
ముంబై: ఆ ప్రాంతంలోని ప్రజల్లో అకస్మాత్తుగా జట్టు రాలే సమస్య(Hair Loss) మొదలయ్యింది. పిల్లలు, పెద్దలు, పురుషులు, స్త్రీలు.. ఇలా అందరూ దీని బారిన పడ్డారు. జుట్టూడుతున్న యువతీయువకులకు పెళ్లి సంబంధాలు తప్పిపోయాయి. దీంతో కొందరిలో వైరాగ్యం ప్రవేశించింది. గత డిసెంబరు నుంచి ఈ జనవరి వరకూ ఈ సమస్య ఇక్కడివారిని పట్టిపీడించింది. అయితే ఇప్పుడు వైద్య నిపుణులు దీనికి కారణాన్ని కనుగొనడంతో పాటు పరిష్కారాన్ని సూచించడంతో అక్కడివారింతా హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు.
జాతీయ సమస్యగా..
మహారాష్ట్ర(Maharashtra)లోని బుల్ధానా జిల్లాలో అకస్మాత్తుగా జుట్టు రాలడం అనే సమస్య గత డిసెంబరులో జాతీయ స్థాయి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు దీనికి కారణమేమిటన్నది వైద్య నిపుణుల నివేదికలో వెల్లడయ్యింది. పంజాబ్, హర్యానాలలోని రేషన్ దుకాణాలు సరఫరా చేస్తున్న గోధుమలలో అధిక సెలీనియం ఉండటం, ఆ గోధుమలను స్థానికులు విరివిగా వినియోగించడమే దీనికి కారణమని వైద్య నిపుణుల నివేదిక పేర్కొంది. సెలీనియం అనేది నేలలో లభించే ఖనిజం. ఇది సహజంగా నీటితో పాటు కొన్ని ఆహార పదార్థాల లభిస్తుంది. జీవక్రియలో కీలక పాత్ర పోషించే ఈ సెలీనియం మనిషికి తక్కువ మొతాదులో అందితే సరిపోతుంది.
గుండు కొట్టించుకుని..
గత ఏడాది డిసెంబర్, ఈ జనవరి మధ్య కాలంలో బుల్ధానాలోని 18 గ్రామాల్లోని 279 మంది అకస్మాత్తుగా జుట్టు రాలడం అంటే ‘అక్యూట్ ఆన్సెట్ అలోపేసియా టోటాలిస్’(Acute onset alopecia totalis) సమస్యబారిన పడి, ఆస్పత్రులను ఆశ్రయించారు. కళాశాల విద్యార్థులు, యువతీ యువకులు ఈ సమస్యతో సతమతమయ్యారు. కొందరు వివాహాలు కుదరక ఇబ్బందులు పడ్డారు. కొందరైతే జట్టురాలే సమస్యకు పరిష్కారం లభించక గుండు చేయించుని, తమ ఇళ్లకే పరిమితమైపోయారు.
వాంతులు, విరేచనాలు కూడా..
ఈ సమస్యపై పలు ఫిర్యాదుల అనంతరం వైద్యాధికారులు బాధితుల నుంచి నమూనాలను సేకరించారు. వారు జుట్టురాలే సమస్యతో పాటు తలనొప్పి, జ్వరం, తల దురద, కొన్ని సందర్భాల్లో వాంతులు, విరేచనాల(Vomiting and diarrhea)తో కూడా ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించారు. రాయ్‌గడ్‌లోని బవాస్కర్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ ఎండీ డాక్టర్ హిమ్మత్రావ్ బవాస్కర్ మీడియాతో మాట్లాడుతూ స్థానికులు ఎదుర్కొంటున్న ఈ సమస్యకు పంజాబ్, హర్యానాల నుంచి దిగుమతి చేసుకున్న గోధుమలే కారణమన్నారు.
గోధుమలు మార్చడంతో..
ఈ గోధుమల్లో సెలీనియం కంటెంట్ అత్యధికంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. సాధారణంకంటే 600 రెట్లు ఎక్కువ సెలీనియం తీసుకోవడమే అలోపేసియా కేసులకు కారణమని ఆయన అన్నారు. ఈ నివేదిక దరిమిలా వైద్య నిపుణులు ఈ తరహా గోధుమల వినియగానికి స్వస్తి చెప్పాలని బాధితులకు సూచించారు. దీంతో కొంతమందిలో జుట్టురాలే సమస్య తగ్గి, ఐదారువారాల్లో తిరిగి జట్టు పెరగడం ప్రారంభమయినట్లు వైద్యులు గుర్తించారు.
ఇది కూడా చదవండి: Mahashivratri: నేపాల్‌కు 10 లక్షలమంది భారతీయులు
Comments
Please login to add a commentAdd a comment