సాక్షి, అమరావతి: శ్రీశైలం, నాగార్జున సాగర్‌లను కృష్ణా బోర్డుకు అప్పగించకుండా తెలంగాణ సహాయ నిరాకరణ చేస్తే సుప్రీంకోర్టుకు నివేదించాలని కేంద్రం నిర్ణయించింది. గత నెల 17న కేంద్ర జల్ శక్తి శాఖ నిర్వహించిన సమావేశంలో నెలలోగా ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాల అధికారులు అంగీకరించారు. కానీ, ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకోగానే తెలంగాణ అధికారులు మాటమార్చారు.
ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింత విధి విధానాల ఖరారుకు ఈనెల 1న హైదరాబాద్‌లో జరిగిన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలోనూ ఉమ్మడి ప్రాజెక్టులకు రెండు రాష్ట్రాల అధికారులు అంగీకరించినట్లు ప్రకటించినా, ఆ తర్వాత తెలంగాణ అధికారులు మరోసారి మాటమార్చారు. ఈ నేపథ్యంలో గత నెల 17న తీసుకున్న నిర్ణయాల అమలుపై ఈనెల 16న ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రాజెక్టుల అప్పగింతకు తెలంగాణ అధికారులు అంగీకరించకపోయినా లేదా గైర్హాజరైనా అదే అంశాన్ని సుప్రీంకోర్టుకు నివేదించి, కోర్టు మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకోవాలని
కేంద్రం నిర్ణయించినట్లు అధికారవర్గాలు తెలిపాయి.
శ్రీశైలం ప్రాజెక్టుకు 2021లో ఎగువ నుంచి వరద రాకుండానే తెలంగాణ జెన్‌కో విద్యుదుత్పత్తి ప్రారంభించింది. ఇక్కడి నుంచి నీటిని సాగర్‌కు తరలించింది. ఇలా శ్రీశైలం జలాశయాన్ని ఖాళీ చేస్తూ రాష్ట్ర హక్కులను హరిస్తుండటంతో సీఎం వైఎస్ జగన్ న్యాయ పోరాటానికి దిగారు. కృష్ణాబోర్డు పరిధిని నోటిఫై చేసి, అక్రమంగా విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణను కట్టడి చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
దాంతో కృష్ణాబోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర జల్ శక్తి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి ప్రాజెక్టులను ఏడాదిలోగా బోర్డుకు అప్పగించాలని కేంద్రం ఆదేశించింది. శ్రీశైలం, సాగర్‌లో రాష్ట్ర భూభాగం పరిధిలోని ఆరు అవుట్‌లెట్లను బోర్డుకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ సర్కారు మాత్రం తమ భూభాగంలోని తొమ్మిది అవుట్‌లెట్లను అప్పగించేందుకు నిరాకరించింది.
యథేచ్ఛగా తెలంగాణ జలచౌర్యం
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గతేడాది అక్టోబర్ 6న కృష్ణా బోర్డు రాష్ట్రానికి కేటాయించిన 30 టీఎంసీల్లో 17 టీఎంసీలను ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు తెలంగాణ సర్కార్ తరలించింది. ఆ 17 టీఎంసీలను గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడి కాలువ ద్వారా విడుదల చేయాలని రాష్ట్ర అధికారులు చేసిన వి/æ్ఞప్తులను తెలంగాణ పట్టించుకోలేదు.
ఇదే విషయాన్ని సీఎం వైఎస్ జగన్‌కు అధికారులు వివరించారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత కేంద్రం రాష్ట్రానికి అప్పగిస్తే.. తెలంగాణ భూభాగంలో ఉందంటూ ఎడమ గట్టు విద్యుత్కేంద్రాన్ని తెలంగాణ సర్కారు అధీనంలోకి తీసుకుందని, అదే తరహాలో రాష్ట్ర భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ స్పిల్ వే 13 గేట్లతోసహా కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను అధీనంలోకి తీసుకుని, నీటిని విడుదల చేయాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. దాంతో నవంబర్ 30 తెల్లవారుజామున సీఈ మురళీనాథ్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర పోలీసులు, జలవనరుల అధికారులు సాగర్ స్పిల్ వేలో సగాన్ని, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
తాగు నీటి అవసరాల కోసం కుడి కాలువకు 2,300 క్యూసెక్కులు విడుదల చేశారు. దీనిపై తెలంగాణ సర్కారు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దాంతో డిసెంబర్ 1న రెండు రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, సంయమనం పాటించాలని ఆదేశించారు. సాగర్‌పై నవంబర్ 30 నాటి యథాస్థితిని కొనసాగిస్తూ నిర్వహణ బాధ్యతను బోర్డుకు అప్పగించారు. ఈ వివాదాన్ని పరిష్కరించాలని కేంద్ర జల్ శక్తి శాఖను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment