నాగర్‌కర్నూల్ డీపీఓకు హైకోర్టు ఆదేశం
స్టే ఉత్తర్వులుండగా కూల్చివేతపై ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: చట్టవిరుద్ధంగా, స్టే ఆదేశాలను బేఖాతర్ చేస్తూ చిన్నషెడ్ కూల్చివేసినందుకు బాధ్యత వహిస్తూ సొంత ఖర్చుతో పున:నిర్మించాలని నాగర్‌కర్నూల్ జిల్లా పంచాయతీ అధికారిని హైకోర్టు ఆదేశించింది. నిలిపివేత ఉత్తర్వులున్నా పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరుపేద దంపతులు కట్టుకున్న చిన్నషెడ్‌ను బుల్డోజర్‌తో కూల్చివేసి అధికారులు తమ ఆధిపత్యాన్ని చూపే ప్రయత్నం చేశారని మండిపడింది.
ఇదే తీరులో పలుకుబడి వర్గానికి చెందిన వారి నిర్మాణాలకు కూల్చగలరా అని ప్రశ్నించింది. నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంటలో చాలా ఏళ్ల క్రితం ఇల్లు (చిన్నషెడ్) నిర్మించుకున్నామని, సంబంధిత డాక్యుమెంట్లు సమర్పించినా కూల్చివేతకు నోటీసులు జారీ చేశారంటూ కటకం మహేశ్, నాగలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చిన్న బడ్డీషాపు నిర్వహణకు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవడంతోపాటు ఆస్తి పన్ను చెల్లిస్తున్న విషయాన్ని కూడా కనీసం పరిగణనలోకి తీసుకోలేదన్నారు.
ఎలాంటి కారణం లేకుండానే నిర్మాణాల తొలగింపునకు పంచాయతీరాజ్ అధికారులు నోటీసులు జారీ చేశారన్నారు. ఈ నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర స్టే ఉత్తర్వులను కోర్టు మంజూరు చేసింది. మరోవైపు తమ వాదనలను దాఖలు చేయాలని పంచాయతీరాజ్ శాఖను కోర్టు ఆదేశించింది.
కౌంటర్ దాఖలు చేయకుండా, మధ్యంతర స్టే ఉత్తర్వులు కొనసాగుతుండగానే మహేష్, నాగలక్ష్మిల ఇంటిని అధికారులు కూల్చివేశారు. పిటిషన్‌పై జస్టిస్ టి.మాధవీదేవి విచారణ చేపట్టారు. సోమవారం విచారణ సందర్భంగా డీపీఓను నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించడంతో మంగళవారం ఆయన కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు సొంత ఖర్చుతో నిర్మాణం చేపట్టాలని న్యాయమూర్తి ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment