భూమిపై రైతుకే పక్కా హక్కు | Solipeta Ramalinga Reddy Article On Farmers | Sakshi
Sakshi News home page

భూమిపై రైతుకే పక్కా హక్కు

Published Tue, May 14 2019 12:48 AM | Last Updated on Tue, May 14 2019 12:48 AM

Solipeta Ramalinga Reddy Article On Farmers - Sakshi

ఏప్రిల్‌ మాసం చివరి వారంలో అనుకుంటా... సిద్దిపేట కలెక్టర్‌తో పనుండి కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లిన. ఆయన ఏదో పనుండి బయటికి పోయిండట.10 నిమిషాల్లో వస్తారు... చాంబర్లో కూర్చోమన్నారు. నేను బయటికి  వచ్చి సాధారణ విజి టర్స్‌ లాంజ్లో కూర్చున్నా... 60 ఏళ్లకు పైబడిన ఓ పెద్దాయన, రెండు చేతులతో దండం పెడుతూ... ‘రామలింగన్నా’ అంటూ బోరున ఏడుస్తూ దగ్గరకు వచ్చాడు. చేతిలో సంచి ఉంది..అందులో పట్టాదారు పాసుపుస్తకం, భూమి హక్కు పత్రాలు ఉన్నాయి. దగ్గరకు తీసుకొని నిమ్మళపరచి అడిగితే హసన్‌ మీరాపూర్‌ గ్రామం అని చెప్పాడు. ఆయన పేరు మీద 6 ఎకరాల భూమి ఉండగా వీఆర్వో రెండు ఎకరాలు వేరేవాళ్ల మీదకు మార్చిండట. 3 నెలల నుంచి రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నానని చెప్పాడు. ఎలా గోలా తన్లాడి సరి చేయించాను కానీ... గ్రామాల్లోని రెవెన్యూ రికార్డుల్లో  వందల కొద్ది తప్పులు ఉన్నాయి.

మొఘలుల కాలం నుంచి  ఇప్పటి వరకు పాలకులెవ్వరూ రైతుకు  భూమిపై హక్కులు కల్పించలేదు. యజమానులకు టైటిల్‌ గ్యారంటీ ఇవ్వలేదు. 1985కు ముందు  పటేల్, పట్వారీ వ్యవస్థ అమల్లో ఉండేది. మా నాన్న రామకృష్ణారెడ్డి దుబ్బాక మండలం చిట్టాపూరుకు పోలీస్‌ పటేల్‌గా ఉన్నారు. అయితే అగ్రకుల ఆధారి తంగా నియమించబడే పటేల్, పట్వారీల వ్యవస్థకు వ్యక్తిగతంగా నేను వ్యతిరేకమే. కానీ ఆ కాలం లోనే గ్రామీణ–రెవెన్యూ కొంత మేలు. ఎన్టీఆర్‌ ప్రభుత్వం పట్వారీ వ్యవస్థను హడావుడిగా రద్దు చేసింది కానీ భూ రికార్డుల నిర్వహణ కోసం ఒక పకడ్బందీ వ్యవస్థను రూపొందించలేకపోయింది. ఇక్కడే రెవెన్యూ శాఖ పునాది దెబ్బతిన్నది. పట్వారీ వ్యవస్థలో రెవెన్యూ రికార్డుల నిర్వాహణ కోసం ప్రతి గ్రామానికి ఒక  మాలిపటేల్‌  ఉండేవాడు. అతనికి గ్రామం మీద పూర్తి అవగాహన ఉండేది. రెవెన్యూ రికార్డుల్లో అతి ముఖ్యమైన పహాణీ ఆయన చేతిలోనే ఉండేది. భూమి హక్కు ఉండి, మోకా మీద ఉన్న రైతుల పేర్లే  పహా ణీలో నమోదు చేసేవాళ్లు. రికార్డుల్లో 95 శాతం కచ్చితత్వం ఉండేది.

పట్వారీ వ్యవస్థ రద్దు తర్వాత పట్వారీల స్థానంలో రెండు మూడు గ్రామాలను కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటుచేసి ప్రతి క్లస్టర్‌ గ్రామానికి ఒక గ్రామ రెవెన్యూ అధికారిని నియమించారు. ఆయనకు స్థానిక గ్రామాల మీద పట్టు ఉండేది కాదు. రైతుల పేర్లు, వారి పేరు మీద ఉన్న భూ విస్తీర్ణం నమోదులో తప్పులు దొర్లేవి. అవే తరువాత ఏడాదికి ఒప్పులుగా చెలామణి అయ్యేవి. మోక మీది హద్దు రాళ్ల ఇబ్బం దులు, సర్వేయర్ల కొరత ఇవన్ని వెరసి రెవెన్యూ రికార్డుల నిర్వాహణ అనేది గందరగోళమైపోయాయి. రెవెన్యూ రికార్డు సరిగా లేనందున పట్టా కాలంలో ఒకరి పేరుంటే లబ్ది కాలంలో మరొకరి పేరు  వస్తోంది. కాలగమనంలో  భూముల విలువ విపరీతంగా పెరగటం, సర్వేరాళ్ల ఆనవాళ్లు లేకుండా పోవటం, రెవెన్యూ నియమ నిబంధనలు లోపభూయిష్టంగా ఉండటంతో రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాత రికార్డులను తిరగరాసి కొత్త రికార్డులే సృష్టిం చారు. నా నియోజవర్గం దుబ్బాకలో పట్టాలు ఉండి, భూములు లేని రైతులు వేల సంఖ్యలో ఉన్నారు. మోకా చూపించమని వాళ్లు జీవిత కాలం అంతా రెవెన్యూ కార్యాలయాల చుట్టు తిరుగుతూనే ఉన్నారు. వీళ్లందరి సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరకాలి?

ఇప్పుడున్న చట్టాలన్నీ పాతవి. అప్పటి కాల పరిస్థితులకు అనుగుణంగా ఆ చట్టాలనుచేశారు. ప్రస్తుతం ఎన్నో మార్పులు వచ్చాయి. సరికొత్త  సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. వీటన్నిటి మేళవింపుతో రైతు మేలే లక్ష్యంగా కొత్త చట్టాలు రావాలి. అప్పుడు మాత్రమే రైతులకు న్యాయం జరుగుతుంది.  కేసీఆర్‌ ప్రభుత్వం ఇప్పుడదే పనిలో ఉంది.  రైతులకు టైటిల్‌ గ్యారంటీ ఇచ్చి, ఆ భూముల్లోకి కృష్ణా గోదావరి జలాలను పారిస్తే వ్యవసాయ సంక్షోభ నిర్మూలనకు ఓ తొవ్వ దొరికినట్లే అని కేసీఆర్‌ మొదటి నుంచి ఆలోచన చేస్తున్నారు. వెంటనే అపరిష్కృతంగా ఉన్న భూముల సమస్య పరిష్కారంలో భాగంగా మొదటి దశలోనే సాదాబైనామాలను క్రమబద్ధీకరణ అమల్లోకి తెచ్చారు. ఆనవాళ్లు లేకుండా పోయిన సర్వే రాళ్లను తిరిగి పునరుద్ధరించేందకు భూ సర్వే ప్రతిపాదనలు తెచ్చారు.

ఆ తరువాత భూ రికార్డుల ప్రక్షాళన చేశారు. 24 గంటల నిరంతర విద్యుత్తు ఇచ్చారు. మరోవైపు ఏటా రూ 25 లక్షల కోట్ల ఖర్చుతో మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలతో పంట పొలాల్లోకి నీళ్లు తెచ్చే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. రైతులకు ఆర్థికంగా చేయూతనివ్వటం కోసం రైతుకు నగదు అందించే  రైతుబంధు పథకాన్ని అమల్లోకి తెచ్చారు. రైతు బీమాతో ఒక భరోసా నింపారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులకు టైటిల్‌ గ్యారంటీ ఇచ్చే ఆలోచన చేస్తున్నారు కంక్లూసివ్‌ టైటిల్‌ ఇప్పించాలనే ఆలోచనల ద్వారా పాతతరం పాలనా వ్యవస్థల్లో పెనుమార్పులకు శ్రీకారం చుట్టడాన్ని దుబ్బాక శాసనసభ్యునిగా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను.
సోలిపేట రామలింగారెడ్డి
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్టు,
దుబ్బాక ఎమ్మెల్యే ‘ 94403 80141

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement