
మాట్లాడుతున్న పోతినేని సుదర్శన్‌రావు
- హాజరుకానున్న బందాకారత్
ఖమ్మం సిటీ : జిల్లాలో పోడు రైతులపై ఫారెస్టు, పోలీసుల నిర్బంధాన్ని నిలిపివేయాలని, 2005 ముందు నుంచి సాగు చేస్తున్న గిరిజన పోడు రైతులందరికీ హక్కు పత్రాలివ్వాలని, బ్యాంకు రుణాలు అందించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో ఆగస్లు 10న ఖమ్మంలో భారీ ప్రదర్శన, మహాధర్నా నిర్వహిస్తున్నామని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు తెలిపారు. బుధవారం నగరంలోని స్థానిక సందరయ్య భవన్‌లో జరిగిన సీపీఎం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పోడు రైతులను సమీకరించి నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించనున్నామన్నారు. కార్యక్రమానికి పార్టీ జాతీయ నాయకురాలు, మాజీ ఎంపీ బందాకారత్ ముఖ్య అతిథిగా హాజరువుతారని వివరించారు.
జిల్లాలో శ్రీరామ, శ్రీరాంసాగర్, భక్తరామదాసు, సింగరేణి, ఓపెన్‌కాస్టు, కొవ్వూరు రైల్వే లైన్, విమానాశ్రయం తదితర ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయే రైతులందరికీ 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ భూ నిర్వాసితులకు ఎంత పరిహారం ఇవ్వాలని ఒప్పందం జరిగిందో బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దారపాడు గ్రామంలో పంటలను ధ్వంసం చేసిన సింగరేణి పీఓ, జీఎంలపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా నాయకులు కాసాని ఐలయ్య, పొన్నం వెంకటేశ్వర్లు, నున్నా నాగేశ్వరరావు, అన్నవరపు కనకయ్య, యర్రా శ్రీకాంత్, బండి రమేష్, యర్ర శ్రీనివాసరావు, మాచర్ల భారతి, జ్యోతి, రేణుక పాల్గొన్నారు.