26 అడుగుల ఎత్తయిన పురాతన ఏకశిల విగ్రహం
ఆలయం లేక పూజలకు నోచని గణపతి
పశ్చిమ చాళుక్యుల కాలంనాటి భారీ గణనాథుడు
నాగర్‌కర్నూల్ జిల్లాలోని తిమ్మాజిపేట మండలం ఆవంచలో కొలువు
ఆవంచకు పూర్వం ఆవుల మంచాపురం అనే పేరు
సాక్షి, నాగర్‌కర్నూల్: దేశంలోనే ఎత్తయిన ఏకశిలా వినాయకుని విగ్రహం నాగర్‌కర్నూల్ జిల్లాలోని తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో ఉంది. దుందుభీ వాగు తీరంలో వెలసిన ఈ వినాయకుడికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది.
కర్ణాటకలోని శ్రావణ బెళగోళలోని గోమటేశ్వరుడు, చాముండి కొండపై నందీశ్వరుడితోపాటు.. ఆవంచలోని గణపతి సైతం అతిపెద్ద ఏకశిలా విగ్రహాలుగా ప్రసిద్ధి. హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్ల దూరంలో.. జడ్చర్ల పట్టణానికి చేరువలో ఆవంచ గ్రామంలో ఈ మహా గణనాథుని విగ్రహం ఉంది.
ఏటా వినాయక చవితి సందర్భంగా వందలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి మహా గణపతిని దర్శించుకుంటారు. స్థానికులు ఐశ్వర్య గణపతిగా పిలిచే గణనాథునికి ఇప్పటికీ ఆలయం లేకపోవడంతో నిత్య పూజలకు నోచుకోవడం లేదు.
పశ్చిమ చాళుక్యుల కాలంలో..
పశ్చిమ చాళుక్యుల కాలంలో ప్రముఖులైన జగదేకమల్లుడు, భువనైకమల్లుడు, తైలోక్యమల్లుడు ఆవుల మంచాపురాన్ని రాజధానిగా చేసుకుని పాలించారు. నాటి ఆవుల మంచాపురాన్నే కాలక్రమంలో ఆవంచగా పిలుస్తున్నారు. తెలుగు నేలను పాలించిన ఇక్షాు్వ్కలు.. గణపతి భక్తులు కావడంతో ఇక్కడ 26 అడుగుల ఎత్తయిన ఏకశిలా గణపతిని నెలకొల్పినట్లు చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు.
పశ్చిమ చాళుక్యుల కాలంలో వెలుగొందిన ఆవంచ గ్రామంలో లభించిన విగ్రహాలు, శిల్పాలను మహబూబ్‌నగర్ జిల్లాలోని పిల్లలమర్రి మ్యూజియంలో భద్రపరిచారు. పశ్చిమ చాళుక్యుల కాలంలోనే గ్రామ శివారులోని భైరవాలయంలోని ప్రతిమలు, మరో స్తంభంపై శివపంచాయతనం చెక్కినట్లు స్పష్టమవుతోంది.
ఆదరణ లేక..
ఆవంచలోని భారీ ఏకశిలా గణనాథునికి ఆలయాన్ని నిర్మించేందుకు ఒక చారిటబుల్ ట్రస్టు ఏడేళ్ల కిందట ముందుకొచి్చంది. ఆలయం కోసం ఆరు ఎకరాల స్థలాన్ని సైతం కొనుగోలు చేసింది.
అయితే ఆలయ నిర్మాణ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. ఏళ్ల తరబడి ఆలయ నిర్మాణానికి నోచుకోకపోవడంతో వినాయకునికి నిలువ నీడ లేకుండా పోయింది. ప్రభుత్వం స్పందించి ఆలయ నిర్మాణం చేపట్టి.. పర్యాటకంగానూ అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ప్రభుత్వం దృష్టి సారించాలి
పురాతన కాలం నాటి వినాయకుని ఏకశిలా విగ్రహానికి ఆలయ నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించాలి. ఏళ్లపాటు గణనాథుడు నిరాదరణకు గురవుతున్నాడు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఆవంచ వినాయకుని పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. – కిరణ్, ఆవంచ, తిమ్మాజిపేట మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment