సాక్షి, గుంటూరు
రవాణా సౌకర్యం సక్రమంగా లేని మారుమూల గ్రామాల్లో సైతం నిరుపేదలకు ప్రాథమిక వైద్య సేవలందించాలనే లక్ష్యంతో ఏర్పాటైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వెలవెలబోతున్నాయి. వేలకు వేలు జీతాలు తీసుకుంటున్న వైద్యాధికారులు ఆసుపత్రులకు సక్రమంగా రాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొందరు ప్రైవేటు వైద్యశాలలు పెట్టుకుని వారికి తీరినప్పుడు పీహెచ్‌సీలకు వస్తూ మమ అనిపిస్తున్నారు. మరికొందరు మరో అడుగు ముందుకేసి పీహెచ్‌సీలకు వస్తున్న రోగులకు తమ ప్రైవేట్ ఆసుపత్రుల అడ్రస్ ఇచ్చి అక్కడకు రమ్మంటూ తమ ప్రాక్టీస్ పెంచుకుంటున్నారు. కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలైతే మధ్యాహ్నానికి మూతపడుతున్నాయి. ఆదివారం వచ్చిందంటే అసలు తలుపులు కూడా తెరవని పరిస్థితి. ఆదివారం ఆరోగ్య కేంద్రాలకు సెలవు దినమనే భావన గ్రామీణ ప్రజల్లో ఉందంటే పీహెచ్‌సీల పనితీరు ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. రోడ్డు ప్రమాదాలు జరిగినా, కుక్కకాటు, పాముకాటుకు గురైనా కనీసం ప్రాథమిక వైద్యం అందని దుస్థితి నెలకొంది. వైద్యులు అందుబాటులో లేక నర్సులు, దోబీలు, వాచ్‌మెన్‌లు డాక్టర్ అవతారమెత్తి క్షతగాత్రులకు చికిత్స, ఇంజక్షన్ చేస్తున్నారు. తీవ్రగాయాలైన వారిని ప్రాథమిక వైద్య సేవలకోసం ఆరోగ్య కేంద్రాలకు తీసుకువస్తే డాక్టర్లు అందుబాటులో లేక మరింత రక్తస్రావమే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.
జీవో జారీ చేసి 15 రోజులైనా...
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండాలని ప్రభుత్వం జీవో జారీ చేసి 15 రోజులు దాటినా జిల్లాలో ఎక్కడా ఇది అమలు కావడంలేదు. ఇది కాగితాలకే పరిమితమైంది. ఉదయం 9 గంటలకు రావాల్సిన వైద్యాధికారులు 11 గంటలు దాటితేగాని ఆసుపత్రి మొఖం చూడటంలేదు. వచ్చి రెండు గంటలు కూడా రోగులకు అందుబాటులో లేకుండా మధ్యాహ్నం ఒంటిగంట కల్లా భోజన విరామమంటూ వెళ్ళిపోతున్నారు. అలా వెళ్లినవారు ఇక ఆ రోజుకి మళ్ళీ కనిపించడంలేదని రోగులు వాపోతున్నారు. జ్వరాలు అధికంగా వచ్చే సీజన్ అయినప్పటికీ నర్సుల ద్వారానే తమ కార్యకలాపాలను నడిపిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 78 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా, అందులో సుమారు 80 శాతం మంది వైద్యులు, సిబ్బంది స్థానికంగా నివాసం ఉండకుండా పట్టణ ప్రాంతాల నుంచి వచ్చి వెళ్తున్నారు. దీంతో వారు ఆసుపత్రికి ఏ సమయానికి చేరతారో, ఎప్పుడు వెళ్లిపోతారో తెలియని పరిస్థితి. వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు మాత్రం స్థానికంగా నివాసం ఉండని వారిపై, సమయపాలన పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఊదరగొట్టడం మినహా పట్టించుకున్న దాఖలాలు లేవని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఇలాంటివారిపై కఠినంగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు.
తీరు మారని వైద్యులు
Published Mon, Sep 29 2014 12:13 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 PM
Advertisement