అమ్మకానికి హైదరాబాద్‌ మెట్రో! ఎల్‌ అండ్‌ టీ కీలక నిర్ణయం? | Due To Huge Losses L And T Plans To Sell Its Stake In Hyderabad Metro | Sakshi
Sakshi News home page

Hyderabad Metro: అమ్మకానికి హైదరాబాద్‌ మెట్రో! ఎల్‌ అండ్‌ టీ కీలక నిర్ణయం?

Published Fri, Sep 3 2021 10:36 AM | Last Updated on Fri, Sep 3 2021 11:12 AM

Due To Huge Losses L And T Plans To Sell Its Stake In Hyderabad Metro - Sakshi

ఎన్నో అంచనాల మధ్య ప్రారంభమైన హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టుకి కోవిడ్‌ సంక్షోభం శాపంగా మారింది. వరుస లాక్‌డౌన్‌లు, కఠిన నిబంధనలు, వర్క్‌ఫ్రం హోం వంటి కారణాల వల్ల నష్టాల ఊబి నుంచి బయటపడలేకపోతుంది. దీంతో హైదరాబాద్‌ మెట్రోలో తన వాటా అమ్మేందుకు ఎల్‌ అండ్‌​ టీ సన్నాహలు చేస్తోంది. 

మెట్రో స్పీడుకి కోవిడ్‌ బ్రేకులు
పబ్లిక్‌ , ప్రైవేటు పార్టనర్‌షిప్‌లో ప్రపంచలోనే అతి పెద్ద మెట్రోగా 71 కిలోమీటర్ల నిడివితో మూడు మార్గాల్లో హైదరాబాద్‌ మెట్రో ఘనంగా ప్రారంభమైంది. ఆరంభానికి తగ్గట్టే ప్రారంభించిన ఏడాదిలోపే నిత్యం 4.50 లక్షల మందిని వారి గమ్యస్థానాలకు చేరవేసే ప్రయాణ సాధనంగా మారింది. ఇక లాభాల రూట్‌లోకి వెళ్లడమే తరువాయి అనే సమయంలో కోవిడ్‌ సంక్షోభం వచ్చి పడి మెట్రో స్పీడుకి బ్రేకులు వేసింది. 

నష్టాల ట్రాక్‌లో
కోవిడ్‌ ఫస్ట్‌ వేవ్‌ కారణంగా ఆరు నెలల పాటు మెట్రో రైలు నడవలేదు. ఆ తర్వాత కఠిన నిబంధనల మధ్య 2020 సెప్టెంబరులో మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి, క్రమంగా ప్రయాణికుల సంఖ్య పుంజుకుంటున్న తరుణంలో 2021 మేలో మరోసారి కరోనా సెకండ్‌ వేవ్‌ వచ్చి పడింది. ఫలితంగా మరోసారి మెట్రో సేవలు నిలిచిపోయాయి. దీంతో వరుసగా మెట్రో నష్టాలు పెరిగాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో మెట్రో నష్టాలు రూ. 1,766 కోట్లకు చేరగా అంతకు ముందు ఏడాది ఈ నష్టం రూ. 382 కోట్లుగా నమోదైంది. మొత్తంగా రెండు వేలకు కోట్లకు పైగా నష్టాల్లో మెట్రో నడుస్తోంది.  

వర్క్‌ఫ్రం హోం ఎఫెక్ట్‌
కరోనా భయాలు పూర్తిగా తొలగిపోకపోవడంతో చాలా ఐటీ కంపెనీలు, ఇతర సం‍స్థలు వర్క్‌ఫ్రం హోంనే కొనసాగిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. కోవిడ్‌ కారణంగా పడిన జీతాల కోతకు తోడు మెట్రో సర్వీసులు రెగ్యులర్‌గా నడకవపోవడంతో చాలా మంది ప్రత్యామ్నాయ రవాణాకు మారిపోయారు. దీంతో సెకండ్‌ వేవ్‌ ముగిసినా మెట్రో ప్రయాణానికి మొగ్గు చూపుతున్న వారి సంఖ్య పెరగడం లేదు. ఫలితంగా రోజువారి ప్రయాణికుల సంఖ్య 4.50 లక్షల నుంచి కేవలం ఒక లక్షకు పడిపోయింది. మరికొంత కాలం ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉండటంతో మెట్రో నష్టాలు తడిసి మోపెడు అవుడం ఖాయంగా మారింది. 

వాటా అమ్మకానికి సిద్ధం
లాభాలు తెచ్చివ్వని సంస్థల్లో వాటాలు అమ్మేయాలని ఎల్‌ అండ్‌ టీ సంస్థ నిర్ణయించింది. అందులో భాగంగా పంజాబ్‌లోని పవర్‌ ప్రాజెక్టుతో పాటు హైదరాబాద్‌ మెట్రోలో వాటాను అమ్మాలని సంస్థాపరమైన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. హైదరాబాద్‌ మెట్రోలో 15 శాతం వాటా అమ్మకానికి ఎల్‌ అండ్‌ టీ రెడీ అవుతోంది. హైదరాబాద్‌ మెట్రోలో వాటాను వాటాను కొనుగోలు చేసేందుకు గ్రీన్‌కో సంస్థ సిద్ధంగా ఉందంటూ ఎల్‌ అండ్‌ టీ వైస్‌ప్రెసిడెంట్‌ డీకే సేన్‌ అన్నారు. అయితే దీనిపై గ్రీన్‌ సంస్థ నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు.

ప్రభుత్వం అనుమతిస్తుందా ?
హైదరాబాద్‌ మెట్రో పబ్లిక్‌, ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌లో నిర్మించిన ప్రాజెక్టు కావడంతో ఎల్‌ అండ్‌ టీ తన వాటాలను ఏకపక్షంగా అమ్మేయడానికి వీలులేదు. తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వాటాల విక్రయానికి సంబంధించి ఎల్‌ అండ్‌ టీ సంస్థ నుంచి తమకు ఎటువంటి సమాచారం అందలేదని మెట్రో అధికారులు అంటున్నారు.   

సాయం అందేనా ?
నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న హైదరాబాద్ మెట్రో రైలులో పెట్టుబడులు పెట్టేందుకు నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ ఫండ్‌ ముందుకు వచ్చినట్టు వార్తలు రావడం కొంత శుభ పరిణామంగా చెప్పుకోవాలిజ హైదరాబాద్‌ మెట్రోలో నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడికి నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ ఫండ్‌ సుముఖతగా ఉన్నట్టు సమాచారం. నష్టాల ఊబి నంచి బయట పడేందుకు గత కొంత కాలంగా సాఫ్ట్ రుణాల కోసం వివిధ బ్యాంకులను  హైదరాబాద్ మెట్రో ఆశ్రయిస్తోంది. 

చదవండి : మెట్రో తడబాటు! ఏడాది సుమారు రూ.2 వేల కోట్ల నష్టం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement