పేదల మాత్రలకు కత్తెర
ప్రభుత్వాస్పత్రులకు ఇచ్చే 262 రకాల అత్యవసర ఔషధాలను జాబితా నుంచి తొలగిస్తూ సర్కారు ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: తీవ్ర జ్వరమో, నొప్పో వచ్చి ప్రభుత్వాసుపత్రి దారి పట్టారా..? అయితే యూంటీ బయూటిక్స్‌తో పాటు అత్యవసర మందులు మీరే కొనుక్కోవాల్సిందిగా డాక్టరు చిట్టీ రాసి ఇవ్వొచ్చు. ఇంతేకాదు దగ్గు, జలుబు మందులు కూడా ఇక నుంచి సర్కారు దవాఖానాల్లో కరువుకానున్నాయి. దీనంతటికీ కారణం ప్రభుత్వాస్పత్రులకు అందజేసే అత్యవసర మందుల్లో కోత విధించడమే. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 262 రకాల అత్యవసర వుందులను ప్రభుత్వం కొనుగోలు జాబితా నుంచి తొలగించింది. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉండే మందుల సంఖ్య తగ్గిపోనుంది. ఇది పేద రోగులకు తీవ్ర నష్టం కలిగించనుంది. గత ఆరు మాసాలుగా కసరత్తు చేసిన ఉన్నతాధికారులు మందుల జాబితాను కుదిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, అత్యవసర మందుల జాబితాను కుదిస్తూనే... మరోవైపు అదనపు మందుల జాబితా (అడిషనల్ మెడిసిన్స్ లిస్ట్)ను పెంచారు. కానీ, ఈ అదనపు మందులను ఎప్పుడో ఒకసారి గానీ కొనుగోలు చేయరు. దీంతో ప్రభుత్వ చర్యపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అత్యవసర మందులు అందరికీ అందుబాటులో ఉండాలని వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జాబితాలో ఆ మందులన్నీ ఉండాలని.. అవసరాన్ని బట్టి కొనడమో, కొనకపోవడమో చేయవచ్చునని పేర్కొంటున్నారు. అంతేగానీ ఏకంగా జాబితా నుంచే తీసేయడం పేదలకు అన్యాయం చేసినట్లేనని మండిపడుతున్నారు.
ఇప్పటికే కొరత: మందుల జాబితాలో ప్రభుత్వమే కోత విధించింది గనుక.. సర్కారు ఆసుపత్రుల్లో అవసరమైన మందులు లేకపోతే ఎవరినీ ప్రశ్నించేందుకు అవకాశం ఉండదు. అడిగినా స్పందించే పరిస్థితి ఉండదు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో మందుల కొరత తీవ్రంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసర జాబితా నుంచి 262 రకాల మందులను ప్రభుత్వం తొలగించింది. గతంలో 601 రకాల మందులు అత్యవసర జాబితాలో ఉండేవి. ఇప్పుడు వాటిని 339కి తగ్గించారు.
పీహెచ్‌సీలకు భారీగా కత్తెర: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అందే మందుల్లో ఇకపై భారీగా కోత పడనుంది. రోగికి అవసరమున్నా, వైద్యుడు చీటీలో రాసినా అవి లభించవు. దాదాపుగా పీహెచ్‌సీల్లో 30 రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. వాటికి మించి ఏ మాత్రలు, ఔషధాలు అవసరమైనా.. పెద్దాసుపత్రికి వెళ్లాల్సిందే. తీవ్ర జ్వరాలకు వాడే తక్కువ మోతాదులోని యాంటీ బయోటిక్స్ మందులకు కూడా కత్తెర వేశారు. మరోవైపు ఇప్పటికే కొన్ని పీహెచ్‌సీల్లో ప్రసూతి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం ప్రసూతి సమయంలో అవసరమైన మందులు ఇకపై వాటిల్లో ఉండవు. అసలు చిన్న జబ్బులు వచ్చినవారే పీహెచ్‌సీలకు వస్తారని.. అంతకు మించిన మందులు అవసరమైతే ఏరియా లేదా, జిల్లా ఆస్పత్రులకు వెళ్లి తెచ్చుకోవాలని రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) అధికారులకు సూచించడం గమనార్హం.