మట్టి గణపతికి జై! | Jai.. ho..! soil vinayaka statues | Sakshi
Sakshi News home page

మట్టి గణపతికి జై!

Published Mon, Aug 29 2016 7:30 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM

మట్టి గణపతికి జై!

మట్టి గణపతికి జై!

ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాలు వద్దు.. 
నష్టాలున్నాయంటున్న పర్యావరణ నిపుణులు
పర్యావరణాన్ని రక్షించు కోవాలంటూ ప్రచారం
 
సత్తెనపల్లి: వినాయక చవితి వచ్చేస్తోంది...గ్రామాలు, పట్టణాలలో ప్రతి ఇంటితో పాటు వీధివీధినా గణనాధులు కొలువుదీరనున్నారు... పూజలందుకోనున్నారు. అయితే ఆర్భాటంగా జరిగే ఈ ఉత్సవాల్లో  మట్టి ప్రతిమలనే పూజించాలంటూ పర్యావరణ  పరిరక్షకులు ప్రచారం చేస్తున్నారు. మట్టి వినాయకులను పూజించడమే ఆచారమని తెలియజేస్తున్నారు.  
 
‘మట్టి’ మేలు తలపెట్టవోయ్‌..
గ్రామాల్లో, పట్టణాల్లో వినాయక మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఒక్క సత్తెనపల్లి నియోజకవర్గంలోనే మొత్తం మీద నాలుగు మండలాలు, పట్టణంతో కలిపి సుమారు 700లకు పైగానే వినాయక మండపాలు ఏర్పాటు చేస్తున్నట్లు అంచనా. ఇవిగాక ప్రతి ఇంట వినాయక ప్రతిమలతో పూజలు చేస్తారు. ఇలా ఏర్పాటయ్యే మండపాల్లో  అందం, ఆకర్షణ  కోసం ఎక్కువగా రంగురంగుల ప్లాస్టర్‌ పారిస్‌ వినాయక విగ్రహాలను వినియోగించడానికే ఎక్కువ మంది మొగ్గుచూపుతుండడం గమనార్హం. ఇదే పర్యావరణానికి పెద్ద సమస్యగా మారుతోంది. ఉత్సవ నిర్వాహకులు వాస్తవ పరిస్థితులు పరిగణనలోకి తీసుకుని,   పర్యావరణ హితంగా వేడుకలు నిర్వహిస్తే మనల్ని మనం రక్షించుకోవడంతోపాటు పర్యావరణాన్ని రక్షించుకున్న వారమవుతామని పలువురు పేర్కొంటున్నారు. ప్రతి ఒక్కరు మట్టి ప్రతిమలనే ఏర్పాటు చేసుకుని ఉత్సవాలను నిర్వహించుకోవాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే కొంత మంది పర్యావరణ ప్రేమికులు, పలు స్వచ్ఛంద సంస్థల వారు మట్టి వినాయకులనే పూజించాలంటూ ప్రచారం చేస్తున్నారు.  
 
మట్టితో లాభాలు..
  • సహజ సిద్ధంగా పొలాల్లో దొరికే బంక మట్టితో విగ్రహాలు తయారు చేసుకోవడం మంచిది. ఇవి నీటిలో సులభంగా కరిగిపోతాయి.
  • మట్టి వినాయక విగ్రహాల నిమజ్జనంతో నీటి వనరులకు ఎలాంటి నష్టం ఉండదు. మట్టి సులువుగా నీటిలో కరిగిపోయి జీవరాసులకు మేలు చేస్తుంది.
  • సహజసిద్ధమైన చెట్ల ఆకులు, బెరడుతో తయారు చేసే రంగులను మట్టి బొమ్మలకు అద్ది ఆకర్షణీయంగా తయారు చేసుకోవచ్చు.
రసాయనాలతో అనర్థాలు..
  • ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో తయారు చేసే విగ్రహాలు కాలువలు, నదుల్లో నిమజ్జనం చేసినా కరుగవు. 
  • వీటికి పూసిన రంగులు నీటిని కలుషితం చేస్తాయి. ఈనీటిని తాగిన పశువులకు జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది.
  • రసాయనాలు కలిసిన నీటి మూలంగా శరీరంలో నరాలపై ప్రభావం చూపి క్యాన్సర్‌ వ్యాధికి దారితీస్తుంది. చర్మవ్యాధులు వ్యాప్తి చెందుతాయి.
  • రసాయనిక రంగులు కలిసిన నీరు పంట పొలాల్లో చేరి దిగుబడులు తగ్గించడమే కాకుండా ఆహార ఉత్పత్తులను కలుషితం చేస్తుంది
  • ప్లాస్టర్‌ పారిస్‌ నీటిలో కరగడానికి కొన్నేళ్ళు పడుతుంది. నీరు, నేల, గాలి అన్నింటిపైన కాలుష్య ప్రభావం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement