సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లోనూ పోటీకి సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. తమకు 119 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరంటూ బీఆర్‌ఎస్ చేస్తున్నది దుష్ప్రచారమేనని ఆయన మండిపడ్డారు.
ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు బీఎల్ సంతోష్, తరుణ్‌ఛుగ్, సునీల్ బన్సల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్‌చార్జి అరవింద్ మీనన్‌తో జరిగిన సమావేశంలో రాష్ట్ర నేతలతో కలసి బండి సంజయ్ పాల్గొన్నారు. అనంతరం పార్టీ నేతలు ఈటల రాజేందర్, జితేందర్‌రెడ్డి, గరికపాటితో కలిసి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్‌లో ప్రధాని బహిరంగ సభ: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయమని, ప్రజాసమస్యలపై ఆందోళన కార్యక్రమాలను మరింత ఉ ృతం చేస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 11 వేల స్ట్రీట్ కార్నర్ సమావేశాలను నిర్వహించామన్న సంజయ్.. వచ్చే 6 నెలల్లోగా 119 నియోజకవర్గాల్లోనూ బహిరంగసభలు, ఆ తర్వాత జిల్లాకేంద్రాలు, చివరగా హైదరాబాద్ లో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ సభకు ప్రధాని మోదీ రానున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో కేసీఆర్ అవినీతి పాలన: తరుణ్‌ఛుగ్
సమావేశం అనంతరం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ ఛుగ్ మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతి పాలన కొనసాగుతోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబ పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారని, కల్వకుంట్ల కుటుంబంపై తెలంగాణ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment