నేడే గంగావతరణం | Kaleshwaram Lift Irrigation Project Inauguration On June 21 | Sakshi
Sakshi News home page

కాళేశ్వరుడికి గోదావరితో జలాభిషేకం

Published Fri, Jun 21 2019 1:34 AM | Last Updated on Fri, Jun 21 2019 8:28 AM

Kaleshwaram Lift Irrigation Project Inauguration On June 21 - Sakshi

మేడిగడ్డ బ్యారేజీ ఏరియల్‌ వ్యూ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర చరిత్రపుటల్లో నేటి నుంచి నవ శకం ప్రారంభం కానుంది. కాళేశ్వరంలోని ముక్తీశ్వరుడి సాక్షిగా గోదావరి జలాలతో రాష్ట్రానికి అభిషేకం చేసే మహాక్రతువు మొదలవ్వనుంది. దేశ సాగునీటి రంగ చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో అనతి కాలంలోనే పూర్తయిన బృహత్తర బహుళార్ధక సాధక కాళేశ్వర ఎత్తిపోతల పథకం నేటి నుంచి జాతికి అంకితం కానుంది. భగీరథుడు గంగను దివి నుంచి భువికి దించితే... నేటి భగీరథ యత్నం తెలుగు గంగను నేల నుంచి నింగికి ఎత్తే సరికొత్త చరిత్రను సృష్టించనుంది. ఈ బృహత్తర ప్రాజెక్టును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఉదయం లాంఛనంగా ప్రారంభించనున్నారు. మేడిగడ్డ పంప్‌హౌస్‌లోని 6వ నంబర్‌ మోటార్‌ను ఆన్‌ చేయడం ద్వారా గోదావరి ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మహోజ్వల ఘట్టానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌తోపాటు ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌లు హాజరుకానున్నారు. దేశ, రాష్ట్ర చరిత్ర గతికి దిశానిర్దేశం చేసిన గంగావతరణ దినంగా జూన్‌ 21 ఖ్యాతికెక్కనుంది.  

ప్రారంభోత్సవానికి అంతా సిద్ధం... 
రాష్ట్రంలోని 70 శాతం భూభాగానికి 40లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే మహాస్వప్నం సాకారం దిశగా తొలి అడుగు పడనుంది. బీళ్లువారిన తెలంగాణ నేలలన్నీ సస్యశ్యామలం చేసేందుకు గోదావరి పరుగులు పెట్టనుంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ప్రాజెక్టు పనులన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. గోదావరిలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటితో తొలి ఎత్తిపోతలు మొదలు కానుంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధికారులు మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌస్‌లలో ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌస్‌ వద్ద యాగశాలలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. రుత్వికులు, పండితులు ఇప్పటికే అక్కడ హోమాలకు సంబంధించి ఏర్పాట్లు చేసుకున్నారు. అలాగే ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరుకానున్న గవర్నర్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సీఎంలు, ఆయా రాష్ట్రాల మంత్రుల కోసం 5 హెలికాప్టర్‌లు సమకూర్చగా ఒక్కో ప్రాంతం వద్ద ఆరు హెలిప్యాడ్‌లు సిద్ధం చేసి ఉంచారు. 


 సిద్ధమవుతున్న యాగశాల 

శుక్రవారం ఉదయం 7 గంటలకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి మేడిగడ్డ బ్యారేజీ ప్రాంతానికి సతీసమేతంగా చేరుకోనున్నారు. అక్కడ జరిగే జలసంకల్ప మహయాగ హోమంలో పాల్గొంటారు. ఉదయం 8:30 గంటలకు మరో హెలికాప్టర్‌లో గవర్నర్‌ నరసింహన్‌ సైతం హైదరాబాద్‌ నుంచి బయల్దేరనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి అమరావతి నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడిగడ్డ బ్యారేజీ ప్రాంతానికి చేరుకోనున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌ ముంబై నుంచి నేరుగా మేడిగడ్డకు చేరుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఉదయం 10 గంటలకల్లా గవర్నర్, ఇద్దరు ముఖ్యమంత్రులు మేడిగడ్డ బ్యారేజీ ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ జరిగే హోమంలో కేసీఆర్‌తోపాటు పాల్గొంటారు. అనంతరం ఉదయం 10.30 గంటల నుంచి 11 గంటల మధ్య గవర్నర్, ముగ్గురు ముఖ్యమంత్రులు మేడిగడ్డ బ్యారేజీ వద్ద పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అక్కడే ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు. 

ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే గవర్నర్, ముగ్గురు ముఖ్యమంత్రులు మేడిగడ్డ పంప్‌హౌస్‌ ఉన్న కన్నెపల్లికి హెలికాప్టర్‌లో చేరుకొని అక్కడ అప్పటికే కొనసాగుతున్న పూర్ణాహుతిలో పాల్గొంటారు. సుగంధ మంగళ ద్రవ్యాలను హోమంలో వేస్తారు. అనంతరం 6వ నంబర్‌ మోటార్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారు. అనంతరం నీటి ప్రవాహాలుండే డెలివరీ సిస్టర్న్‌ వద్ద గోదావరి జలాలకు పూజలు చేస్తారు. అక్కడి నుంచి కన్నెపల్లి గెస్ట్‌హౌస్‌లో మధ్యాహ్న భోజనాలు చేసి అనంతరం అక్కడే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం పంచుకున్న ఇంజనీర్లు, ఏజెన్సీలు, సహకారం అందించిన బ్యాంకర్లకు సన్మాన కార్యక్రమం ఉండేలా షెడ్యూల్‌ సిద్ధం చేశారు. స్థానికుడైన మంత్రి ఈటల రాజేందర్‌ మేడిగడ్డ, కన్నెపల్లి ప్రాంతాల వద్ద ఏర్పాట్లను సమన్వయపరుస్తారు. పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కన్నెపల్లి పంప్‌హౌస్‌ పూజా కార్యాక్రమంలో పాల్గొంటారు. 


కన్నెపల్లి పంపుహౌస్‌ వద్ద నిండుకుండలా..

మిగతా పంపుల వద్ద మంత్రులు, స్ధానిక ఎమ్మెల్యేలు... 
మేడిగడ్డ, కన్నెపల్లిలో పూజలు జరుగుతున్న సమయంలోనే కీలకమైన అన్నారం బ్యారేజీ, పంప్‌హౌస్, సుందిళ్ల బ్యారేజీ, పంప్‌హౌస్‌లతోపాటు నంది మేడారంలోని ప్యాకేజీ–6 పంప్‌హౌస్, రామడుగులోని ప్యాకేజీ–8 పంప్‌హౌస్‌ల్లోనూ పూజా కార్యక్రమాలు కొనసాగనున్నాయి. అన్నార పరిధిలో జరిగే పూజా కార్యక్రమాల్లో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పాల్గొననుండగా సుందిళ్ల పరిధిలోని పూజలకు సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పూజలు చేయనున్నారు. ప్యాకేజీ–6లో మంత్రి మల్లారెడ్డి, ప్యాకేజీ–8లో మంత్రి జగదీశ్‌రెడ్డి పూజలు చేసి కొబ్బరికాయ కొట్టనున్నారు. ఈ సందర్భంగా అక్కడే సుమారు 500 మందికి భోజన ఏర్పాట్లు చేశారు. ఆయా ప్రాంతాల స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పూజా కార్యక్రమాల్లో పాలుపంచుకోనున్నారు. 

3 వేల మందితో భద్రత కట్టుదిట్టం... 
సాక్షి ప్రతినిధి, వరంగల్‌/సాక్షి, భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి గవర్నర్, ముగ్గురు సీఎంలు వస్తుండటంతో కనీవినీ ఎరుగని రీతిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడా భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా 3 వేల మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సివిల్‌ పోలీసులతోపాటు ఆక్టోపస్, గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్, ఏపీఎస్పీ బలగాలు కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజీల దగ్గర మోహరించాయి. నలుగురు ఎస్పీలు, ఇద్దరు ఏఎస్పీలు, 16 మంది డీఎస్పీలు, 45 మంది సీఐలు, 100 మంది ఎస్సైలు భద్రతా చర్యలు చేపడుతున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమ ప్రాంతం ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దులో ఉండటం, మావోయిస్టుల ప్రభావం ఉండటంతో భద్రతా సిబ్బంది రేయింబవళ్లు పహారా కాస్తున్నారు. గోదావరి నదికి ఇరువైపులా మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లో భద్రతా బలగాలు విస్తృతంగా కూంబింగ్‌ నిర్వహించాయి. పెద్దపల్లి నుంచి కాళేశ్వరం, భూపాలపల్లి నుంచి కాళేశ్వరం వెళ్లే ప్రధాన రహదారులను జల్లెడ పడుతున్నాయి. 


పంపుహౌస్‌ను పరిశీలిస్తున్న మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి  

పొంచి ఉన్న వరుణుడి ముప్పు... 
ప్రారంభోత్సవ కార్యక్రమానికి వరుణిడి ముప్పు పొంచి ఉంది. భూపాలపల్లి జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో గురువారం భారీ వర్షాలు కురిశాయి. కన్నెపల్లి పంప్‌హౌస్‌ దగ్గర అరగంటపాటు భారీ వర్షం కురిసింది. దీంతో శుక్రవారం జరగబోయే కార్యక్రమానికి వరణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి ఈటల రాజేందర్‌ గురువారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలసి పరిశీలించారు.  

కాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకోనున్న ఫడ్నవిస్‌! 
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వస్తున్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకోనున్నట్లు అనధికార వర్గాల ద్వారా తెలిసింది. ముందుగా సీఎం కేసీఆర్, వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆలయంలో పూజలు చేస్తారని ప్రచారం జరిగినా షెడ్యూల్‌ రాలేదు. అయితే ఫడ్నవిస్‌ ఒక్కరే స్వామివారికి అభిషేకం చేయనున్నట్లు తెలిసింది. అతిథుల కోసం 100 బెల్లం లడ్డూలు ప్రత్యేకంగా తయారు చేయించగా దేవాదాయశాఖ కమిషనర్‌ అనీల్‌ కుమార్, ఏడీసీ శ్రీనివాసరెడ్డి గురువారం ఏర్పాట్లను పరిశీలించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement