సాక్షి, హైదరాబాద్: మూడున్నర వేల ఏళ్ల క్రితం నాటి స్మారక శిల (మెన్హిర్) వెలుగు చూసింది. నాగర్‌కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం కంసానిపల్లె గ్రామ శివారులో డిండి నదీ తీరంలో దీన్ని గుర్తించారు. వారసత్వ ప్రాంతాలను పరిరక్షించాలంటూ ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాల్లో భాగంగా ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో, పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గురువారం డిండి నదీ తీరాన్ని సందర్శించారు. కొండారెడ్డి పల్లి– ఉప్పునుంతల మధ్యలో నదీ తీరంలో ఈ నిలువురాయిని గుర్తించారు. భూ ఉపరితలంలో ఎనిమిది అడుగుల ఎత్తు, రెండడుగుల వెడల్పు, ఒకటిన్నర అడుగు మందంతో ఉన్న ఈ స్మారక శిల కొంతమేర పక్కకు ఒరిగి ఉంది.
గ్రానైట్ శిలతో చేసిన ఈ స్మారకం 3,500 ఏళ్ల క్రితం ఇనుపయుగం నాటిదిగా ఆయన పేర్కొన్నారు. అప్పట్లో స్థానిక మానవసమూహంలో చనిపోయిన ప్రముఖుడికి గుర్తుగా దీన్ని పాతారని, గతంలో ఈ ప్రాంతంలో ఆదిమానవుల కాలం నాటి బంతిరాళ్ల సమాధులు ఉండేవని, వ్యవసాయ పనుల్లో భాగంగా అవి కనుమరుగయ్యాయని స్థానికులు తిప్పర్తి జగన్‌మోహన్‌రెడ్డి, అభిలాశ్‌రెడ్డి, సాయికిరణ్‌రెడ్డి తదితరులు ఆయన దృష్టికి తెచ్చారు. మన చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఉన్న ఈ నిలువు రాయినైనా కాపాడుకోవాలని ఆయన స్థానికులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment