lord vinayaka statues
-
మహా ‘ఘన’పతిం..
సాక్షి, నాగర్‌కర్నూల్: దేశంలోనే ఎత్తయిన ఏకశిలా వినాయకుని విగ్రహం నాగర్‌కర్నూల్ జిల్లాలోని తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో ఉంది. దుందుభీ వాగు తీరంలో వెలసిన ఈ వినాయకుడికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. కర్ణాటకలోని శ్రావణ బెళగోళలోని గోమటేశ్వరుడు, చాముండి కొండపై నందీశ్వరుడితోపాటు.. ఆవంచలోని గణపతి సైతం అతిపెద్ద ఏకశిలా విగ్రహాలుగా ప్రసిద్ధి. హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్ల దూరంలో.. జడ్చర్ల పట్టణానికి చేరువలో ఆవంచ గ్రామంలో ఈ మహా గణనాథుని విగ్రహం ఉంది. ఏటా వినాయక చవితి సందర్భంగా వందలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి మహా గణపతిని దర్శించుకుంటారు. స్థానికులు ఐశ్వర్య గణపతిగా పిలిచే గణనాథునికి ఇప్పటికీ ఆలయం లేకపోవడంతో నిత్య పూజలకు నోచుకోవడం లేదు. పశ్చిమ చాళుక్యుల కాలంలో.. పశ్చిమ చాళుక్యుల కాలంలో ప్రముఖులైన జగదేకమల్లుడు, భువనైకమల్లుడు, తైలోక్యమల్లుడు ఆవుల మంచాపురాన్ని రాజధానిగా చేసుకుని పాలించారు. నాటి ఆవుల మంచాపురాన్నే కాలక్రమంలో ఆవంచగా పిలుస్తున్నారు. తెలుగు నేలను పాలించిన ఇక్షాు్వ్కలు.. గణపతి భక్తులు కావడంతో ఇక్కడ 26 అడుగుల ఎత్తయిన ఏకశిలా గణపతిని నెలకొల్పినట్లు చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. పశ్చిమ చాళుక్యుల కాలంలో వెలుగొందిన ఆవంచ గ్రామంలో లభించిన విగ్రహాలు, శిల్పాలను మహబూబ్‌నగర్ జిల్లాలోని పిల్లలమర్రి మ్యూజియంలో భద్రపరిచారు. పశ్చిమ చాళుక్యుల కాలంలోనే గ్రామ శివారులోని భైరవాలయంలోని ప్రతిమలు, మరో స్తంభంపై శివపంచాయతనం చెక్కినట్లు స్పష్టమవుతోంది. ఆదరణ లేక.. ఆవంచలోని భారీ ఏకశిలా గణనాథునికి ఆలయాన్ని నిర్మించేందుకు ఒక చారిటబుల్ ట్రస్టు ఏడేళ్ల కిందట ముందుకొచి్చంది. ఆలయం కోసం ఆరు ఎకరాల స్థలాన్ని సైతం కొనుగోలు చేసింది. అయితే ఆలయ నిర్మాణ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. ఏళ్ల తరబడి ఆలయ నిర్మాణానికి నోచుకోకపోవడంతో వినాయకునికి నిలువ నీడ లేకుండా పోయింది. ప్రభుత్వం స్పందించి ఆలయ నిర్మాణం చేపట్టి.. పర్యాటకంగానూ అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.ప్రభుత్వం దృష్టి సారించాలి పురాతన కాలం నాటి వినాయకుని ఏకశిలా విగ్రహానికి ఆలయ నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించాలి. ఏళ్లపాటు గణనాథుడు నిరాదరణకు గురవుతున్నాడు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఆవంచ వినాయకుని పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. – కిరణ్, ఆవంచ, తిమ్మాజిపేట మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా -
Ganesh Chaturthi 2024: అమృత ఘడియల్లో విషమెందుకు?
వినాయకుడి విగ్రహం తయారీ ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ఇనుము, సింథటిక్ రంగులతో పాదరసం, క్రోమియం, సీసం, లెడ్ ఆర్సనిక్ తదితర విషపూరిత రసాయనాలను వాడుతున్నారు. వీటితో జీవవైవిధ్యం దెబ్బతింటున్నది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నీటిలో కరగదు. మట్టిలో కలవదు. నిప్పుకు కూడా దహనం కాదు. దీనిలో జిప్సం అనేది ముడి పదార్థంగా ఉంటుంది. ఈ విగ్రహాలను నీటివనరుల్లో వేస్తాం. ఆ నీటిని వాడితే డయేరియా, స్కిన్ క్యాన్సర్‌తో పాటు అనేక చర్మ వ్యాధులు సోకే ప్రమాదం వుంది. ముఖ్యంగా తగరంతో చర్మ వ్యాధులు వచ్చి చర్మం రంగు మారుతుంది. ఆర్సనిక్ వల్ల జుట్టు రాలిపోతుంది. సీసం వల్ల కడుపు నొప్పి వస్తుంది. శరీరం పట్టుత్వం తగ్గుతుంది. అంతేగాక ఆ రసాయనాల నీటిని పంట పాలాలకు మళ్లిస్తే భూసారం తగ్గి భూమి సహజ స్వరూపాన్ని కోల్పోతుంది.మట్టితో చేసిన ప్రతిమల వల్ల పైన చెప్పుకున్న ప్రమాదాలేవీ ఉండవు. పర్యావరణానికి ఎటువంటి హాని జరగదు. చూడటానికి కూడా విగ్రహం ముచ్చటగా ఉంటుంది. పండుగ తర్వాత నిమజ్జనం చేసిన కొద్దిసేపట్లోనే నీటిలో కరిగి΄ోతుంది. దీనివల్ల పర్యావరణం, జీవవైవిధ్యం రెండు కూడా సమతులంగా ఉంటాయి. మట్టి విగ్రహం తయారీలో కేవలం బంకమట్టి మాత్రమే వాడతారు. ఎలాంటి రంగులు వాడరు. కాబట్టి నీరు కలుషితం కాదు.ఎంత విగ్రహం పెట్టి పూజిస్తే అంత గొప్ప అనుకోవడం మానేయాలి. విగ్రహం సైజు కంటే భక్తి ముఖ్యం. పర్యావరణం పట్ల బాధ్యత అంతకంటే ముఖ్యం. రసాయన రంగుల విగ్రహాల వల్ల పర్యావరణం, జీవవైవిధ్యం దెబ్బితింటాయి. రాబోవు రోజుల్లో జీవకోటికి ప్రమాదం ఏర్పడుతుంది. – డాక్టర్ ఎల్ నాగిరెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, పర్యావరణ విభాగం, శ్రీకృష్ణదేవరాయ ఉద్యాన కళాశాల, అనంతపురం -
వివాహం చేసే శ్వేత వినాయకర్
సముద్ర నురుగుతో తయారుచేసినట్లు చెప్పే వినాయక విగ్రహం ప్రపంచంలో ఒకటే ఒకటి ఉంది. ఆ విగ్రహం తమిళనాడులో శ్వేత వినాయకర్ పేరుతో పూజలు అందుకొంటూ ఉంది. ఇక్కడ విగ్రహానికి అభిషేకం చేయరు, పూలు, కుంకుమ, పసుపుతో అర్చన చేయరు. వస్త్రాలు కూడా కట్టరు. అంటే ఏవిధంగానూ విగ్రహాన్ని తాకరు. విగ్రహాన్ని తాకకుండా కేవలం పచ్చ కర్పూరం పొడిని విగ్రహం పైకి చల్లుతారు. ఈ విగ్రహాన్ని వినాయకచవితి రోజు పూజిస్తే ప్రతి రోజు వినాయక పూజ చేసిన ఫలితం దక్కుతుందని స్థానికులు చెబుతారు. ఇక స్వామిని సేవిస్తే వివాహ విషయంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. మహిమ ఏమిటి? ఇక్కడ వినాయకుడు మహావిష్ణువు కళ్ల నుంచి పుట్టిన ఇంద్రదేవి కమలాంబల్, బ్రహ్మ వాక్కు నుంచి పుట్టిన బుద్ధి దేవిని వివాహం చేసుకొన్నారని స్థలపురాణం. అందువల్లే ఇక్కడ స్వామిని సేవిస్తే వివాహ విషయంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఎక్కడ ఉంది?: ఈ శ్వేత వినాయక దేవాలయం కుంభకోణం బస్టాండు నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. తమిళనాడులోని తంజావూర్ జిల్లాలోని కుంభకోణం తాలూకాలో ఉన్న స్వామిమలై సమీపంలోని తిరువల్లాంచూజి గ్రామంలో ఉన్న ఒక హిందూ ఆలయం ఈ శ్వేత వినాయగర్ దేవాలయం. -
మట్టి గణపతికి జై!
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు వద్దు.. నష్టాలున్నాయంటున్న పర్యావరణ నిపుణులు పర్యావరణాన్ని రక్షించు కోవాలంటూ ప్రచారం సత్తెనపల్లి: వినాయక చవితి వచ్చేస్తోంది...గ్రామాలు, పట్టణాలలో ప్రతి ఇంటితో పాటు వీధివీధినా గణనాధులు కొలువుదీరనున్నారు... పూజలందుకోనున్నారు. అయితే ఆర్భాటంగా జరిగే ఈ ఉత్సవాల్లో మట్టి ప్రతిమలనే పూజించాలంటూ పర్యావరణ పరిరక్షకులు ప్రచారం చేస్తున్నారు. మట్టి వినాయకులను పూజించడమే ఆచారమని తెలియజేస్తున్నారు. ‘మట్టి’ మేలు తలపెట్టవోయ్.. గ్రామాల్లో, పట్టణాల్లో వినాయక మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఒక్క సత్తెనపల్లి నియోజకవర్గంలోనే మొత్తం మీద నాలుగు మండలాలు, పట్టణంతో కలిపి సుమారు 700లకు పైగానే వినాయక మండపాలు ఏర్పాటు చేస్తున్నట్లు అంచనా. ఇవిగాక ప్రతి ఇంట వినాయక ప్రతిమలతో పూజలు చేస్తారు. ఇలా ఏర్పాటయ్యే మండపాల్లో అందం, ఆకర్షణ కోసం ఎక్కువగా రంగురంగుల ప్లాస్టర్ పారిస్ వినాయక విగ్రహాలను వినియోగించడానికే ఎక్కువ మంది మొగ్గుచూపుతుండడం గమనార్హం. ఇదే పర్యావరణానికి పెద్ద సమస్యగా మారుతోంది. ఉత్సవ నిర్వాహకులు వాస్తవ పరిస్థితులు పరిగణనలోకి తీసుకుని, పర్యావరణ హితంగా వేడుకలు నిర్వహిస్తే మనల్ని మనం రక్షించుకోవడంతోపాటు పర్యావరణాన్ని రక్షించుకున్న వారమవుతామని పలువురు పేర్కొంటున్నారు. ప్రతి ఒక్కరు మట్టి ప్రతిమలనే ఏర్పాటు చేసుకుని ఉత్సవాలను నిర్వహించుకోవాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే కొంత మంది పర్యావరణ ప్రేమికులు, పలు స్వచ్ఛంద సంస్థల వారు మట్టి వినాయకులనే పూజించాలంటూ ప్రచారం చేస్తున్నారు. మట్టితో లాభాలు.. సహజ సిద్ధంగా పొలాల్లో దొరికే బంక మట్టితో విగ్రహాలు తయారు చేసుకోవడం మంచిది. ఇవి నీటిలో సులభంగా కరిగిపోతాయి. మట్టి వినాయక విగ్రహాల నిమజ్జనంతో నీటి వనరులకు ఎలాంటి నష్టం ఉండదు. మట్టి సులువుగా నీటిలో కరిగిపోయి జీవరాసులకు మేలు చేస్తుంది. సహజసిద్ధమైన చెట్ల ఆకులు, బెరడుతో తయారు చేసే రంగులను మట్టి బొమ్మలకు అద్ది ఆకర్షణీయంగా తయారు చేసుకోవచ్చు. రసాయనాలతో అనర్థాలు.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసే విగ్రహాలు కాలువలు, నదుల్లో నిమజ్జనం చేసినా కరుగవు. వీటికి పూసిన రంగులు నీటిని కలుషితం చేస్తాయి. ఈనీటిని తాగిన పశువులకు జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. రసాయనాలు కలిసిన నీటి మూలంగా శరీరంలో నరాలపై ప్రభావం చూపి క్యాన్సర్ వ్యాధికి దారితీస్తుంది. చర్మవ్యాధులు వ్యాప్తి చెందుతాయి. రసాయనిక రంగులు కలిసిన నీరు పంట పొలాల్లో చేరి దిగుబడులు తగ్గించడమే కాకుండా ఆహార ఉత్పత్తులను కలుషితం చేస్తుంది ప్లాస్టర్ పారిస్ నీటిలో కరగడానికి కొన్నేళ్ళు పడుతుంది. నీరు, నేల, గాలి అన్నింటిపైన కాలుష్య ప్రభావం ఉంటుంది.