మాట్లాడుతున్న ఎంపీ సంజయ్‌కుమార్
కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ జరపాల్సిందే
నేతన్నలకు మద్దతుగా 10న సిరిసిల్లలో ‘దీక్ష’
బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్
కరీంనగర్: ‘కేసీఆర్ మళ్లీ తన భాషను మొదలు పెట్టారు. తెలంగాణ ఈరోజు అధోగతి పాలుకావడానికి ఆ భాషే కారణం. తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలించి లబ్ధి పొందాలని చూస్తున్నాడు’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్ అన్నారు. శనివారం ఎంపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రైతులెందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు.
పదేళ్ల పాలనలో 11వేల మందికిపైగా రైతులు చనిపోతే ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించలేదని పేర్కొన్నారు. లక్ష రుణమాఫీ అమలు చేయలేదన్నారు. కౌలు రైతులకు నయాపైసా సాయం చేయలేదన్నారు. వ్యవసాయ కూలీ ల ఊసే ఎత్తలేదని, ప్రజలు ఛీకొట్టాక ఇప్పు డు ప్రజల్లోకి వచ్చి మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. శుక్రవారం మొగ్ధుంపూర్ వచ్చిన కేసీఆర్ పంట తీవ్రంగా నష్టపోయిన చర్లబూత్కుర్, ఎలబోతారం, ఇరుకుల్ల, చామనపల్లి గ్రామాల్లో, ఇల్లంతకుంట, వీణవంక సహా అనేక మండలాల్లోని రైతులను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు.
గతేడాది వడగండ్ల వానలతో పంటనష్టం జరిగిన రామడుగు మండలం లక్ష్మీపూర్‌కు వచ్చి ఎకరాకు రూ.10 వేలు విడుదల చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పిన కేసీఆర్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆరే సిరిసిల్ల నేతన్నల ప్రస్తుత దుస్థితికి కారణమన్నారు. బతుకమ్మ చీరలు ఉత్పత్తి చేసినందుకు రూ.270 కోట్లు ప్రభుత్వం బకాయిపడితే, కేసీఆర్ నయాపైసా విడుదల చేయకుండా వారి ఆకలి చావులకు కారణమయ్యాడని మండిపడ్డారు.
సిరిసిల్లలో నేత కార్మికుడు సిరిపురం లక్ష్మీనారాయణ ఉపాధి లేక శనివారం ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలోని నేతన్నల దుస్థితికి నిరసనగా, వారిని ఆదుకోవాలనే ప్రధాన డిమాండ్‌తో ఈనెల 10న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సిరిసిల్లో దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. సమావేశంలో నాయకులు గంగాడి కృష్ణారెడ్డి, డి.శంకర్, గుగ్గిళ్లపు రమేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment