కేంద్ర మంత్రి షెకావత్‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపెక్స్ కౌన్సిల్ భేటీలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్. చిత్రంలో ఏపీ సీఎం వైఎస్ జగన్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన మంగళవారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశం వాడీ వేడిగా సాగింది. ఇక్కడి శ్రమశక్తి భవన్‌లో మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు జరిగిన ఈ సమావేశానికి ఢిల్లీ నుంచి ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, హైదరాబాద్ నుంచి తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా హాజరయ్యారు. ఏపీ పునర్‌వ్యవ స్థీకరణ చట్టం–2014ను అనుసరించి... కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీ, కొత్త ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం, గోదావరి, కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డుల విధులను పర్యవేక్షించడం, ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి ఈ అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైంది. తొలిసారిగా 2016లో అపెక్స్ కౌన్సిల్ సమావేశమవగా.. నాలుగేళ్ల అనంతరం మంగళవారం రెండో సమావేశం జరిగింది. భేటీ ఎజెండా అంశాలపై సయోధ్య కుదిరినప్పటికీ ప్రాజెక్టుల విషయంలో ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరి వాదనలు వారు గట్టిగా వినిపించారు. నాలుగు ఎజెండా అంశాలపై తొలుత కేంద్రం ప్రెజెంటేషన్ ఇచ్చింది.
అనంతరం కేసీఆర్ తన వాదన వినిపించారు. కొత్త ట్రిబ్యునల్ ఇచ్చేంతవరకు ఏది మాట్లాడినా లాభం లేదన్నారు. తాను పంపించిన అంశాలు ఎజెండాలో లేవన్నారు. అయితే ఆలస్యంగా అందినందున ఆ అంశాలు చేర్చలేదని, మరోసారి సమావేశమవ్వొచ్చని షెకావత్ సూచించారు. ఈ నేపథ్యంలో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంపుపై తాను పంపిన అభ్యంతరాలను కేసీఆర్ ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈ అభ్యంతరాలను తిప్పికొట్టారు. గోదావరి నదిపై కాళేశ్వరం, సీతారామసాగర్ తదితర ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రభుత్వం విస్తరణ పేరుతో కొత్తగా ప్రాజెక్టులు చేపడుతోందని, ఆంధ్రప్రదేశ్‌లో అదేరీతిలో తాము ప్రాజెక్టులు విస్తరిస్తే అభ్యంతరం ఎందుకన్నారు. రెండు రాష్ట్రాలకు ఒకే విధానం ఉండాలని తన అభిప్రాయం చెప్పారు. కేంద్ర మంత్రి ఈ వాదనలతో ఏకీభవించారు. ‘రెండూ ఒకేరీతిలో ఉండాలి. ఒకచోట ఒక విధానం, మరొకచోట మరో విధానం ఉండరాదు..’అని సూచించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాల ప్రయోజనాలను కాంక్షిస్తూ వాదనలు వినిపించారు. ‘డీపీఆర్‌లు సమర్పిస్తే ప్రాజెక్టులపై ఇరురాష్ట్రాల అభ్యంతరాలు పరిశీలించడానికి అవకాశం ఉంటుంది..’అని కేంద్ర మంత్రి అన్నారు. దీనికి ఇద్దరు ముఖ్యమంత్రులు సమ్మతించారు.
ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేసీఆర్ పట్టు
రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీని అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదచట్టంలోని సెక్షన్ 3ను అనుసరించి కొత్త ట్రిబ్యునల్‌కు రెఫర్ చేయాలని తాము చేసిన అభ్యర్థనను పరిష్కరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే పట్టుపట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వాదన సరిగ్గా వినలేదని, రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీపై లోతుగా అధ్యయనం జరగాలని కోరారు. అయితే కేంద్ర జలశక్తి మంత్రి దీనికి స్పందిస్తూ ‘ప్రాజెక్టుల డీపీఆర్‌లు, బోర్డుల పరిధి, ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటేనెన్స్ వంటి అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి. వీటన్నింటినీ ట్రిబ్యునల్ ఒక్కటే పరిష్కరించలేదు. మీరు సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరించుకుంటామని చెబితే కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుంది’అని సమాధానం ఇచ్చారు.
ఎజెండా అంశాలు... కేంద్రం స్పందన
1. బోర్డుల పరిధి
బోర్డులు ఏర్పడి ఆరేళ్లయినప్పటికీ వీటి పరిధి నోటిఫై కాకపోవడానికి కారణం రెండు రాష్ట్రాలు భిన్నాభిప్రాయాలు కలిగి ఉండడమే. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీని నియంత్రించడం, కొత్త ప్రాజెక్టులకు సాంకేతిక అనుమతులు ఇవ్వడం ఈ బోర్డుల విధి. అయితే బోర్డుల పరిధిని నోటిఫై చేయని కారణంగా ఏటా అనేక వివాదాలు తలెత్తుతున్నాయి. బోర్డుల పరిధిని నోటిఫై చేసేందుకు నిర్ణయించగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యంతరం వ్యక్తంచేశారు. కృష్ణా నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్) రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల కేటాయింపులు జరిపేంతవరకు బోర్డుల పరిధిని నిర్వచించరాదంటూ విభేదించారు. కానీ ఆంధ్రప్రదేశ్ సమ్మతం తెలిపింది. ఈ విషయంలో నిర్ణయాధికారం కేంద్ర ప్రభుత్వానిదే అయినందున ప్రస్తుతం ఉనికిలో ఉన్న కేడబ్ల్యూడీటీ–1ను అనుసరించి ఉన్న కేటాయింపులకు అనుగుణంగా బోర్డులు నీటి పంపిణీని నియంత్రించవచ్చు. అందువల్ల నోటిఫై చేసేందుకు నిర్ణయించాం.
2. కొత్త ప్రాజెక్టులు
ఎజెండాలోని రెండో అంశం కృష్ణా, గోదావరి నదులపై తలపెట్టిన కొత్త ప్రాజెక్టులకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు సమర్పించడం. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ ఆయా ప్రాజెక్టులను సాంకేతికంగా మదింపు చేసి ఆమోదించాల్సి ఉంటుంది. పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో ప్రస్తావించిన ప్రాజెక్టులు, అలాగే అంతర్రాష్ట్ర నదులపై నిర్మించే అనుమతులు లేని పాత ప్రాజెక్టుల డీపీఆర్‌లు కూడా సమర్పించాలి. కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను బోర్డులకు సమర్పించాలని పదేపదే కోరినప్పటికీ పంపలేదు. తొలుత బోర్డులు సాంకేతిక మదింపు జరిపి ఆమోదం తెలిపిన తరువాత అపెక్స్ కౌన్సిల్ వాటికి అనుమతి ఇస్తుంది. ఆయా ప్రాజెక్టులన్నీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపాదించినవేనని రెండు రాష్ట్రాలు చెబుతున్నాయి.
ఎ) కేడబ్ల్యూడీటీ–1 ద్వారా కేటాయింపులు ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పాత ప్రాజెక్టులుగా పరిగణించాలి.
బి). పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూలు పదకొండులో ప్రస్తావించిన ప్రాజెక్టులు సైతం పాత ప్రాజెక్టులే. కానీ ట్రిబ్యునల్స్ ద్వారా వాటికి కేటాయింపులు లేనిపక్షంలో.. కేడబ్ల్యూడీటీ–2 ద్వారా కేటాయింపులు తెచ్చుకోవాలి. అయితే ప్రస్తుతం అది కోర్టు పరిధిలో ఉంది.
సి). నీటి కేటాయింపులు లేని పాత ప్రాజెక్టులు, విభజన అనంతరం పరిధి మారిన ప్రాజెక్టులకు సంబంధించి సాంకేతిక మదింపు, అనుమతుల కోసం డీపీఆర్‌లు సమర్పించాలి.
డి). ఎ, బి కేటగిరీల్లో లేని ప్రాజెక్టులన్నీ కొత్త ప్రాజెక్టులుగా పరిగణించాలి.
ఇ). ఈ విషయంలో పునర్‌వ్యవస్థీకరణ చట్టం ఇచ్చిన ఆదేశం స్పష్టంగా ఉంది. రెండు రాష్ట్రాలు దీనిని పాటించాలని చెప్పాం. డీపీఆర్‌లు సమర్పించి సాంకేతిక మదింపు అనుమతులు తెచ్చుకోనంతవరకు ఈ ప్రాజెక్టులు నిర్మించరాదని కేంద్రం స్పష్టం చేసింది.
3. జలాల పంపిణీ వ్యవస్థ ఏర్పాటు
ఎజెండాలోని మూడో అంశం రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి జలాల వాటా నిర్ధారించేందుకు మెకానిజం ఏర్పాటు చేయడం. ఇందులో కేంద్రం, రాష్ట్రాల పాత్ర పరిమితం. ట్రిబ్యునళ్లే నిర్ధారిస్తాయి. కృష్ణా జలాల విషయానికి వస్తే కేడబ్ల్యూడీటీ–1 అవార్డు ప్రస్తుతం అమలులో ఉంది. కేడబ్ల్యూడీటీ–2పై సుప్రీం కోర్టులో స్టే ఉంది. గోదావరి జలాల విషయానికి వస్తే గోదావరి ట్రిబ్యునల్ రెండు రాష్ట్రాల మధ్య మొత్తం నిర్ధిష్ట కేటాయింపులు జరపలేదు. అందువల్ల మొత్తం నీటి కేటాయింపులు, ప్రాజెక్టు వారీ కేటాయింపులు తేలాలంటే బేసిన్‌లో ప్రాజెక్టు వారీ డీపీఆర్‌లను మదింపు చేయాలి. రెండు రాష్ట్రాలు పరస్పరం వీటిపై ఫిర్యాదు చేసినందున సామరస్యంగా పరిష్కరించేందుకు అపెక్స్ కౌన్సిల్ ఒక మెకానిజం ప్రతిపాదించింది. రెండు రాష్ట్రాల పరస్పర అంగీకారం ద్వారా, లేదా కొత్త ట్రిబ్యునల్ నిర్ణయం (కేటాయింపుల) ద్వారా గోదావరి జలాలు పంపిణీ చేసుకోవచ్చు. అలాగే గోదావరి జలాలను కృష్ణా నదికి (పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీకి) మళ్లించినప్పుడు దాని నుంచి వాటా పంచేందుకు మెకానిజం ఏర్పాటు చేయాలి.
భేటీలో తీసుకున్న నిర్ణయాలు
కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డుల పరిధిని నోటిఫై చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. దీనితో తెలంగాణ సీఎం విభేదించినప్పటికీ, పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి దీనికి ఏకాభిప్రాయం అవసరం లేదు. అందువల్ల కేంద్రం నోటిఫై చేస్తుంది. రెండు రాష్ట్రాల్లో చేపట్టిన ప్రాజెక్టుల సమగ్ర రిపోర్టులను సమర్పిస్తామని సీఎంలు ఇద్దరూ అంగీకరించారు. త్వరలో ఆయా ప్రాజె క్టుల సాంకేతిక మదింపు పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టం–1956లోని సెక్షన్–3 పరిధిలో తెలంగాణ రాష్ట్రం కేంద్రానికి అభ్యర్థన ఇస్తూ కృష్ణా జలాల పంపిణీకి కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం గానీ, ఉనికిలో ఉన్న ట్రిబ్యునల్‌కు కొత్త విధివిధానాలు సూచించడం గానీ చేయాలని కోరింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. ప్రస్తుతం ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటే, న్యాయ సలహా తీసుకుని కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. కేసీఆర్ ఇందుకు అంగీకరించారు. సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరించుకుంటామని చెప్పారు. గోదావరి జలాల విషయంలోనూ అంతర్రాష్ట్ర నదీ జలాల
వివాద పరిష్కార చట్టం–1956లోని సెక్షన్–3 పరిధిలో అభ్యర్థన పంపొచ్చని రెండు రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. మరుసటి రోజే అభ్యర్థన పంపిస్తామని కేసీఆర్ చెప్పారు. కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఏపీకి తరలించడంపై సమ్మతి.
Comments
Please login to add a commentAdd a comment