అపెక్స్ భేటీకి సిద్ధం కండి!
రాష్ట్రానికి కేంద్ర జల వనరుల శాఖ సమాచారం
* పాలమూరు, డిండి డీపీఆర్‌లపై బోర్డు నోటీసులు
* పట్టిసీమ డీపీఆర్, ఆర్డీఎస్ కుడి కాలువలపై ఏపీకి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను పరిష్కరించేందుకు కేంద్రం సన్నద్ధమైంది. ఈ మేరకు ఈ నెలలోనే అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించే అవకాశాలున్నాయంటూ కేంద్ర జల వనరుల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. ఇప్పటికే తాము కోరిన సమాచారంపై సన్నద్ధతతో ఉండాలని సూచించింది.
ఇక కేంద్ర జల వనరుల శాఖ ఉత్తర్వుల మేరకు పాలమూరు, డిండి ప్రాజెక్టుల డీపీఆర్‌లను తమ ముందుంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, పట్టిసీమ డీపీఆర్‌ను అందజేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కృష్ణా, గోదావరి బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ ఇరు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేశారు. కృష్ణా ప్రాజెక్టుల నియంత్రణ, నీటి కేటాయింపుల్లో వాటాలు, కొత్తగా తెలంగాణ చేపడుతున్న పాలమూరు, డిండిలతో పాటు ఏపీ చేపడుతున్న పట్టిసీమ ప్రాజెక్టులపై వివాదాలు కొనసాగుతున్నాయి. అయితే పాలమూరు, డిండి ప్రాజెక్టులపై ఏపీకి చెందిన కొందరు రైతులు ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించగా... అపెక్స్ కౌన్సిల్ భేటీలో పరిష్కరించుకోవాలని, ఆ భేటీకి కేంద్రం చొరవ చూపాలని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో అపెక్స్ భేటీ నిర్వహించే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు నీటి పారుదల వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే పాలమూరు, డిండి ప్రాజెక్టులు పాతవేనని రుజువు చేసే జీవోలను తెరపైకి తె చ్చిన తెలంగాణ... 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించడానికి ఏపీ చేపట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణకు దక్కే వాటాల అంశాన్ని ప్రస్తావిస్తోంది. పోలవరం ప్రాజెక్టులో పట్టిసీమ అంతర్భాగమైతే.. గోదావరి ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం 45 టీఎంసీలు తమకు వాటాగా దక్కుతాయని అంటోంది. ఇక బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ నోటిఫై కాకముందే ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్) కుడి కాలువకు 4 టీఎంసీలు మళ్లించేందుకు ఏపీ సిద్ధమవుతోందని, ఇది ధిక్కారమేననీ అంటోంది. ఈ అన్ని అంశాలపై కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగే అపెక్స్ కౌన్సిల్ భేటీలోనే తుది పరిష్కారం దక్కే అవకాశం ఉంది.