‘బడంగ్‌పేటకు చెందిన రాజేశ్వరి ఏప్రిల్ రెండో తేదీన బాలాపూర్ ఆరోగ్య కేంద్రంలో కోవాగ్జిన్ టీకా తీసుకున్నారు. రెండో డోసు కోసం శనివారం అదే పీహెచ్‌సీకి ఆమె వెళ్లారు. తీరా అక్కడ కోవాగ్జిన్ లేదని, ఎప్పుడు వస్తుందో కూడా స్పష్టత లేదని ఆస్పత్రి వైద్యుడు స్పష్టం చేశారు. సరూర్‌నగర్‌లో అడిగి చూడండి అని వైద్యుడు సలహా ఇవ్వడంతో పరుగు పరుగున అక్కడికి చేరుకున్నారామె. తీరా అక్కడ కూడా చేదు అనుభవమే ఎదురైంది. రెండో డోసు దొరుకుతుందో? లేదో? వైద్యులు కూడా స్పష్టత ఇవ్వలేక పోవడంతో ఆమె ఆందోళనలో ఉన్నారు’ ఇలా ఒక్క రాజేశ్వరి మాత్రమే కాదు ఇప్పటికే తొలి డోసుగా కోవాగ్జిన్ టీకా తీసుకున్న వేలాది మంది నగరవాసులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు.
సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్ టీకాల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. ఏ సెంటర్‌లో ఏ వ్యాక్సిన్ వేస్తున్నారో తెలియక లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. లబ్ధిదారుల నిష్పత్తికి తగినంత వ్యాక్సిన్ సరఫరా చేయకపోవడంతో ప్రభుత్వం ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్‌ను ఈ నెల 14 వరకు తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం శనివారం నుంచి కేవలం రెండో డోసు వారికే టీకాల వేస్తున్నట్లు ప్రకటించింది. ఫస్ట్ డోసులో కోవిషీల్డ్ వేసుకున్న వారికి సులభంగానే టీకాలు దొరుకుతున్నా.. కోవాగ్జిన్ తీసుకున్న వారికి కష్టాలు తప్పడం లేదు. రెండో డోసుకు గడువు సమీపించడంతో ఇప్పటికే ఫస్ట్‌డోసు టీకా వేయించుకున్న ఆరోగ్య కేంద్రానికి వెళ్లి ఆరా తీస్తే.. వారు కనీస సమాచారం ఇవ్వడం లేదు. టీకా ఏ రోజు లభిస్తుందో కూడా స్పష్టత ఇవ్వకపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.
13.62 లక్షల మందికి ఫస్ట్‌డోసు పూర్తి
హైదరాబాద్ జిల్లాలో 155 కేంద్రాల్లో టీకాలు వేస్తున్నారు. వీటిలో 106 ప్రభుత్వ, 49 ప్రైవేటు టీకా సెంటర్లు ఉన్నాయి. మేడ్చల్ జిల్లాలో 73 కేంద్రాల్లో టీకాలు వేస్తుండగా, వీటిలో 48 ప్రభు త్వ, 25 ప్రైవేటు సెంటర్లు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 67 కేంద్రాల్లో టీకాలు వేస్తుండగా, వీటిలో 44 ప్రభుత్వ, 23 ప్రైవేటు కేంద్రాలు ఉన్నాయి. ఈ మూడు జిల్లాల్లో ఇప్పటి వరకు 17,25,546 మంది టీకాలు వేయించుకున్నారు. వీరిలో 13.62,742 మంది ఫస్ట్ డోసు వేసుకోగా, 3,62,804 మంది సెకండ్ డోసు వేసుకున్నారు. తాజాగా శనివారం మూడు జిల్లాల పరిధిలో 17,895 మందికి టీకాలు వేశారు. వీరంతా కోవిషీల్ట్ టీకా వేయించుకున్నవారే. కొత్తవాళ్లకు టీకాలు వేయకపోగా.. ఇప్పటికే ఫస్ట్‌డోసు పూర్తి చేసుకుని సెకండ్ డోసు కోసం ఎదురు చూస్తున్న వారికి ఇబ్బందులు తప్పడం లేదు.
ఒక్కో ఆస్పత్రిలో ఒక్కోలా చార్జీలు
కోవిషీల్డ్‌తో పోలిస్తే కోవాగ్జిన్‌కు డిమాండ్ ఏర్పడింది. ప్రభుత్వం సరఫరా చేసిన అరకొర వ్యాక్సిన్లను కూడా ఆరోగ్య కేంద్రాలకు పంపకుండా బ్లాక్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొన్ని ప్రైవేటు ఆస్ప్రతులు దీన్ని అవకాశంగా తీసుకుంటున్నాయి. ఎలాగైనా టీకా వేయించుకోవాలని భావిస్తున్న సిటీజనుల బలహీనతను ఆసరాగా తీసుకుని ధరలను అమాంతం పెంచేశాయి. టీకాకు డాక్టర్ కన్సల్టేషన్ చార్జీలు కలిపి రూ.850 నుంచి రూ.1250 వరకు వసూలు చేస్తున్నాయి. ఒక్కో కార్పొరేట్ ఆస్పత్రి ఒక్కో విధంగా చార్జీలు వసూలు చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment