కరోనాపై మన యుద్ధం గెరిల్లా  పంథాలోనే | Solipeta Ramalingareddy Writes Guest Column About Coronavirus | Sakshi
Sakshi News home page

కరోనాపై మన యుద్ధం గెరిల్లా  పంథాలోనే

Published Sat, Mar 28 2020 12:50 AM | Last Updated on Thu, Apr 2 2020 10:56 PM

Solipeta Ramalingareddy Writes Guest Column About Coronavirus - Sakshi

‘తెప్పలుగ చెరువు నిండినప్పుడు ఊరి గొప్పలు పదివేలు గదరా సుమతీ..! ఊరి పటేండ్ల మూతి మీసం మిడిసి పడుతది. గౌడ్లోళ్లు కాటమయ్య పండుగ చేస్తరు . బైండ్లోళ్ళ కథలుంటయ్‌.. చిందోళ్ళ పాటలు ఉంటాయ్‌. పీర్లు దుంకులాడుతాయి.. సబ్బండ జాతులు దూలాడుతాయి’ అని సాక్షి సంపాదకులు వర్ధెల్లి మురళి ‘పిట్ట వాలిన చెట్టు’ పుస్తకానికి ముందుమాటలో చెప్పారు. ఆ కూర్పులో నా బాల్యం ఉంది. కట్టకింది పంట పొలాన్ని చూస్తూ కట్ట మీద నిలబడి మీసం మెలేసిన మా నాయిన జ్ఞాపకాల దొంతర ఉంది. బెస్తోళ్ళ వలకు చిక్కిన తొలి కొర్రమట్ట బాపు పటేల్‌ గిరి మెప్పు కింద పులుసు అయిన యాది ఉంది. ప్రకృతి గమనంలో బాపు కాలం చేశారు. ఆయనతో పాటే చెరువూ ఎండి పోయింది. వాగులు, వంకలు, వర్రెలు జ్ఞాపకాలు అయ్యాయి.

ఇక ఆ విషాదం ఓ గతం. చెదిరిపోయిన జ్ఞాపకం. కృష్ణా, గోదావరి నదులు నడకలు నేర్చి  తెలంగాణ బీడు భూముల మీద నడయాడుతున్నాయి. అటు కృష్ణా బేసిన్‌ ఇటు గోదావరి బేసిన్‌ పరిధిలోని ఎత్తిపోతల పథకాలు ఒక్కొక్కటిగా పూర్తయి చెరువులను నింపుతున్నాయి. బీడు భూములను మాగాణీగా మారుస్తున్నాయి. తెలంగాణ వైతాళికుడు కేసీఆర్‌ కట్టిన ప్రాజెక్టులు ఒకవైపు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరోవైపు గ్రామ దేవతలై గ్రామాలకు ప్రాణం పోస్తున్నాయి.  పల్లె ఇప్పుడు పేద తల్లి కాదు. కరువు, కల్లోలాల నుంచి బయటపడిన అన్నపూర్ణ.  

కరోనా విష పురుగులు ప్రపంచాన్ని కబళిస్తున్న వేళ  పల్లె తల్లి కలవరపడుతోంది. కన్న బిడ్డలను రమ్మంటోంది. కడుపులో పెట్టుకొని సాకుతానని భరోసాను ఇస్తోంది. కానీ మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవి ష్యత్తు కోసం, యావత్‌ మానవ జాతి మనుగడ కోసం కనిపించని శత్రువుపై సీఎం కేసీఆర్‌ యుద్ధం ప్రకటించారు. ఈ మహమ్మారితో యుద్ధం అంటే స్వీయ గృహనిర్బంధమే. అమ్మ రమ్మని పిలిచినా వెళ్లకుండా మనలను మనం నియంత్రించుకోవలసిన సమయం ఇది. కాలం అనుకూలంగా లేని ఈ సమయంలో గెరిల్లా పంథానే మన ముందున్న మార్గం. కలసిరాని ఈ  కాలంలో రెండడుగులు వెనక్కి వేసి మన సమయం వచ్చేంతవరకు పరిసరాలను గమనిస్తూ ఉండటం ఎంతో ముఖ్యం.  మనం ఇప్పుడు పల్లెకి పోతే పచ్చగా ఉన్న పల్లె కూడా కరోనా రాకాసి కోరలకు చిక్కి వల్ల కాడై పోతుంది. ఈ విపత్తును ఆపటానికి సీఎం బరువెక్కిన హృదయంతో ఇరవై ఒక్క రోజులు కర్ఫ్యూ పెట్టారు. ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉందాం. ఇది తాత్కాలికమే.

ఇదిలా ఉంటే.. కృష్ణా, గోదావరి బేసిన్‌ల పరిధిలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఎత్తిపోతల పథకాల ద్వారా ఏటా 282 టీఎంసీల మేర నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి.  ఈ సీజ న్‌లో కాళేశ్వరం ద్వారా 58 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోయడంలో అది 340 టీఎంసీలకు చేరింది. ఇందులో ప్రధానంగా పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల ద్వారానే కనీసంగా 120 టీఎంసీలు, ఏఎంఆర్‌పీ ద్వారా మరో 50 టీఎంసీల మేర నీరు ఎత్తిపోస్తుండగా, దేవాదుల, ఎల్లం పల్లి, గుత్ప, అలీసాగర్‌ వంటి పథకాల కింద మరో 70 టీఎంసీల ఎత్తిపోతల కొనసాగుతూ వస్తోంది. 

రెండు బేసిన్‌ల పరిధిలో 700 టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని కేసీఆర్‌ ప్రభుత్వం అంచనా వేసింది. రెండు బేసిన్‌లలోని 22 ఎత్తిపోతల పథకాల పరిధిలో 96 పంప్‌హౌస్‌లు ఉండగా, 318 పంపుల నిర్మాణం కొనసాగుతోంది. ఇందులో 270 పంపులు జూన్‌ నాటికి అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చిన నీటిని వచ్చినట్లుగా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి అటునుంచి మిడ్‌మానేరు వరకు ఎత్తిపోశారు. మిడ్‌మానేరులోకి ఈ సీజన్‌లో మొత్తంగా 52 టీఎంసీల మేర కొత్త నీరు రాగా, అందులోంచి 30 టీఎంసీల నీటిని లోయర్‌ మానేరు డ్యామ్‌కు తరలించారు. ఆ నీటిని వదిలి తొలిసారిగా ఎస్సారెస్పీ స్టేజ్‌–2 కింద ఉన్న  681 చెరువులు నింపారు. వీటి నీటి నిల్వ సామర్థ్యం 8.63 టీఎంసీలు.

ఈ యాసంగిలో 2.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుంది. ‘పిట్ట వాలిన చెట్టు’ పుస్తకానికి అవసరమైన సమాచారం కోసం రచయిత వెంకన్నతో కలిసి పాలమూరు జిల్లాలో పర్యటించినప్పుడు అక్కడి పారిన కాల్వలను, పచ్చబడిన పంట పొలాలు, బాగుపడిన బతుకులను కళ్ళ నిండా చూశాను.  పుస్తకావిష్కరణ కోసం వెంకన్న సొంత ఊరు కర్విరాల కొత్తగూడెం వెళ్ళినప్పుడు సూర్యాపేట జిల్లాలో మత్తడి దుంకుతున్న చెరువులను, అలుగుళ్ళ ఎదురెక్కుతున్న చేపజాతులను చూశాను. ఎక్కడి కాళేశ్వరం... ఎక్కడున్న  కర్విరాల కొత్తగూడెం. ఆ ప్రజలు కల్లో కూడా ఊహించని పరిణామం. 

తుంగతుర్తి దాటిన తరువాత కర్విరాల పల్లె పొలిమేర నుంచి జలజల జారిపోతున్న పిల్ల కాల్వల్ల నీళ్ళు చూస్తుంటే...! నా నియోజకవర్గం దుబ్బాక మదిలో మెది లింది. జవగళ్ళ భూములున్నా.. నీళ్ళు లేక బిక్కటిల్లిన నేల నాది. మల్లన్న సాగర్‌ తో బతుకు చిత్రం మారబోతదని భూములు త్యాగం చేశారు. ఆ కల ఈడేరబోతోంది. కాళేశ్వరం నీళ్ళు దుంకులాడుకుంటు వస్తున్నాయి. అనంతగిరి– అన్నపూర్ణమ్మ నిండింది. ఇక అక్కడి నుంచి రంగనాయక్‌ సాగర్‌ కు నీళ్ళు ఉరుకులాడుతున్నయి. గజ్వేల్‌ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్‌కు 16.18 కి.మీ. టన్నెల్‌ పనులు పూర్తికాగా 8 పంపులు సిద్ధమయ్యాయి.

రిజర్వాయర్‌ పనులు పూర్తికాకున్నా 18 కి.మీ. మేర ఫీడర్‌ చానల్‌ ద్వారా 15 టీఎంసీల సామర్థ్యంతో చేపడుతున్న కొండపోచమ్మ సాగర్‌ రిజర్యాయర్‌ను నింపేలా ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ నెల 25 నాటికి కొండపోచమ్మకు గోదావరి జలాలు చేరుతాయి. కనీసంగా 240 కిలోమీటర్ల దూరం గోదావరి తరలి రానుంది. రంగనాయక సాగర్‌ కింద సిద్దిపేట జిల్లాలో 50, సిరిసిల్ల జిల్లాలో 70 చెరువులు నింపుతూ, కొండపోచమ్మ వరకు మొత్తంగా 400 చెరువులు నిండుతాయి. ఈ మహా క్రతువుల్లో సీఎం మహా సంకల్పం అనిర్వచనీయమైనది, మంత్రి హరీశ్‌ రావు పట్టుదల  గొప్పది. సిద్దిపేట జిల్లా కలెక్టర్‌  వెంకట్రామిరెడ్డి శ్రమను అభినందించకుండా ఉండలేము.

మల్లన్న సాగర్‌ నిండితే  దుబ్బాక ప్రాంతంలో వ్యవసాయం మాత్రమే కాదు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల భవిష్యత్తుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. నేల స్వభావం, పంట  దిగుబడులపై అధ్యయనం చేసి సంబంధిత పంట ఆధారిత పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరుతూ నేను ఇటీవలే మంత్రి కేటీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేశాను. దానికి  ఆయన స్పందిస్తూ స్పష్టమైన హామీ ఇవ్వటం నా నియోజకవర్గం ప్రజల అదృష్టం. భవిష్యత్తు కోసం పల్లె అన్ని విధాలుగా రూపుదిద్దుకుంటుంది. 21 రోజులు మాత్రమే కాదు 6 నెలల విపత్తు వచ్చినా మూడు పూటల బువ్వ పెట్టి ఆశ్రయం ఇచ్చే దిశగా పల్లె ఎదుగుతోంది. అయితే దాన్ని అనుభవించేందుకు భవిష్యత్తులో మనం ఉండాలి.  మనం ఈ కష్టకాలం నిబ్బరంతో ఎదుర్కొందాం. ఉన్న ఊర్లో వైపు ఆలోచన చేయకుండా ఈ 21 రోజులు ఎక్కడికక్కడ స్వీయ నిర్బంధంలో ఉందాం.


వ్యాసకర్త : సోలిపేట రామలింగారెడ్డి
సీనియర్‌ జర్నలిస్ట్, అంచనాలు పద్దుల కమిటీ చైర్మన్‌
మొబైల్‌ : 94413 80141  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement