ఘర్షణ పడుతున్న టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు
సాక్షి, నల్గొండ: దిండి మండల కేంద్రంలోని హైవే మధ్యలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు భూమిపూజ జరుగుతోందని వాట్సాప్ గ్రూపుల్లో వచ్చిన మెసేజ్ టీఆర్‌ఎస్, బీజేపీ నాయకుల మధ్య చిచ్చురేపింది. డిండిలోని హైవే డివైడర్‌పై దాదాపు 1.5 కిలో మీటర్ల దూరం ఏర్పాటు చేసే సెంట్రల్ లైటింగ్, రెండు జంక్షన్ల నిర్మాణానికి రోడ్డు రవాణా, హైవే రహదారుల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కోటా నుంచి రూ.85 లక్షలు మంజూరయ్యాయి. కాగా, బీసీ జాతీయ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు భూమిపూజ చేయడానికి డిండికి వస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, స్థానిక టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులకు ఎలాంటి సమాచారం లేకుండానే ఆచారి భూమి పూజకు రావడం ఏమిటని టీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి: నమ్మించి ఫోన్‌తో పరార్.. కట్ చేస్తే.. ‘నీ ఫోన్ తీసుకెళ్లినందుకు క్షమించు’
పోలీసులతో మాట్లాడుతున్న తల్లోజు ఆచారి
శనివారం కార్యకర్తలను కలిసేందుకు డిండికి వచ్చిన జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారిని టీఆర్‌ఎస్ నాయకులు రాజీవ్‌గాంధీ చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి ఆచారి గోబ్యాగ్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో బీజేపీ, టీఆర్‌ఎస్ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని తోపులాట జరిగింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ అంతరాయం కలుగడంతో పోలీసులు రెండు పార్టీల నాయకులను అక్కడి నుంచి పంపించి వేశారు. టీఆర్‌ఎస్ నాయకుల నిరసనపై ముందస్తు సమాచారం ఉండడంతో డిండి ఎస్‌ఐ.సరేష్, కొండమల్లేపల్లి పోలీసుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
చదవండి: సాధారణ సబ్బు రూ.20 నుంచి 60 ఉంటే.. ఈ సబ్బు రూ.96 అట.. కారణం ఏంటో తెలుసా?
తెలంగాణలో నియంత పాలన
తెలంగాణలో నియంత పాలన నడుస్తోందని బీసీ జాతీయ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి అన్నారు. స్థానిక ఓ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలకులు పాలనపై దృష్టి పెట్టకుండా టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలను గూండాలుగా తయారు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాను, డిండి మీదుగా నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలానికి వెళ్తున్న క్రమంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించినందుకు కార్యకర్తలు స్వాగతం పలికేందుకు వచ్చారని తెలిపారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్ వర్గాలు ఘర్షణకు దిగడం బాధాకరమన్నారు. కేవలం తాను పార్టీ కార్యకర్తలను కలవడానికి మాత్రమే డిండిలో కాసేపు ఆగానని, భూమిపూజకు రాలేదని స్పష్టం చేశారు. ఆయన వెంట ఆ పార్టీ జిల్లా నాయకుడు ఏటి.కృష్ణ, ఎంపీటీసీ ఏటి.రాధిక, సైదా, వెంకటయ్య, శ్రీను, జైపాల్, రాఘవ, అంజి,అజయ్, రమేష్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment