
ఏటీఎమ్ రెండుసార్లకు మించి వాడితే కోతే!
రెండుసార్లు దాటితే రూ.20 చార్జ్
న్యూఢిల్లీ: నగరాల్లో ఏటీఎం వినియోగ నియమ నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మార్చనుంది. మీ అకౌంట్ ఉన్న బ్యాంక్ (హోమ్ బ్యాంక్) ఏటీఎం కాకుండా వేరే బ్యాంక్ ఏటీఎం (థర్డ్‌పార్టీ) ద్వారా నగదు ఉపసంహరణ ఇక నెలకు రెండుసార్లు మాత్రమే ఉచితం కానుంది. మూడవసారి ఈ ఉపసంహరణ జరిగితే అదనపు చార్జీల భారం భరించకతప్పదు. ఈ వినియోగ చార్జీ రూ.20 వరకూ ఇప్పటివరకూ ఈ నెలవారీ ‘ఉచిత’ పరిమితి ఐదు సార్లు వరకూ ఉండేది.
ఈ మేరకు ఆర్‌బీఐ బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చింది. అయితే గ్రామీణ ప్రాంతాలకు తాజా నిబంధన వర్తించదు. కాగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఏటీఎం వివరాలను తెలియజేయాలని సైతం బ్యాంకులను ఆర్‌బీఐ ఆదేశించింది. ఏటీఎంల ఏర్పాటు, నిర్వహణ, లావాదేవీలు వంటి అంశాలకు సంబంధించి వ్యయాలు పెరిగిపోతున్న నేపథ్యంలో థర్డ్‌పార్టీ ఏటీఎంల వినియోగం సంఖ్యను రెండుకి తగ్గించాలని గత కొంత కాలంగా బ్యాంకులు చేస్తున్న డిమాండ్ నేపథ్యంలో ఆర్‌బీఐ తాజా చర్య తీసుకుంది.