విశాఖ, నెల్లూరు, కర్నూలుల్లో కేన్సర్ ఆసుపత్రులు
గుంటూరు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్సీ) బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. ఆదివారం గుంటూరులో కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 84 పీహెచ్సీలకు రూ. 101 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పారు. అలాగే ఇప్పటి వరకు 800 వైద్యుల పోస్టులు భర్తీ చేసినట్లు తెలిపారు. త్వరలో మరో 500 వైద్యుల పోస్టులు భర్తీకి చర్యలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు.
అలాగే రాష్ట్రంలో తల్లీబిడ్డల మరణాలను గణనీయంగా తగ్గించామని కామినేని పేర్కొన్నారు. రూ. 225 కోట్లతో వైద్య పరికరాల తయారీ కోసం విశాఖలో మెడ్టెక్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నాట్కో సాయంతో రూ. 10 కోట్లతో గుంటూరులో కేన్సర్ ఆసుపత్రిని నిర్మిస్తామని... ఈ నిర్మాణాన్ని ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. విశాఖ, నెల్లూరు, కర్నూలు నగరాల్లో కేన్సర్ ఆసుపత్రులు నిర్మించనున్నట్లు కామినేని తెలిపారు. ఈ నెల 11వ తేదీన విశాఖలో విమ్స్ ప్రారంభిస్తామన్నారు.