మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు, జర్పుల చీన్యా(ఫైల్)
సాక్షి, నల్గొండ: దివ్యాంగుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన డిండి మండల పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండల పరిధిలోని పడమటితండాకు చెందిన జర్పుల చీన్యా(45) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 25ఏళ్ల క్రితం విద్యుదాఘాతం చోటు చేసుకోవడంతో రెండు చేతులు కోల్పోయాడు. చీన్యాకు అదే తండాకు చెందిన మహిళతో వివాహం జరిగింది. వారికి కుమారుడు శివ జన్మించాడు. దంపతుల మధ్య మనస్పర్థల కారణంగా చీన్యా భార్య కుమారుడిని వదిలి ఇంటినుంచి వెళ్లిపోయింది. అప్పటినుంచి చీన్యా కుమారుడితో కలిసి జీవనం సాగిస్తున్నాడు. కాగా, చీన్యా అదే తండాకు చెందిన రాత్లావత్ మహిళ (పండు)తో సఖ్యతగా మెలుగుతున్నాడు. ఈ విషయం పెద్ద మనుషుల వద్దకు వెళ్లినా తీరు మార్చుకోలేదు. 20ఏళ్లుగా సఖ్యతగానే ఉంటున్నారు.
చదవండి: మరణించిన టీచర్ పేరుతో రూ.33 లక్షలు డ్రా... కొడుక్కి విషయం తెలియడంతో..
పిల్లలు పెద్దయ్యారని..
చీన్యా కుమారుడు శివకు 20 ఏళ్లుగా కాగా, పండు కుమారుడికి వివాహం జరిగింది. ఇకపై ఇద్దరం కలుసుకోవడం కుదరదని పండు ప్రియుడు చీన్యాకు చెప్పింది. అయినా చీన్యా వినకుండా ఆమెపై ఒత్తిడి చేస్తున్నాడు. దీంతో అతడిని అంతమొందించాలని నిర్ణయించుకుంది. ఈ విషయం తన కుమారుడు సురేష్‌కు తెలిపి పథకం రచించింది. అనుకున్న విధంగానే చీన్యా ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత భర్త లేని సమయంలో పండు ఇంటికి వెళ్లాడు. అప్పటికే మాటు వేసి ఉన్న పండు, ఆమె కుమారుడు సురేష్ చీన్యాపై గొడ్డలితో దాడి చేశారు. దీంతో చీన్యా అక్కడినుంచి పారిపోతుండగా పట్టుకుని ఇంటి వద్దకు లాకెళ్లి నరికి దారుణంగా మట్టుబెట్టారు. సమాచారం తెలుసుకున్న చీన్యా కుమారుడు శివ అతడి కుంటుంబ సభ్యులు, బంధువులు ఘటన స్థలానికి చేరుకునే సరికి అతడు రక్తపు మడుగులో విగతజీవుడిగా పడి ఉన్నాడు.
చదవండి: ఎక్కువరోజులు ఉండలేను.. హైదరాబాద్ వచ్చేస్తా.. సీన్ కట్ చేస్తే..
సర్పంచ్‌కు ఫోన్ చేసి..
చీన్యాను హత్య చేసిన విషయాన్ని పండు స్థానిక సర్పంచ్ పాండుకు ఫోన్ చేసి చెప్పింది. పిల్లలు పెద్దయ్యారని సఖ్యతగా మెలగడం కుదరదని, గతంలో చేసినా పొరపాటు మళ్లీ చేయవద్దని కోరినా ఒత్తిడి చేయడంతో మట్టుబెట్టగా తప్పలేదని వివరించింది. వెంటనే సర్పంచ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలాన్ని సీఐ బీసన్న, డిండి ఎస్‌ఐ సురేష్, చందంపేట ఎస్‌ఐ యాదయ్య పరిశీలించారు. చీన్యాను తానే గొడ్డలితో నరికి చంపానని పండు పోలీసుల వద్ద లొంగిపోవడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె కుమారుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహానికి దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం చేయించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి కుమారుడు శివ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ.సురేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment