కుక్కకాటుకు రెండు లక్షలు
నైనితాల్ : ఉత్తరాఖండ్ హైకోర్టు అసాధారణ తీర్పును వెల్లడించింది. కుక్కకాటు బాధితులకు రెండు లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలంటూ జస్టిస్ అలోక్నాథ్, జస్టిస్ సర్వేష్ కుమార్ ల డివిజన్ బెంచ్ గురువారం తీర్పు చెప్పింది. తీవ్రంగా గాయపడిన వారికి రెండు లక్షలు, పాక్షికంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
వీధి కుక్కలు, కోతులు, గిబ్బన్స్ దాడిలో గాయపడిన వారికి కూడా ఈ ఆ దేశాలు వర్తిస్తాయని హైకోర్టు స్పష్టంగా పేర్కొంది . ఈ పరిహార మొత్తాన్నిమున్పిపల్ కార్పోరేషన్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో విధిగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అది కూడా ఘటన జరిగిన ఒక వారం రోజుల లోపే ఈ చెల్లింపు జరగాలని సూచించింది.
నైనితాల్ పట్టణంలో గత మూడేళ్ల కాలంలో జరిగిన నాలుగువేల వీధి కుక్కకాటు కేసులను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు గత జనవరిలో రాష్ట్ర ప్రభుత్వానికి, మున్సిపాలిటీ సంస్థకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. రోజురోజుకు పెరుగుతున్న కుక్కకాటు సంఘటలను నివారించడానికి వాటికోసం తక్షణమే షెల్టర్లను ఏర్పాటు చేయాలని సూచించింది. అలాగే కోతులు, గిబ్బన్స్ దాడికి సంబంధించి ఒక నివేదిక ఇవ్వాలని కోరింది. చిత్రంగా ఈ ఆదేశాలను జారీ చేసిన సీనియర్ న్యాయవాది భార్యతో పాటు నలుగురు అదేరోజు వీధికుక్కల బారిన పడి గాయాల పాలయ్యారు. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న కోర్టు ఈ తాజా ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.