కమతంపై పోలీసు పెత్తనం | Solipeta Ramalinga Reddy Article On Farm Issues In Telangana | Sakshi
Sakshi News home page

కమతంపై పోలీసు పెత్తనం

Published Tue, Feb 18 2020 2:54 AM | Last Updated on Tue, Feb 18 2020 2:55 AM

Solipeta Ramalinga Reddy Article On Farm Issues In Telangana - Sakshi

అది 20వ శతాబ్దం... 1941 జూన్‌ 17, సూర్యాపేట – జనగామ రోడ్డు. 
మాసిన షేర్వానీ, చిరిగిన అడ్డ పంచ నడుముకు  చుట్టి  ఓ బక్కపలచని ఫకీరు నడుచుకుంటూ వెళ్తున్నాడు. కండలు తిరిగిన గూండా ఒకడు కొడవలితో ఫకీరు మెడ మీద వేటు వేశాడు. ఇంకోడు కత్తితో పొడిచాడు. చనిపోయిన ఆ ఫకీరు షేక్‌ బందగి అయితే...  చంపిన వారు  విస్నూర్‌ దేశముఖ్‌ గూండాలు. షేక్‌ బందగికి వారసత్వంగా వచ్చిన పట్టా భూమిని విస్నూరు దేశముఖ్‌ బంటు  దౌర్జన్యంగా మలుపు కున్నాడు. బందగీ అడ్డం తిరుగుతాడు. తగాదా తుదకు కోర్టుకెక్కింది. కార్వాయి నడిచి నడిచి  బందగి వైపే ఫైసలా అయింది. బక్క రైతుకు భూమి దక్కటాన్ని జీర్ణించుకోలేని దేశముఖ్‌ బందగీని హత్య చేయించాడు. పారిన ఫకీరు నెత్తురు తెలంగాణ సాయుధ పోరాటానికి , ఇక్కడి  భూ పోరాటాలకు  జీవధార అయింది.  

21వ శతాబ్దం.. 
60 ఏళ్ల కల సాకారమైంది. తెలంగాణ జననేత కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజలు అడగకుండానే కమ్యూనిస్టులను మించిన ఎజెండాను రూపొందించి అమలు చేశారు. 70 ఏళ్లుగా లొసుగులతో సాగిన భూ రికార్డులను ప్రక్షాళన చేశారు. ఎవరి హద్దులు వాళ్లకు చూపించి  బీద, బిక్కీ, బడుగు, బక్క రైతుల  భూములకు ఎవరికి వారివి పక్కాగా పట్టా చేసి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.55 కోట్ల వ్యవసాయ భూమి ఉండగా వివాదరహితంగా ఉన్న 2.38 కోట్ల ఎకరాల భూమికి పక్కాగా పాసుబుక్కులు తయారు చేసి ఇచ్చారు. మిషన్‌ కాకతీయ పథకం కింద చెరువులను  పునరుద్ధరణ చేశారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, కాళేశ్వరం, సీతారామ సాగర్‌ ఒక్కొక్క ప్రాజెక్టును పూర్తి చేసుకుంటూ కృష్ణా, గోదావరి జలాలను కాలువలకు మళ్లించి చెరువులను నింపారు. ఆర్థికంగా చితికిపోయిన  అన్నదాతలకు చేయూతనిచ్చి సాగును గాడిలో పెట్టేందుకు ‘రైతుబంధు’ పథకాన్ని అమలు చేశారు. దీంతో చిగురించిన చెట్టు మీదికి పిట్టలు వచ్చి వాలినట్లుగా  వలసపోయిన జనాలు తిరిగి సొంతూళ్లకు చేరుకున్నారు. కొత్త ఆశలతో సాగుకు సిద్ధమయ్యారు. 

కమతం మీదికి సాగుకు వచ్చిన సన్న, చిన్నకారు రైతులకు అక్కడక్కడ మళ్లీ బందగీ అనుభవాలే ఎదురవుతున్నాయి. బడా పెట్టుబడిదారుల వైపు నిలబడిన పోలీసులు, లేని సమస్యలను ఉత్పన్నం చేసి నాలుగు రాళ్లు వెనకేసుకోవడానికి మొగ్గు చూపిస్తున్నారు.  వందలాది ఎకరాలను కొనుగోలు చేసి భూముల చుట్టూ పెన్సింగ్‌ వేసి ఏక  ఖండిక కమతాలుగా మార్చుకున్న పెట్టుబడిదారులు మధ్యలో ఉన్న వలస కూలీలకు చెందిన ఎకరం, అర ఎకరం భూములను అక్రమంగా కలిపేసుకున్నారు. సొంత భూములలో సాగు చేసుకునేందుకు తిరిగి వచ్చిన వలస కూలీలు లబోదిబోమంటూ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి పట్టా దారి హక్కు పుస్తకాలు సంపాదించుకుని వస్తే పోలీసులు లాఠీలు పట్టుకొని గెట్టుకు అడ్డంగా, కబ్జాదారులకు అండగ నిలబడుతున్నారు. కబ్జా మీద ఎవరు ఉంటే వారిదే భూమి అనే చట్టవిరుద్ధ నిబంధనలను అమలు చేస్తున్నారు. పట్టాదారుల మీద ఆక్రమణ కేసులు బనాయిస్తున్నారు. హైదరాబాద్‌ సమీపంలో ఉన్న మహబూబ్‌ నగర్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలతో పాటుగా కరీంనగర్, వరంగల్‌ జిల్లాలో ఈ సమస్యలు విపరీతంగా ఉత్పన్నమవుతున్నాయి. 

బాధితుల అభ్యర్థన మేరకు నా నియోజకవర్గం పరిధిలోకి వచ్చే  ఓ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ను సంప్రదిస్తే ‘రెవెన్యూ రికార్డులతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ప్రస్తుతానికి భూమి ఎవరి అధీనములో ఉందో వారే హక్కుదారులు. భూమి మీదికి వెళ్ళినవారు ఆక్రమణదారులు. అటువంటి వారిపై అక్రమ కేసులు పెడతాం’ అన్నారు. డీజీపీ ఆదేశాలమేరకే నడుచుకుంటున్నామని మరో సమాధానం చెప్పాడు. ఆయన చెప్పిన సమాధానంతో అవాక్కయ్యాను. పట్టా రైతుకు అన్యాయం జరుగొద్దనే ఆకాంక్షతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు తమ తీరు మార్చుకోకపోతే గతంలోలాగే మళ్లీ ప్రజల్లో అశాంతి రగిలే అవకాశం ఉంది. 


సోలిపేట రామలింగారెడ్డి
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్, అంచనాలు పద్దుల కమిటీ చైర్మన్, మొబైల్‌ 9440380141

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement