ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, నల్లగొండ: ప్రేమించానని వెంటపడి మాయమాటలు చెప్పాడు.. ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో ఎదిరించి మరీ వివాహం చేసుకున్నాడు.. మూడు నెలలు గడిచాయో లేదో.. వరకట్నం తీసుకురావాలని తల్లితో కలిసి వేధించాడు.. ఇటు కన్నవారికి దూరమై.. అటు మెట్టినింటి బాధలు తట్టుకోలేక ఆ.. అభాగ్యురాలు మరణశాసనం లిఖించుకుంది. ఈ విషాదకర ఘటన నల్లగొండ జిల్లా డిండి మండల పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండలం వావిల్‌కొల్ గ్రామానికి చెందిన మబ్బు అలెమ్మ, చిన నాగయ్య దంపతుల కూతురైన శ్రీలత(24), అదే గ్రామానికి చెందిన జుట్టు బొజ్జమ్మ, మొగిలయ్య కుమారుడు చిన్నయ్య ఏదాది కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో పోలీసులను ఆశ్రయించి వివాహం చేసుకున్నారు.
మూడు మాసాలకే..
వివాహమైన తర్వాత చిన్నయ్య, శ్రీలత దంపతులు గ్రామంలోనే కిరాణ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, కొంత కాలం సజావుగా సాగిన వీరి కాపురంలో వరకట్నం చిచ్చురేపింది. పుట్టింటి నుంచి కట్నం, బైక్ తీసుకురావాలంటూ చిన్నయ్య తన తల్లి బొజమ్మతో కలిసి వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో, శ్రీలత పుట్టింటికి వెళ్లలేక.. ఇటు భర్త, అత్తల చిత్రహింసలు తట్టుకోలేక చనిపోవాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే గురువారం రాత్రి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా గ్రామ శివారులోని ఓ వ్యవసాయ భూమిలో చెట్టుకు ఉరేసుకుంది. అయితే, అనుమానంతో కుటుంబ సభ్యులు వెతకగా అప్పటికే విగతజీవిగా మారింది.
సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అత్తింటి వేధింపులతోనే శ్రీలత ఆత్మహత్య చేసుకుందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతురాలి సోదురుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పోచయ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment