డీప్రోలో ఖననానికి సిద్ధంచేసిన గుంతలు
మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఆరంభమై నెల రోజులైంది. ఇప్పటివరకు ఈ సంక్షోభ కారణంగా వేలాది మంది మరణించగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ యుద్ధం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉక్రెయిన్‌ను నిస్సైనికీకరణ చేయడమే లక్ష్యంగా దాడి చేస్తున్నట్లు రష్యా పేర్కొంది. ఉక్రెయిన్‌లో నియో నాజీ జాతీయవాదులు పెరిగారని, వీరిని అదుపు చేయడమే తమ లక్ష్యమని పుతిన్ చెప్పారు.
ఉక్రెయిన్ మిలటరీ, మౌలిక సదుపాయాలపై మిస్సైల్ దాడులకు ఆదేశించారు. రష్యా దురాక్రమణకు నిరసనగా అమెరికా, యూరప్‌దేశాలు ఆంక్షల కత్తి ఝళింపించాయి. ఆంక్షల ఫలితంగా రష్యా వద్ద ఉన్న విదేశీ నిల్వల్లో దాదాపు సగం వాడుకునే వీలు లేకుండా పోయింది. రష్యా ఇంధన దిగుమతులను నిలిపివేయాలన్న డిమాండ్‌కు కూడా యూరప్ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. రష్యా చర్చలకు వస్తే నాటోలో చేరే డిమాండ్‌ను వదులుకుంటామని జెలెన్‌స్కీ ప్రకటించారు.
రష్యాకు ఎదురు దెబ్బలు
కీవ్ వరకు వేగంగా వచ్చిన రష్యా దళాలకు అక్కడినుంచి భీకర ప్రతిఘటన ఎదురైంది. పాశ్చాత్య దేశాలందించిన ఆయుధాలతో ఉక్రెయిన్ బలగాలు రష్యన్లను ఎక్కడికక్కడ నిరోధించాయి. దీంతో పలు చోట్ల రష్యాకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఉక్రెయిన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు రష్యా చెప్పినా, ఇప్పటికీ ఉక్రెయిన్ నింగిపై రష్యాకు పట్టు చిక్కలేదు. మారియోపోల్ వంటి నగరాలను రష్యన్లు స్వాధీనం చేసుకోగలిగినా ఇంకా కీలక నగరాలు రష్యాకు చిక్కలేదు. నాటో అంచనా ప్రకారం యుద్ధంలో దాదాపు 15వేల మంది రష్యన్లు మరణించారు. కాగా, అణు, జీవ, రసాయన ఆయుధాలు రష్యా ప్రయోగించే ప్రమాదముందని భయాలు పెరిగాయి.
తర్వాతేంటి?
ఆంక్షల ప్రభావంతో రష్యా ఆర్థికంగా తీవ్రంగా ప్రభావితమవుతోంది. అయినా పుతిన్ వెనక్కి తగ్గలేదు. రష్యాలో పుతిన్‌పై అభిమానం తగ్గడం లేదు. ఇరు పక్షాల మధ్య జరిగిన చర్చలు నిష్ఫలంగా ముగిశాయి. ఉక్రెయిన్ తటస్థంగా ఉండాలని, నిస్సైనికీకరణకు అంగీకరించాలని, క్రిమియాపై రష్యా ఆధిపత్యాన్ని ఒప్పుకోవాలని, తూర్పు రిపబ్లిక్‌ల స్వయం ప్రతిపత్తిని గుర్తించాలని పుతిన్ కోరుకుంటున్నారు. సెక్యూరిటీ గ్యారెంటీలిస్తే తటస్థ స్థితిపై చర్చిస్తామని, నాటోలో చేరమని జెలెన్‌స్కీ తాజాగా ప్రకటించారు. అయితే క్రిమియా, తూర్పు రిపబ్లిక్ అంశాలపై కాల్పుల విరమణ, రష్యన్ బలగాల ఉపసంహరణ తర్వాత చర్చిద్దామని ప్రతిపాదించారు. ఉక్రెయిన్‌పై మరింత పట్టు సాధించిన అనంతరం పుతిన్ మెట్టుదిగివస్తాడని యుద్ధ నిపుణులు అంచనా వేస్తున్నారు.
యుద్ధం ఆరంభం: ఫిబ్రవరి 24
ఉక్రెయిన్‌ను వీడిన శరణార్థులు: 35 లక్షలు
నిరాశ్రయులైనవారు: కోటిమంది.
ఉక్రెయిన్ ఆర్థిక నష్టం: సుమారు రూ. 8 లక్షల కోట్లు
ఉక్రెయిన్ వైపు మరణాలు: 691 మంది పౌరులు. గాయపడిన వారు: 1,143 మంది (ఐరాస లెక్కల ప్రకారం)
రష్యా వైపు మరణాలు: 15,800 మంది సైనికులు (ఉక్రెయిన్ రక్షణశాఖ గణాంకాలు).
Comments
Please login to add a commentAdd a comment