అభిప్రాయం
తాగునీరు, సాగునీరు కోసం తెలంగాణం దశాబ్దాలుగా పెట్టిన గోసకు కేసీఆర్ ఇప్పుడు చరమగీతం పాడుతున్నారు. పల్లెల్లో నీళ్ల కష్టాలు చెల్లిపోతున్నాయి కాబట్టే నీళ్లపై పాడిన అజరామర పాటలు ప్రజల జ్ఞాపకాల్లోంచి కనుమరుగు కానున్నాయి.
భాషకు సాహిత్యమే సర్వస్వం కాకపోవచ్చు... కానీ తెలంగాణ భాష, యాసలకు సాహిత్యం తోనే నిండుదనం. ప్రజల గోసే తెలంగాణ సాహిత్యం. కష్టమొచ్చినా.. కన్నీరొలికినా పాటందుకుంటరు. పంట పండినా పాటే.. ఎండినా పాటే. పూట పూటకు పాటపాడి, పాటతోనే పూటెళ్ల దీస్తరు. ఇక్కడ ఆరని దుఃఖం ఉంది. బూరుగు గడ్డిల బురుక పిట్ట ఎగిరినట్టు... గోగు పువ్వు గొంతుల రాగం ఊరినట్టు ఊరి ఊరికో పాట వినిపిస్తది. ప్రాచీన కవుల నుంచి ఇప్పటి ప్రజా కవుల వరకు కష్టాలు, చెమట చుక్కల నేపథ్యమే కథా వస్తువులు. ప్రజా సాహిత్యానిదే ఆధిపత్యం. పాల్కురికి సోమనాథుడు, బమ్మెర పోతన రచనల్లో శ్రమైక జీవనే కనిపిస్తుంది.
‘తాగబోతే నీళ్లు లేవు తుమ్మెదాలో...
తడిగొంతులారిపోయో తుమ్మెదాలో
రాకరాక నల్లల్లొస్తే ఒక్క బిందే నిండదాయో...
కుండలెనుకా కుండలాయో
కోసు పొడుగు లైనులాయే తుమ్మెదాలో’
ఇది ప్రజా గాయని బెల్లి లలిత నరహంతకుడు నయీం చేతిలో దారుణహత్యకు గురి కావటానికంటే ముందు మా దుబ్బాకలో చివరిసారిగా ఆలపించిన పాట. రెండు దశాబ్దాల పాటు ప్రజల హృదయాల్లో పదిలంగా ఉన్న పాట అది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు కూడా ఆ పాట సజీవమే. కానీ ఇప్పుడా పాట మెల్లగా ప్రజల మధ్యలోంచి వెళ్లిపోతోంది. నేను అధికారి పార్టీ ఎమ్మెల్యేను అని చెప్పటం కాదు పల్లెల్లో నీళ్ల కష్టాలు చెల్లిపోతున్నాయి. మిషన్ భగీరథ ఎండిన ప్రతి గొంతును తుడుపుతోంది. పాలమూరు, కాళేశ్వరం నీళ్లు ప్రతి ఎకరంలో పారబోతున్నాయి. తల్లి గోదారై వచ్చి పొక్కిలైన ప్రతి ఇంటి లోగిల్లో కల్లాపి జల్లుతోంది. నీళ్ల కష్టం తీరినప్పుడు ఆ పాట క్రమంలో ప్రజల్లోంచి వెళ్లిపోయి కాలగర్భంలో ఒదిగిపోతుంది.
మా దుబ్బాక ప్రాంతానికి కూడెళ్లి వాగే పెద్ద నది. వాగు పొంగి ప్రవహిస్తే..మా పంటలను ముంచకుంటే చాలు అనుకునే వాళ్లం. కానీ ఆ నీళ్లకు అడ్డంపడి మలుపుకోవాలన్న సోయే మాకు లేకుండే. మా నీళ్లన్నీ అప్పర్ మానేరు మీదుగా గోదావరిలో కలిసేవి. కేసీఆర్ దుబ్బాక పాఠశాలలోనే చదువుకున్నాడు. కూడెళ్లి వాగులో ఈత కొట్టిండు. అప్పటి నుంచే ఆయనకు ఈ వాగు నీళ్ల మీద ఆలోచన ఉండేది. నేను జర్నలిస్టుగా పని చేస్తున్న కాలంలోనే ‘రామలింగారెడ్డి కూడెళ్లి నీళ్లు ఎటు పోతున్నయో ఎందుకు రాయవయ్యా’ అని అడిగేవారు. వెళ్లిపోయిన కూడెళ్లి నీళ్లనే కాదు... గోదావరి నీళ్లనే మళ్లించి ఇప్పుడు రైతన్నల పాదాలు కడుగుతున్నారు. ఇప్పటికే తపాస్‌పల్లి నిండి కొండపాక పల్లెలను తడిపింది. వచ్చే జూన్ మాసం నాటికి తెలంగాణ మాగాణం అంతా తడుస్తుంది.
మల్లన్న సాగర్ ముంపు గ్రామాల మీద కూడా పదుల సంఖ్యలో పాటలు వచ్చాయి. కాంగ్రెస్ వాళ్లు పని గట్టుకొని ఆ పాటలు రాయిస్తున్నారు. ఏ వేదిక మీదకు వచ్చినా మల్లన్న సాగర్ ప్రస్తావనే తీసుకు వస్తున్నారు. ఇదే కాంగ్రెస్ వాళ్లు మల్లన్న సాగర్ మీద 300 కేసులు వేశారు. 50 టీఎంసీల స్టోరేజీ అవసరం ఏమిటని అంటున్నారు. ఇక నన్నైతే సాగర్‌లోనే ముంచాలని చూస్తున్నారు. అయినా నేను దాన్ని తప్పుబట్టను. ఎందుకంటే ప్రశ్నించటం.. ఎదురించటం అనేది తెలంగాణ ప్రజా సాహిత్యంలో అంతర్భాగమే.
మల్లన్న సాగర్ ప్రాజెక్టు కడుతున్న తొగుట మండలానికి భౌగోళికంగా ప్రాధాన్యం ఉన్నది. నైసర్గికంగా ఎత్తయిన ప్రదేశంలో ఉండటం. గోదావరి, కృష్ణానది బేసిన్ల పరీవాహక ప్రాంతాల మధ్యగల ప్రదేశం ఇది. ఇక్కడ +557మీ వద్ద నీటిని నిల్వ చేస్తే అక్కడి నుంచి సొంత ఆయకట్టు 1.25 లక్షల ఎకరాలతో పాటుగా, కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా ఎగువకు నీటి సరఫరా చేయడంతో పాటుగా, చుట్టూ అన్నీ వైపులనున్న స్కీంలకు నీటిని అందించి ఆదుకోవచ్చు.
భవిష్యత్తు అవసరాలపై కేసీఆర్ ప్రభుత్వానికి పక్కా ప్రణాళిక ఉంది. నిర్మాణం పూర్తి అయిన ప్రాజెక్టు కింద 433.04 టీఎంసీలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల కింద 475.79 టీఎంసీలు, చేపట్టబోయే ప్రాజెక్టుల కింద 45.38 టీఎంసీలు మొత్తం కలిపి 954 టీఎంసీల జలాలు వాడుకునే విధంగా కేసీఆర్ వ్యూహ రచన చేశారు. కృష్ణా నదిపై కల్వకుర్తి, పాలమూరు ఎత్తిపోతలకు ఒక రూపం వస్తోంది. సాగునీటి మంత్రి హరీశ్‌రావు కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి పాలమూరు జిల్లా లో రోజుకు 1600 క్యుసెక్కుల నీళ్ల చొప్పున ఇస్తూ కొల్లాపూర్, నాగర్‌కర్నూలు, అచ్చంపేట నియోజకవర్గాల్లో 3 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేశారు. శతాబ్దాల కాలంగా ఫైళ్లలోనే మగ్గిన నెట్టెంపాడు ద్వారా 1.2 లక్షలు, భీమా ద్వారా 1.4 లక్షల ఎకరాలు, కోయిల్‌సాగర్ ద్వారా 8 వేల ఎకరాలు కొత్త ఆయకట్టుకు నీరందించింది.
భవిష్యత్తు కోటి ఎకరాల నా తెలంగాణ మాగాణంలో..
‘నాగేటి సాళ్లల్ల నా తెలంగాణా... నా తెలంగాణా... నవ్వేటి బతుకులు నా తెలంగాణ... నా తెలంగాణ. పారేటి నీళ్లల్ల పానాదులల్లా... పూసేటి పువ్వుల్ల పునాసలల్లా కొంగుజాపిన నేల నా తెలంగాణా... నా తెలంగాణ. పాలు తాపిన తల్లి నా తెలంగాణా... నాతెలంగాణ’ అని నా గురువు నందిని సిధారెడ్డి రాసిన అద్భుత సాహిత్యమే చిరస్మరణీయం.
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక శాసన సభ్యులు ‘ 94403 80141
సోలిపేట రామలింగారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment