కలగంటూ తన చేతినే తాను కొరుక్కుతిన్నాడు
బీజింగ్: సాధారణంగా నిద్రలో కలకనడం సహజం.. పక్కవాళ్లు భయపడేలా గట్టిగా నిద్రలోనే అరవడం కూడా అప్పుడప్పుడు జరుగుతుంటుంది. ఒక్కోసారి మంచంపై నుంచి దొర్లికిందపడటం కూడా జరుగుతుంది. ఇలాంటి కలలు కనే సమయంలో మనసు మాత్రమే పరుగెడుతుంది. శరీరం మాత్రం దానికి తగినట్లు ఎప్పుడోగానీ స్పందించదు. కానీ, చైనాలో మాత్రం ఓ యువకుడు హాయిగా కలలోకి జారుకొని మంచి రుచి కరమైన పోర్క్ లెగ్ పీస్ తింటున్నట్లుగా ఊహించుకొని తన చేతిని తానే కొరుక్కున్నాడు. రక్తం కారుతున్నా సోయిలేకుండా కండపీక్కొచ్చేలా కొరికేసుకున్నాడు.
మెలకువ వచ్చి చూసుకునే వరకు జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఆ సీన్ చూసి బెంబేలెత్తిపోయి మెలకువలో కూడా గట్టిగా కేకలు వేయడం అతడివంతైంది. జిజియాంగ్ ప్రావిన్స్ లోని లాంగో పట్టణంలో లీ అనే 20 ఏళ్ల కుర్రాడు ఈ పనిచేశాడు. ఫిబ్రవరి 16న తన సోదరి ఇంటికి వెళ్లిన లీ ఆ రోజు హాయిగా వైన్ తాగాడు. రుచికరమైన భోజనం చేసి సోయిలేకుండా నిద్రపోయి ఆ నిద్రలో కలగని ఆ కలకు తగినట్లు ప్రవర్తించాడు. ఫలితంగా చేతికండ ఊడిరాగా తన నోరంతా రక్తంతో నిండింది. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించడంతోపాటు వేరేవరో ఈ పనిచేసి ఉంటారని భ్రమపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.