
బ్యాంకుల్లోనూ క్యాష్ కటకట!
♦ శ్రీకాకుళం జిల్లాలో విచిత్ర పరిస్థితి
♦ డిపాజిట్లను మించిపోయిన విత్‌డ్రాలు
♦ ఏటీఎంలు ఖాళీ, క్యూ కడుతున్న జనం
♦ మరికొన్నాళ్లు తప్పదంటున్న బ్యాంకర్లు
♦ ఆర్‌బీఐ నుంచి నగదు వస్తేనే పరిస్థితి కొలిక్కి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జేబులో డబ్బులు లేకపోవటం చూశాం. చేతిలో చిల్లిగవ్వ లేదనటం విన్నాం. కానీ బ్యాంకులో డబ్బు లేదనటం ఎక్కడైనా చూశారా? ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఇదే జరుగుతోంది. ఒక్క బ్యాంకు కాదు... ఒక బ్రాంచి కాదు. దాదాపు అన్ని బ్యాంకుల్లోనూ ఇదే పరిస్థితి. ఇక ఏటీఎంల సంగతైతే చెప్పనక్కర్లేదు. ప్రతి ఏటీఎం ముందూ జనాల బారులే. ఎంత లైన్లున్నా చాలా చోట్ల ఖాళీ ఏటీఎంలే కనిపిస్తున్నాయి. దీనికి కారణమేంటంటే చెల్లింపులకు సరిపడా డిపాజిట్లు లేవు.
పెపైచ్చు ఫిబ్రవరి నెలలో విత్‌డ్రాయల్స్ విలువ చాలా ఎక్కువగా ఉంది. పక్షం రోజులుగా జిల్లా వ్యాప్తంగా జాతరలు, తీర్థాలతో పాటు వివాహాలూ భారీగా జరుగుతుండటంతో ఏటీఎంల వద్ద జనం డబ్బు కోసం క్యూ కడుతున్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఇవ్వాల్సిన పేమెంట్లు కూడా జిల్లా వ్యాప్తంగా ఒకేసారి ఇవ్వాల్సి రావడం విత్‌డ్రాయల్స్ అధికమయ్యాయి. డబ్బు తీసుకున్న కొనుగోలుదారులు వాటిని ఇతర ప్రాంతాల్లో జమ చేస్తుండటం, స్థానికంగా డిపాజిట్లు తగ్గటం వంటివి పరిస్థితికి ఆజ్యం పోస్తున్నాయి.
రెండు వారాల నుంచీ ఇదే పరిస్థితి...
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 281 బ్యాంకులు, 240 వరకు ఏటీఎం సెంటర్లు ఉన్నాయి. బ్యాంకును బట్టి ఒక్కో ఏటీఎంలో వారం నుంచి నెలరోజుల వ్యవధిలో కనీసం రూ.10 నుంచి 20 లక్షల వరకు పెడుతుంటారు. ఖరీఫ్ చివర్లో మొదలైన ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఫిభ్రవరి 15 నుంచి చెల్లింపులు జరుగుతున్నాయి. నెలాఖరు నాటికి సుమారు రూ.150 కోట్ల అవసరం వచ్చింది. ఫిబ్రవరిలో ఫించన్ల చెల్లింపులు రూ.30 కోట్ల మేర జరిగాయి. ట్రెజరీల నుంచి వచ్చే బిల్లుల ఆధారంగా జీతాలకూ కనీసం రూ.20 నుంచి రూ.30 కోట్లు కావాలి. వివిధ ప్రాంతాల నుంచి బ్యాంకులకు రావాల్సిన మొత్తాలు ఆన్‌లైన్‌లోనే వస్తుంటాయి. పేమెంట్ల మొత్తాన్ని, డిపాజిట్ల మొత్తాన్ని సగటున లెక్కించి సొమ్ము అవసరమైన పక్షంలో ఇతర జిల్లాల నుంచి తెప్పిస్తున్నారు.
అలా ఒక్క ఫిబ్రవరిలోనే విజయవాడ నుంచి ఎస్‌బీఐ సుమారు 80 కోట్ల రూపాయలు తెప్పించింది. ఆ మొత్తాన్ని 50-80 ఏటీఎంలలో సర్దేసరికి ఖాళీ అయిపోయింది. రోజుకు జిల్లా వ్యాప్తంగా ఒక్క ఎస్‌బీఐలోనే రూ.10 కోట్ల డిపాజిట్లు ఉంటున్నాయి. కారణాలు తెలియరాలేదు గానీ... ఫిబ్రవరిలో ఈ మొత్తం తగ్గింది. దీంతో క్యాష్ కోసం జనం కిటకిటలాడాల్సి వచ్చింది. కొన్నాళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నా... ఫిబ్రవరిలో మరీ ఎక్కువయింది. శివారు ప్రాంతాల ఏటీఎంలలోనూ రద్దీ కని పించింది. ప్రైవేట్ బ్యాంకులు, ఏటీఎంల పరిస్థితీ అంతే. ఇతర బ్యాంకులపై ఎస్‌బీఐ ఆధారపడినా... అది కొంతవరకే ఉపయోగపడింది.
ఆర్‌బీఐ నుంచి నిధులు రాకపోవడమే...
నగదుకు కొరత వస్తే బ్యాంకులు ఆర్‌బీఐ నుంచి తెప్పిస్తుంటాయి. చెల్లింపులకు సరిపడా డిపాజిట్లు లేకపోయినా, తక్కువ చెల్లింపులు, ఎక్కువ పేమెంట్ల సమయంలో తమకు నిధులు అవసరమంటూ లేఖలు రాస్తాయి. ఒక్క ఫిబ్రవరి నెలలో ఆంధ్రాబ్యాంకు రూ.40 నుంచి రూ.50 కోట్ల కోసం రిక్వెస్ట్ లెటర్లు పంపింది. ఎస్‌బీఐ కూడా రూ.100 కోట్లు కావాలని కోరింది. సమయానికి ఆర్‌బీఐ నుంచి డబ్బులు రాకపోవడంతో బ్యాంకులు చేతులెత్తేశాయి.
ఎస్‌బీఐ ఏటీఎంలలో నిత్యం రూ.8 కోట్లు పెడుతుంటామని, ఈ సారి పూర్తి స్థాయిలో ఖాళీ అయిపోవడం, బ్యాంకు వద్ద డబ్బు లేకపోవడంతో ఆర్‌బీఐపైనే ఆధారపడాల్సి వచ్చిందని ఎస్‌బీఐ రీజినల్ మేనేజర్ మేరీ సగయా ‘సాక్షి’కి చెప్పారు. మార్చి మొదటి వారంలో ఆర్‌బీఐ నుంచి నిధులొస్తాయని, పరిస్థితి సర్దుమణుగుతుందని ఆమె చెప్పారు. ‘‘ప్రైవేట్ బ్యాంకుల నుంచి తీసుకున్న మొత్తాల్ని ఏటీఎంలలో సర్దాం. కొన్నాళ్లుగా నగదుకు ఇబ్బంది ఉన్న మాట నిజమే’’ అన్నారామె. కాగా జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో ఇదే పరిస్థితి ఉంద ని, దీన్ని ఆర్‌బీఐ దృష్టికి తీసుకెళ్ళామని లీడ్ బ్యాంకు మేనేజరు ఎల్.రామిరెడ్డి చెప్పారు. త్వరలోనే సమస్య నుంచి బయటపడతామన్నారు.