బాధ్యత కేంద్రానిదే! | Telangana presentation before the Apex Council | Sakshi
Sakshi News home page

బాధ్యత కేంద్రానిదే!

Published Thu, Sep 22 2016 2:51 AM | Last Updated on Fri, Mar 22 2019 2:57 PM

బాధ్యత కేంద్రానిదే! - Sakshi

బాధ్యత కేంద్రానిదే!

తెలంగాణకు న్యాయం చేయాల్సింది కేంద్రమేన్న రాష్ట్ర ప్రభుత్వం
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది
దానిని ఇప్పుడైనా సరిచేయండి
పాలమూరు, డిండిలు ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులే
ప్రధాని సైతం 2014 ఏప్రిల్ 22న  పాలమూరు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు
పట్టిసీమ, పోలవరంల కింద తెలంగాణకు 90టీఎంసీలు రావాలి
ఈ మేరకు కృష్ణాలో వాటా 389 టీఎంసీలకు పెంచాలి
పరీవాహకం, ఆయకట్టు ఆధారంగా వాటా పెంచాలని విజ్ఞప్తి
పొరుగు రాష్ట్రాలతో నిర్మాణాత్మక సహకారానికి కట్టుబడి ఉన్నామని వెల్లడి
అపెక్స్ కౌన్సిల్ ముందు తెలంగాణ ప్రజెంటేషన్
బోర్డు సూచించిన 47 చోట్ల టెలిమెట్రీ అమలుకు ఓకే

సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జలాల విషయంలో న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నదీ జలాల కేటాయింపులు, ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని పేర్కొంది. దాన్ని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వమైనా సరిచేయాలని అర్థించింది. ఏపీ ఆరోపిస్తున్నట్టు పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల కొత్త ప్రాజెక్టులేమీ కాదని పునరుద్ఘాటించింది. వాటికి ఉమ్మడి రాష్ట్రంలోనే జీవోలు ఇచ్చారని గుర్తు చేసింది.

గోదావరి, కృష్ణా ట్రిబ్యునల్‌ల గత తీర్పుల మేరకు పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల కింద తెలంగాణకు న్యాయంగా 90 టీఎంసీల వాటా దక్కాలని, ఆ మేరకు రాష్ట్ర వాటాను పెంచాలని విజ్ఞప్తి చేసింది. జల వనరుల పంపకాల విషయంలో పొరుగు రాష్ట్రాలతో నిర్మాణాత్మక సహకారానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. కేంద్ర మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 17 పేజీల ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఒక్కో అంశాన్ని ప్రస్తావిస్తూ.. వాస్తవాలు, వాటిపై జరిగిన నిర్ణయాలు, ట్రిబ్యునల్ తీర్పులను వివరించారు. సీఎం ప్రజెంటేషన్‌లోని ప్రధాన అంశాలివీ..

 ఉమ్మడి రాష్ట్రంలోనే పాలమూరు, డిండి
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం పూర్తిగా ఎత్తిపోతలతో కూడిన సాగునీటిపై ఆధారపడి ఉంది. మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలను అత్యంత తక్కువ సాగునీటి సౌకర్యం గల జిల్లాలుగా కేంద్రం కూడా గుర్తించింది.

పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు కొత్తగా చేపట్టారని.. కృష్ణా డెల్టా రైతులకు నష్టం చేకూర్చేలా ఉందని ఏపీ ఆరోపిస్తోంది. ప్రాజెక్టుల నిర్మాణ ప్రక్రియ ఆలోచనతో మొదలై, పరిశోధన, డిజైన్, వాస్తవ అమలు, పూర్తి చేయడం వరకు ఉంటుంది. కేవలం ఆలోచనల దశలోనే ఉంటే కొత్త ప్రాజెక్టవుతుంది. కానీ పాలమూరు-రంగారెడ్డి, డిండిలను ఉమ్మడి ఏపీలోనే చేపట్టారు. వాటికి నీటి కేటాయింపులు చేసి, నిర్మాణమూ ప్రారంభించారు.

పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయన నివేదిక తయారు చేయాలంటూ 2013 ఆగస్టు 8న జీవో 72 ఇచ్చారు. ప్రాజెక్టును పూర్తి చేస్తామని అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోల్లో హామీ ఇచ్చాయి. 2014 ఏప్రిల్ 22న అప్పటి ప్రధాని సైతం ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని బహిరంగ సభలో హామీ ఇచ్చారు. డిండి ప్రాజెక్టు చేపట్టేందుకు 2007 జూలై 7న జీవో 159 ఇచ్చారు. 2010 డిసెంబర్ 10న ప్రధాని కార్యాలయం సైతం డిండిని జాతీయ ప్రాజెక్టుగా పరిగణనలోకి తీసుకొనేందుకు ప్రతిపాదన కోరింది. వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంపై ఉంది. ఈ ప్రాజెక్టులకు వినియోగిస్తున్న నీరు రాష్ట్ర కేటాయింపుల్లోంచే ఉంది గనుక ఇవి కృష్ణా డెల్టాకు ఏ మాత్రం నష్టం చేకూర్చవు.

నదీ బోర్డుల నిర్వహణ గురించి చెప్పే విభజన చట్టం షెడ్యూల్-11లో గోదావరి బేసిన్ వివరాలను అసంపూర్తిగా ఉంచారు. దేవాదుల, ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ వరద కాల్వ స్టేజ్-2, ఇందిరాసాగర్ ఎత్తిపోతల, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తాడిపుడి, పుష్కర ఎత్తిపోతల వివరాలేవీ ఆ జాబితాలో లేవు. కృష్ణా బేసిన్‌లోని ఎస్‌ఎల్‌బీసీ, పాలమూరు-రంగారెడ్డి, డిండి, ఎస్సార్‌బీసీ, ముచ్చుమర్రి, గురు రాఘవేంద్ర పథకాల వివరాలూ పొందుపర్చలేదు.

