపాదనలు తయారు చేసింది. మరో నాలుగువారాల్లో సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను ఖరారు చేసి టెండర్లు పిలుస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. బడ్జెట్లో కేటాయింపులు మాత్రం అంతంతమాత్రంగానే చేసింది. కేవలం రూ.780 కోట్లు మాత్రమే విదిల్చి చేతులు దులుపుకుంది. ఈ కేటాయింపులను పరిశీలిస్తే చివరి ఆయకట్టు ప్రాంతమైన మన జిల్లాకు నీరు రావాలంటే కనీసం ఆరేళ్లయినా పట్టే అవకాశంలేకపోలేదు. ఇక జిల్లాలో చిన్న నీటిపారుదల ప్రాజెక్టులయిన లక్నాపూర్, శివసాగర్ ప్రాజెక్టులకు కొత్త కేటాయింపులు చేయకపోవడం గమనార్హం. ఇక కోట్‌పల్లికి రూ.2.30 కోట్లు కేటాయించారు. మిషన్ కాకతీయకు పెద్దపీట మిషన్ కాకతీయకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఈ ఏడాది రెండో దశ కింద చెరువుల పునరుద్ధర ణకు దాదాపు రూ.300 కోట్లు నిర్ధేశించింది. తద్వారా జిల్లావ్యాప్తంగా 560 చెరువులను బాగు చేయనుంది. కూరగాయల సాగు, ఉద్యానవనాల పెంపకాన్ని ప్రోత్సహించాలని భావించిన ప్రభుత్వం... సూక్ష్మ, బిందు సేద్యానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పాలీహౌజ్, గ్రీన్‌హౌజ్‌ల కల్టివేషన్‌కు సబ్సిడీ పరిమితి పెంచనున్నట్లు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. జలమండలిలోకి ఔటర్ గ్రామాలు ఔటర్ రింగ్‌రోడ్డు లోపలి గ్రామాలకు ఇక జలమండలి తాగు నీటిని సరఫరా చేయనుంది. 199 గ్రామాలకు తాగునీటిని అందించే బాధ్యతను జలమండలికి అప్పగిస్తూ బడ్జెట్లో పొందుపరిచింది. పారిశ్రామిక విస్తర ణ, ఐటీ సంస్థల తాకిడిని ప్రత్యేకంగా ప్రస్తావించిన విత్తమంత్రి ఫార్మాసిటీ రాకతో రంగారెడ్డి జిల్లా దశ మారనుందని వ్యాఖ్యానించారు. -
డిండిలో జేసీ పర్యటన
రాష్ట్ర ప్రభుత్వం దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాలని నిర్ణయించుకున్న సందర్భంగా ప్రభుత్వ భూములు లేని ప్రాంతాల్లో భూమి కొనుగోలు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లా జేసీ సత్యనారాయణ డిండి మండలం కె. గౌరారం గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని భూములను పరిశీలించారు. -
దిండి రిసార్ట్ వద్ద ఆందోళన
మలికిపురం: తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం దిండి రిసార్టుల సమీపంలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ పంట పొలాల నుంచి పైప్‌లైన్ వేయొద్దంటూ రైతులు చేపట్టిన ఆందోళన రెండో రోజు కొనసాగుతోంది. దిండిలో గెయిల్ గ్యాస్ పైపులైను నిర్మాణ పనుల దృష్ట్యా శుక్రవారం నాడు విధించిన 144 సెక్షన్ శనివారం కూడా కొనసాగుతోంది. నగరం గ్యాస్ పైపులైన్ పేలుడు దుర్ఘటన తర్వాత గ్యాస్ సరఫరాలో ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలో గ్యాస్ పైపులైనును తిరిగి నిర్మించాలని కేంద్రం ఆదేశించింది. అయితే, భారీ పేలుడు దుర్ఘటన అనుభవంతో దిండిలో పైప్‌లైను నిర్మాణ పనులకు స్థానిక రైతులు అభ్యంతరం చెప్పారు. దీంతో ఐదు నెలలుగా పనులు నిలిచిపోయాయి. తాజాగా కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలతో భారీగా పోలీసులను మోహరించి పనులను చేపట్టారు. దీంతో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఉన్న దిండి రిసార్టుల సమీపంలో కూడా ఆందోళన, ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. గోదావరి తీరం వెంట ఉండే ఈ రిసార్టుల వద్దకు వారాంతాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది వస్తుంటారు. -
దిండిలో 144 సెక్షన్
మలికిపురం: తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం దిండిలో గెయిల్ గ్యాస్ పైపు నిర్మాణ పనుల దృష్ట్యా 144 సెక్షన్ విధించారు. సుమారు 200 మంది పోలీసుల రక్షణ నడుమ పైప్‌లైన్ పనులను గెయిల్ సిబ్బంది ప్రారంభించారు. నగరం గ్యాస్ పైపులైన్ పేలుడు దుర్ఘటన తర్వాత గ్యాస్ సరఫరాలో ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలో గ్యాస్ పైపులైనును తిరిగి నిర్మించాలని కేంద్రం ఆదేశించింది. అయితే, భారీ పేలుడు దుర్ఘటన అనుభవంతో దిండిలో పైప్‌లైను నిర్మాణ పనులకు స్థానిక రైతులు అభ్యంతరం చెప్పారు. దీంతో ఐదు నెలలుగా పనులు నిలిచిపోయాయి. తాజాగా కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలతో భారీగా పోలీసులను మోహరించి పనులను చేపట్టారు.