
చెన్నైవాసులకు ఊరట కలిగించే వార్త
చెన్నై: భారీ వర్షాలు, వరదలతో కష్టాలుపడుతున్న చెన్నై వాసులకు ఊరట కలిగించే వార్త. మరో 48 గంటల పాటు చెన్నైలో వర్షాలు పడే సూచన లేదని శుక్రవారం భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మరో మూడు రోజుల పాటు చెన్నైలో భారీ వర్షాలు పడతాయని ఈ రోజు ఉదయం చేసిన హెచ్చరికను ఉపసంహరించుకున్నట్టు తెలియజేసింది.
చెన్నైలో వర్షం కాస్త తగ్గుముఖంపట్టినా చాలా ప్రాంతాలు వరద ముంపులోనే ఉన్నాయి. భారత వైమానిక దళం ఏరియల్ సర్వే నిర్వహించి సహాయక చర్యలు చేపడుతోంది. వర్షం ఇకనైనా ఆగిపోతే సహాయక చర్యలను వేగవంతం చేయడానికి వీలవుతుంది. తమిళనాడు వరద బాధితులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు, వివిధ రాష్ట్రాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల వల్ల తమిళనాడులో ముఖ్యంగా చెన్నైలో అపారనష్టం ఏర్పడిన సంగతి తెలిసిందే. రోడ్లన్నీ జలమయంకాగా రైళ్లు, విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.