47 చోట్ల టెలిమెట్రీకి ఓకే
‘కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో లెక్కలు పక్కాగా ఉండేందుకు పారదర్శక పర్యవేక్షణ వ్యవస్థ అవసరం. ఈ విషయంలో ప్రస్తుత తీరు అసంతృప్తికరంగా ఉంది. కాబట్టి ప్రధాన పాయింట్ల వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో లెక్కింపుకు టెలిమెట్రీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. వాటి పరిశీలనకు సంయుక్త బృందాలు ఏర్పాటు చేయాలి’ అని రాష్ట్రం కోరింది. ఇరు రాష్ట్రాల్లో బోర్డు సూచించిన 47 చోట్ల టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు ప్రతిపాదనకు అంగీకరించింది.

నీటి వాటా పెరగాలి
1978 గోదావరి అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు రాగానే నాగార్జునసాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయని తెలంగాణ స్పష్టం చేసింది. ‘‘80 టీఎంసీల కేటాయింపుల్లో 21 టీఎంసీలు కర్ణాటకకు, 14 టీఎంసీలు మహారాష్ట్రకు పోగా 45 టీఎంసీలు ఉమ్మడి ఏపీకి వస్తాయని ఒప్పందంలోనే ఉంది. ప్రస్తుతం ఎగువ రాష్ట్రం తెలంగాణే అయినందున ఆ నీటి వాటా హక్కు తెలంగాణదే.

బచావత్ అవార్డు ప్రకారం పోలవరం కాకుండా మరేదైనా కొత్త ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే అంతే పరిమాణంలో పై రాష్ట్రాలకు వాటా ఉంటుంది. ప్రస్తుతం ఏపీ చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో అంతర్భాగం కాదు. కేంద్రం కూడా లోక్‌సభలోనే ఈ మేరకు వెల్లడించింది. ఈ లెక్కన పట్టిసీమను కొత్త ప్రాజెక్టుగా పరిగణించి, దాని ద్వారా తరలిస్తున్న 80 టీఎంసీల్లో తెలంగాణకు 45 టీఎంసీలు ఇవ్వాలి. తెలంగాణకు అదనంగా 90 టీఎంసీల వాటా రావాలి. మొత్తం నీటి వాటాను 299 టీఎంసీల నుంచి 389 టీఎంసీలకు పెంచాలి’’ అని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.

నిపుణుల కమిటీ సభ్యుల పక్షపాతం
కృష్ణా బేసిన్‌లో నీటి నిర్వహణ తీరుతెన్నులపై కేంద్ర జల వనరుల శాఖ చొరవ హర్షణీయమని ప్రజెంటేషన్‌లో తెలంగాణ పేర్కొంది. అయితే నిపుణుల కమిటీ ఏర్పాటులో రాష్ట్రాన్ని సంప్రదించలేదని గుర్తు చేసింది. ‘‘తటస్థంగా ఉండాల్సిన కమిటీ సభ్యులు కొందరు పక్షపాతంతో వ్యవహరించారు. కమిటీలో ఉన్న మొహిలే గతంలో శ్రీకృష్ణ కమిటీలో జల వనరుల అంశానికి టెక్నికల్ మెంబర్‌గా ఉం డి తెలంగాణకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చారు. మరో సభ్యుడైన ఎంకే గోయల్ కృష్ణా బేసిన్‌లో ఏపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు నీటి లభ్యతపై అధ్యయనం చేస్తున్న కన్సల్టెన్సీలో పని చేస్తున్నా రు’’ అని ఫిర్యాదు చేసింది. వీరిద్దరినీ తొలగించి తటస్థ సభ్యులను నియమించాలని డి మాండ్ చేసింది.

పరీవాహకాన్ని బట్టి కేటాయింపు పెంచాలి
సాగర్ ఎగువన లోయర్ కృష్ణా సబ్ బేసిన్ (కే-7) పరీవాహక ప్రాంతం 22,952 చదరపు కిలోమీటర్లని తెలంగాణ వివరించింది. ‘‘ఇందులో 20,164 చదరపు కిలోమీటర్లు (88 శాతం) తెలంగాణ పరిధిలో ఉండగా కేవలం 2,788 చదరపు కిలోమీటర్లు (12) శాతం ఏపీలో ఉంది. సాగర్ ఎగువన ఆయకట్టు పరిధిలో తెలంగాణలో 40 లక్షల ఎకరాలుంది. కానీ అందులో 5 లక్షల ఎకరాలకే నీరందుతోంది. కృష్ణా బేసిన్ పరిధిలో తెలంగాణ జనాభా దాదాపు 2 కోట్లుంటే ఆ పరిధిలో ఏపీ జనాభా కేవలం 78 లక్షలే. ఏపీ చెబుతున్న 512 టీఎంసీల నీటి వినియోగంలో 350 టీఎంసీలు కృష్ణా బేసిన్‌కు ఆవలే వినియోగించుకుంటోంది. ఉమ్మడి రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో ఎస్‌ఎల్‌బీసీకి ప్రతిపాదించిన 45 టీఎంసీల నీటి వాటాలో 30 టీఎంసీలను గోదావరి నుంచి పోలవరం ద్వారా ఏపీ మళ్లిస్తోంది. వీటన్నింటి దృష్ట్యా తెలంగాణకు న్యాయమైన వాటా దక్కేలా చూడాలి’’ అని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement