గోదావరి జలాలతో తెలుగు నేల తడవాలి | KCR Invites YS Jagan For Kaleshwaram Project Inauguration | Sakshi
Sakshi News home page

గోదావరి జలాలతో తెలుగు నేల తడవాలి

Published Tue, Jun 18 2019 1:48 AM | Last Updated on Tue, Jun 18 2019 8:10 AM

KCR Invites YS Jagan For Kaleshwaram Project Inauguration - Sakshi

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికను అందజేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

సాక్షి, అమరావతి : తెలుగు రాష్ట్రాల అభివృద్ధి.. తెలుగు ప్రజల సంక్షేమం కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖరరావు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  సోమవారం ఉమ్మడిగా, కలివిడిగా చర్చలు జరిపారు. విభజన నేపథ్యంలో ఐదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న 9, 10వ షెడ్యూళ్లలోని 142 సంస్థలకు సంబంధించిన ఆస్తుల పంపకం దగ్గర నుంచి గోదావరి జలాలను గరిష్ట స్థాయిలో వినియోగించుకోవటం వరకూ పలు అంశాలపై ప్రాథమికంగా చర్చించారు. కర్ణాటకలో ఆల్మట్టి జలాశయం ఎత్తును 519 నుంచి 524 మీటర్లకు పెంచుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పరీవాహక ప్రాంతంలో నీటి లభ్యత తగ్గుతుందని, దీన్ని అధిగమించాలంటే గోదావరి జలాలను కృష్ణా నదీ పరీవాహక ప్రాంతానికి తరలించడం ఒక్కటే మార్గమని ఇరువురు ముఖ్యమంత్రులు అభిప్రాయపడ్డారు. గోదావరి జలాలను శ్రీశైలం జలాశయానికి తరలించడం ద్వారా ఇటు ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ, అటు తెలంగాణలో పాత మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలను సస్యశ్యామలం చేయవచ్చని చర్చించుకున్నారు. కృష్ణా జలాల వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలను గవర్నర్‌ నేతృత్వంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, జలవనరుల శాఖ కార్యదర్శులు చర్చించి పరిష్కరించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు.
 
కేసీఆర్‌ బృందానికి వైఎస్‌ జగన్‌ నివాసంలో విందు 
విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి సన్యాసాశ్రమ దీక్ష స్వీకరణ ముగింపు ఉత్సవంలో పాల్గొనేందుకు సోమవారం విజయవాడకు వచ్చిన తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు తొలుత నేరుగా కనకదుర్గ దేవాలయానికి చేరుకుని పూజలు చేశారు. ఆ తరువాత అక్కడి నుంచి మధ్యాహ్నం 2.20 గంటలకు తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసానికి వచ్చారు. అంతకుముందు కేసీఆర్‌కు గన్నవరం విమానాశ్రయంలో పలువురు మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అప్పటికే శాసనసభ సమావేశాలు ముగించుకుని ఇంటికి చేరుకున్న సీఎం జగన్‌.. కేసీఆర్, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావులతోపాటు వారి వెంట వచ్చిన ప్రతినిధి బృందాన్ని సాదరంగా ఆహ్వానించారు. కేసీఆర్‌కు ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుష్పగుచ్ఛం ఇవ్వగా... కేసీఆర్‌ జగన్‌ను శాలువతో సత్కరించారు.

ఇంటిలోకి చేరుకున్న అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా తొలుత వైఎస్‌ జగన్‌ను కేసీఆర్‌ ఆహ్వానించారు. అనంతరం కేసీఆర్‌ బృందానికి వైఎస్‌ జగన్‌ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం సుమారు 1.30 గంటలపాటు ఇరువురు ముఖ్యమంత్రులు ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశాలపై ఏకాంతంగా చర్చలు జరిపారు. రాష్ట్ర విభజన జరిగిన ఐదేళ్లు గడిచినా విభజన చట్టం తొమ్మిది, పదో షెడ్యూలులో పేర్కొన్న 142 సంస్థల ఆస్తుల పంపకంపై ఇంతవరకు రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఇదే అంశంపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో 142 సంస్థల ఆస్తులను సామస్యరంగా పంచుకోవాలని చర్చించుకున్నారు. 
 
ఒకే వాహనంలో ఇద్దరు సీఎంలు..
చర్చలు ముగించుకున్న తర్వాత సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సాయంత్రం 5.10 గంటలకు కృష్ణా నదీ తీరంలో నిర్వహించిన విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి సన్యాసాశ్రమ దీక్ష స్వీకరణ ముగింపు ఉత్సవంలో పాల్గొనడానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకే వాహనంలో బయలుదేరి వెళ్లారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకే వాహనంలో వెళుతున్నపుడు దారిపొడవునా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడి చేతులూపుతూ అభినందనలు తెలిపారు. వారు కూడా వినమ్రంగా అభివాదం చేస్తూ వెళ్లారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్‌ తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని రాత్రి విమానంలో హైదరాబాద్‌ బయల్దేరారు. 


కేటీఆర్‌కు జ్ఞాపికను అందజేస్తున్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ 
 
గోదావరి జలాలతోనే సుజలాం.. సుఫలాం 
ఆల్మట్టి జలాశయం ఎత్తును కర్ణాటక సర్కారు 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచుతున్న నేపథ్యంలో కృష్ణా వరద జలాలు తెలుగు రాష్ట్రాలను చేరుకోవడంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటుందని దాదాపు గంటన్నరకుపైగా జరిగిన తాజా సమావేశంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు వైఎస్‌ జగన్, కేసీఆర్‌లు అభిప్రాయడ్డారు. ఆల్మట్టి ఎత్తు పెంపు వల్ల కృష్ణాలో నీటి లభ్యత మరింత తగ్గిపోయి తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల ఆయకట్టుకు నీటి ఇబ్బందులు ఏర్పడతాయనే ఆందోళన వ్యక్తమైంది. ఏటా గోదావరి నది నుంచి మూడు నుంచి నాలుగు వేల టీఎంసీల జలాలు సముద్రంలో కలుస్తున్నాయని వీటిని గరిష్ఠంగా వినియోగించుకోగలిగితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను సస్యశ్యామలం చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ఉమ్మడిగా గోదావరి జలాలను వినియోగించుకోవడంపై ప్రాథమికంగా చర్చించారు. గోదావరి జలాలను సోమశిల, కండలేరు, నాగార్జునసాగర్‌కే కాకుండా శ్రీశైలం జలాశయం వరకూ తీసుకెళ్లగలిగితే నీటి కరువు తీరుతుందనే అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాల కోసం ఉమ్మడిగా గోదావరి జలాలను వినియోగించుకోవడానికి చేపట్టాల్సిన చర్యలపై మరో దఫా సమావేశమై చర్చించాలని నిర్ణయించారు. 


కేసీఆర్కు జ్ఞాపికను అందజేస్తున్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌
 
సామరస్యంగా కృష్ణా జలాల వివాదం.. 
కృష్ణా జలాల వినియోగంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్య దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉంది. దీన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇద్దరు సీఎంలు నిర్ణయించారు. గవర్నర్‌ నరసింహన్‌ సారధ్యంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, జలవనరుల శాఖ కార్యదర్శులు సమావేశమై సమస్యను పరిష్కరించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. దీనివల్ల కృష్ణా జలాల వివాదం కొలిక్కి వచ్చే అవకాశం ఉందని సాగునీటి రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  
 
ఆహ్లాదకర వాతావరణంలో చర్చలు.. 
తీక్షణమైన ఎండలతో ఉడికిపోతున్న విజయవాడ పరిసరాలు సోమవారం ఒక్కసారిగా చల్లబడ్డాయి. జగన్‌ నివాసంలో ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ జరుగుతున్న సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన చిరు జల్లులు కురిశాయి. రాత్రి వరకూ ఇదే వాతావరణం కొనసాగింది. కేసీఆర్‌ వెంట ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, శేరి సుభాష్‌ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి ఉన్నారు. విందు కార్యక్రమంలో సీఎం జగన్‌తోపాటు వైవీ సుబ్బారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
  

ప్రకాశం బ్యారేజీని పరిశీలిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ చిత్రంలో మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి తదితరులు

ప్రకాశం బ్యారేజీపై ఆగిన కేసీఆర్‌  
సాక్షి అమరావతి బ్యూరో: విజయవాడ పర్యటన సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకాశం బ్యారేజీని పరిశీలించారు. కనకదుర్గమ్మ దర్శనం అనంతరం తాడేపల్లిలోని వైఎస్‌ జగన్‌ నివాసానికి వెళ్తూ దారిలో ప్రకాశం బ్యారేజీ వద్ద కేసీఆర్‌ తన కారును కొద్దిసేపు ఆపారు. కిందకు దిగి బ్యారేజీనీ, నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అక్కడి వాతావరణాన్ని ఆస్వాదించారు.  


 సోమవారం విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో సీఎం కేసీఆర్‌ 

దుర్గమ్మకు ప్రత్యేక పూజలు  
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ) : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తదితరులు ఆయనకు దుర్గ గుడి వద్ద స్వాగతం పలికారు. మహామండపం మీదుగా కొండపైకి చేరుకున్న కేసీఆర్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కేటీఆర్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌లకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పౌర్ణమి సందర్భంగా స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అలంకరించిన అమ్మవారిని కేసీఆర్‌ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి గతంలో కేసీఆర్‌ కానుకగా సమర్పించిన వజ్రాల ముక్కుపుడకను అర్చకులు అలంకరించారు.  
 
సీఎంలను ఆశీర్వదించిన మంత్రాలయం పీఠాధిపతులు  
సాక్షి, అమరావతి: ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కె.చంద్రశేఖరరావులను మంత్రాలయం రాఘవేంద్రస్వామి పీఠాధిపతులు ఆశీర్వదించారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం వైఎస్‌ జగన్‌ నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇద్దరు సీఎంలకు స్వామి వారి ప్రసాదాలను అందజేసి రాఘవేంద్రస్వామి చిత్ర పటాలను బహూకరించారు. ఈ సందర్భంగా గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి బుడగ జంగాల కుల ధృవీకరణకు సంబంధించిన వినతి పత్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు అందజేశారు. దీనిపై స్పందించిన సీఎం జగన్‌ తక్షణమే దీనికి సంబంధించిన జీవోను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement