వృద్ధుడి అనుమానాస్పద మృతి
Published Sun, Jan 8 2017 11:25 PM | Last Updated on Tue, Sep 5 2017 12:45 AM
మలికిపురం :
దిండి గ్రామంలో ఆదివారం గుడాల ప్రకాష్ (96) అనే వృద్ధుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. అతని మృత దేహం తన ఇంటిలోనే రక్తపు మడుగులో కుర్చీలోనే ఉంది. ఇది హత్యా, లేక ఆత్మ హత్యా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కత్తితో గొంతు కోసి రక్తపు మడుగులో మృత దేహం పడి ఉన్న తీరు అనుమానాస్పదంగా ఉంది. కుటుంబ సభ్యులు మాత్రం ఇది ఆత్మహత్యేనని పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో పేర్కొంటున్నారు. సీఐ క్రిస్టోఫర్ మాట్లాడుతూ ప్రకాష్ భార్య ఆదెమ్మ గత ఏడాది నవంబరు 29న మృతి చెందారని అప్పటి నుంచి మానసిక స్థితి సరిగా లేక భార్య వద్దకే వెళ్లిపోతానంటూ ఇంతకు ముందు రెండుసార్లు ఆత్మహత్యకు పాల్పడ్డారని అప్పట్లో అడ్డుకున్నామని కుటుంబ సభ్యులు చెప్పినట్టు పేర్కొన్నారు. ఆదివారం ప్రకాష్ బంధువులు అల్పాహారం పెట్టారని తెలిపారు. ఇంటిలో ఓ పక్క అద్దెకు ఉంటున్న వారు చర్చికి వెళ్తూ ప్రకాష్‌కు చెప్పేందుకు వెళ్లగా తలుపు గడియ వేసి ఉందని, తీయడం లేదన్నారు. దీంతో ఆమె గ్రామంలో మరో చోట నివాసం ఉంటున్న అతని కుమార్తెకు తెలియచేసింది. ప్రకాష్ మానసిక పరిస్థితి మేరకు అతని బంధువులు అతని గదికి మరో వైపు తలుపులు బయట వైపు తాళం వేసి ఉంచుతున్నారు. దీంతో ఆ తలుపులు తెరిచి చూడగా రక్తపుమడుగులో ఉన్న ప్రకాష్‌ను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృత దేహాన్ని పోస్టు మార్టంకు రాజోలు ప్రభుత్వాస్పత్రికి పంపి రిపోర్టు అనంతరం తదుపరి విచారణ చేస్తామని ఆయన తెలిపారు.
Advertisement
Advertisement