రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ మనమే పూర్తి చేయాలి
రూ.వేల కోట్ల పరిశ్రమలు తరలిపోతుంటే దుఃఖం కలిగింది
మంచినీళ్లు ఎట్ల మాయం అయినయ్? ∙మోదీ గోదావరిని తీసుకుపోతుంటే సీఎం మౌనం దేనికి?
నాలుగైదు నెలల్లోనే దుర్మార్గులు ఆగం చేసిర్రు
బండి సంజయ్ లెక్క తిట్ల దండకం మనకొద్దు ∙వీణవంక ప్రజల ఆత్మియ సమ్మేళనంలో మాజీ సీఎం కేసీఆర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘‘తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలేదు.. మిగిలే ఉంది, రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ మనమే పూర్తి చేయాలి. నాలుగైదు నెలల్లోనే దుర్మార్గులు రాష్ట్రాన్ని ఆగం చేసిర్రు. రూ.1000 కోట్ల పరిశ్రమ మద్రాసుకు తరలిపోతోంది. అల్యూమినియం, ప్లాస్టిక్ పరిశ్రమలు కరెంటు కోతలతో అల్లాడుతుంటే మనసుకు దుఃఖం కలుగు తోంది. గతంలో మోదీనే అసూయ పడేలా రాష్ట్రానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు తీసుకువచ్చాం.
నాలుగైదు నెలల్లోనే ఇంత వ్యతిరేకతా? ఇది కొసవరకు ఉండే ప్రభుత్వం కాదు.. దుర్మార్గులు ఆగం చేసిర్రు. ఏ మాత్రం అధైర్య పడొద్దు. రాజకీయాల్లో తాత్కాలిక సెట్‌బ్యాక్ అనేది సాధారణమే. ఎప్పుడు ఎన్నికలు వచి్చనా వచ్చేది మన ప్రభుత్వమే’’అని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖరరావు(కేసీఆర్) అన్నారు. వీణవంక మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ప్రజల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఏమన్నారంటే..?
వీళ్లు కొత్తగా చేయాల్సిందేముంది?
‘‘తొమ్మిదేళ్లు నడిచిన కరెంటు ఇప్పుడెందుకు పోతోంది. వీళ్లు కొత్తగా చేయాల్సిందేముంది? ఉన్నది ఉన్నట్లు ఇస్తే చాలు కదా? మంచినీళ్లు ఎట్ల మాయమైనయ్, మళ్లీ బిందెలేసుకుని మహిళలు రోడ్ల మీదకు ఎందుకు వస్తుర్రు? ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు పెంచి ప్రసవాలు పెంచాం. బాలింతలకు కేసీఆర్ కిట్, ఆడశిశువుకు రూ.13వేలు, మగశిశువుకు రూ.12వేలిచ్చి ఇంటికి పంపాం. కానీ, నేడు అవేమీ ఇవ్వడం లేదు.
ప్రభుత్వ ఆసుపత్రులు దయనీయ స్థితిలో ఉన్నాయి. వరంగల్ ఎంజీఎంలో ఏసీలు పనిచేయకపోవడంతో పసికందులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మోదీ మన గోదావరి నీళ్లను తమిళనాడు, కర్ణాటకకు తీసుకువెళ్తామని చెప్పినప్పటికీ సీఎం రేవంత్ మౌనంగా ఎందుకుంటున్నారు. అదే జరిగితే తెలంగాణలో సాగునీరు తాగునీరుకి చాలా ఇబ్బందులు ఏర్పడతాయి గతంలో రైతులకు అన్యాయం చేసే ఏ విషయం నా దృష్టికి వచి్చనా.. వెంటనే దాన్ని తిప్పికొట్టాం. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున నిలిచిన వారిని గెలిపిస్తే తెలంగాణ కోసం పార్లమెంట్లో దుంకి అందుకొని కొట్లాడుతారు.
బీఆర్‌ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.. ఆయన గతంలో ఎన్నోసార్లు తెలంగాణ హక్కుల కోసం కొట్లాడారు. నా ప్రచారాన్ని ఆపేందుకు కాంగ్రెస్, బీజేపీలు కుట్రలు పన్నాయి, అందుకే 48 గంటల ప్రచారాన్ని నిలిపివేసేలా చేశారు.. వారికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు.’’అని కేసీఆర్ అన్నారు.
రైతులను అన్ని విధాలా ఆదుకున్నాం
‘‘బీఆర్‌ఎస్ హయాంలో రైతు వలసల నిరోధానికి, వ్యవసాయ స్థిరీకరణ కోసం రైతుబంధు అనే పథకాన్ని ప్రవేశపెట్టి, వారికి ఎకరానికి రూ.10వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించాం. నీటి కొరత తీర్చేందుకు మిషన్ భగీరథ, సాగునీటి కోసం మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు, దళితుల ఆత్మగౌరవం కోసం దళితబంధు చేపట్టాం’’అని వివరించిన కేసీఆర్, హుజూరాబాద్‌లో 99% ధనిక దళితులే ఉన్నారని చెప్పారు.
సమైక్యాంధ్రప్రదేశ్‌లో 53 లక్షల టన్నుల వరి ఉత్పత్తయితే తెలంగాణలో మూడు కోట్ల టన్నులకు మించి ఉత్పత్తి చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచామన్నారు. పంటను దళారీల పాలు చేయకుండా కోడి తన పిల్లలను కాపాడుకున్నట్టు కాపాడుకున్నామని వ్యాఖ్యానించారు. రైతులకు ఫ్రీ కరెంట్ కోసం రూ.12,000 కోట్లు, రైతుబంధు కోసం రూ.15,000 కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు.. వరి కొనుగోలుతో రూ.750 కోట్లు నష్టం అయినా పర్వాలేదని 7,500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి రైతుల వద్ద నుంచి ప్రతి గింజనూ కొనుగోలు చేశామని కేసీఆర్ గుర్తు చేశారు.
ఇంకా రైతుబంధు ఇవ్వకపోవడం సిగ్గుచేటు
‘‘తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పథకాలు నమ్మి ఓటు వేస్తే నట్టేట ముంచారు. డిసెంబర్ 9న రైతుబంధు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు కోతలు అయినప్పటికీ రైతుబంధు ఇవ్వకపోవడం సిగ్గుచేటు’’అని విమర్శించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment