గమనించాల్సిన సైన్సు పరిణామాలు | Sakshi Guest Column On 2023 Special Projects In Various Sectors | Sakshi
Sakshi News home page

గమనించాల్సిన సైన్సు పరిణామాలు

Published Fri, Jan 6 2023 10:40 AM | Last Updated on Fri, Jan 6 2023 10:49 AM

Sakshi Guest Column On 2023 Special Projects In Various Sectors

కొత్త ఏడాదిలో శాస్త్ర విజ్ఞాన పరంగా చాలా అంశాలు ఆసక్తిగా నిలుస్తున్నాయి. కోవిడ్‌కు ముక్కు ద్వారా వేసుకునే టీకాతో పాటు, అధిక ఉష్ణోగ్రతల్లోనూ స్థిరంగా ఉండే టీకా రానున్నాయి. మొత్తంగానే కోవిడ్‌ పీడ విరగడైందని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించే అవకాశం ఉంది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు భారత్‌ తొలి ప్రయత్నంలో భాగంగా ఆదిత్య–ఎల్‌1ను ఈ ఏడాదే ప్రయోగించనున్నారు. ‘ఇస్రో’ ఈ ఏడాదిలోనే చంద్రయాన్‌–3ను కూడా ప్రయోగించనుంది. అణు విద్యుత్తు రంగంలో స్మాల్‌ మాడ్యులర్‌ రియాక్టర్లు పని చేయనున్నాయి. డిజిటల్‌ పేమెంట్స్‌ పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రవేశపెట్టనున్న డిజిటల్‌ రూపాయి ఒక చారిత్రక ఘట్టంగా నిలవనుంది.

కొత్త సంవత్సరంలో అప్పుడే నాలుగైదు రోజులు గడిచిపోయాయి. కాకపోతే ఫీలింగ్‌ మాత్రం గత ఏడాది జనవరి మాదిరిగానే ఉంది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఆవిర్భావంతో కోవిడ్‌ ఇంకోసారి విజృంభిస్తుందేమో అన్న బెంగ గత ఏడాదిదైతే, కొత్త రూపాంతరంతో ఏం చిక్కు వస్తుందో అన్న భయం ఈసారి వెంటాడుతోంది. సమస్య కేవలం మనుషులకు మాత్రమే కాదు, ఆరోగ్య వ్యవస్థ మొత్తానికీ సవాలు విసరగలగటం ఆందోళ నకరం. కాకపోతే దేశం ఇప్పటికే సంసిద్ధమై ఉన్న కారణంగా కొంచెం నింపాదిగా ఉండవచ్చు. అయితే ఈ ఏడాది ప్రశ్న కోవిడ్‌ ఇంకోసారి విజృంభిస్తుందా, లేదా? అన్నది కాదు. ఈ పీడ శాశ్వతంగా విరగడ అవుతుందా, కాదా? అన్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఘెబ్రియాసస్‌ మాత్రం కొంత ఆశావహంగానే ఉన్నారు. ఈ ఏడాది ఏదో ఒక సమయంలో కోవిడ్‌ శని వదిలిందని ప్రకటించే అవకాశమున్నట్లు చెబుతున్నారు. జనవరిలోనే జరిగే డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర కమిటీ సమావేశాల్లోనే ఈ అంశంపై చర్చ జరగనుంది. 

వేడిలోనూ పనిచేసే టీకా
కోవిడ్‌–19 ప్రపంచానికి ముప్పు అన్న హెచ్చరికను డబ్ల్యూహెచ్‌ఓ తొలగించినప్పటికీ వైరస్‌తో ప్రమాదం లేదని అర్థం కాదు. ఇప్పటికే ఉన్న అనేకానేక శ్వాసకోశ సంబంధిత వ్యాధుల జాబితాలోకి ఇది కూడా చేరిపోయి అప్పుడప్పుడూ అక్కడక్కడా వచ్చిపోతూ ఉంటుంది. ఆరోగ్య వ్యవస్థలు మాత్రం నిత్యం ముంగాళ్లపై ఉండా ల్సిన పరిస్థితి. అదే సమయంలో శాస్త్రవేత్తలు కొత్త టీకాలు, చికిత్స లను కనుక్కునే ప్రయత్నాల్లో ఉంటారు. భారత దేశంలో భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన నాసల్‌ వ్యాక్సీన్‌ (ముక్కు ద్వారా తీసు కునేది) అందరి దృష్టిలో ఉంది. అత్యవసర పరిస్థితుల్లో, బూస్టర్‌ డోసుగా వాడేందుకు ఈ టీకాకు అనుమతులు లభించాయి. ఈ టీకా వేయడం మొదలుపెడితే విస్తృత సమాచారం అందుబాటులోకి వస్తుంది. తద్వారా టీకా సామర్థ్యం ఏమిటన్నదీ తెలిసిపోతుంది. 

ఈ ఏడాది గమనించాల్సిన ఇంకో కోవిడ్‌ వ్యాక్సీన్‌ వేడిని కూడా తట్టుకునే రకానిది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్, బెంగళూరు లోని స్టార్టప్‌ కంపెనీ మైన్‌వాక్స్‌ సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేస్తున్నాయి. ఇప్పటివరకూ జరిగిన అధ్యయనాల ప్రకారం... ఈ టీకా ఆల్ఫా, బీటా, గామా, డెల్టా రూపాంతరితాలను నాశనం చేయగల యాంటీబాడీలను తయారు చేయగలదని తేలింది. చండీగఢ్‌లోని సీఎస్‌ఐఆర్‌–ఐఎంటెక్‌తోపాటు, ఆస్ట్రేలియన్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ప్రిపేర్డ్‌నెస్‌లలో ఈ టీకాను పరీక్షించారు. మానవ ప్రయోగాలు ఈ ఏడాది ప్రారంభం కావచ్చు. ఇప్పటివరకూ తయారైన టీకాలను రిఫ్రిజరేటర్లలో భద్రపరచాల్సిన అవసరముండగా... కొత్త టీకా అధిక ఉష్ణోగ్రతల్లోనూ స్థిరంగా ఉంటుంది. దీనివల్ల ఎంతో ప్రయోజన ముంటుందన్నది తెలిసిన విషయమే. 

ఆదిత్యుడి పైకి చూపు
ఈ ఏడాది శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అందరూ ఎదురు చూస్తున్న ప్రయోగాల్లో ఆదిత్య–ఎల్‌1 ముఖ్యమైందని చెప్పాలి. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు భారత్‌ తొలి ప్రయత్నమిది. సుమారు 400 కిలోల బరువుండే ఈ ఉపగ్రహంలో స్వదేశీ పరిజ్ఞానంతో సిద్ధం చేసిన విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కరోనాగ్రాఫ్‌ను ఏర్పాటు చేశారు. శ్రీహరికోట నుంచి ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే దీని ప్రయోగం జరిగే అవ కాశం ఉంది. కరోనాగ్రాఫ్‌తోపాటు ఆదిత్య–ఎల్‌1లో ఇంకో ఆరు పేలోడ్స్‌ ఉంటాయి. భూమి, సూర్యుడి గురుత్వాకర్షణ శక్తులు శూన్యంగా ఉండే లగ్రానిగన్‌ పాయింట్‌ (ఎల్‌1)లో ఉంటూ ఈ ఉపగ్రహం సూర్యుడిని పరిశీలిస్తుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ ఏడాదిలోనే చంద్రయాన్‌–3ను కూడా ప్రయోగించ నుంది. చంద్రుడి ఉపరితలం పైకి సురక్షితంగా దిగడాన్ని పరీక్షించేం దుకు చంద్రయాన్‌–2 ఉపయోగపడగా, తాజాగా చంద్రయాన్‌–3లో ఒక లాండర్, ఓ రోవర్‌ రెండూ ఉంటాయి. జీఎస్‌ఎల్వీ మార్క్‌–3 రాకెట్‌ ద్వారా వీటిని జాబిల్లిపైకి చేర్చనున్నారు. 

మళ్లీ గగన్‌యాన్‌ మిస్‌?
ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో గగన్‌యాన్‌ ఒకటి. అయితే అది ఈ ఏడాది కూడా డెడ్‌లైన్‌ను అందుకోకపోవచ్చు. 2018 ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ ‘‘భరత మాత ముద్దుబిడ్డ ఒకరు 2022 లేదా అంతకంటే ముందుగానే భారతీయ రాకెట్‌లో అంతరిక్షంలోకి ఎగురు తారు’’ అని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖల మంత్రి ఇటీవల లోక్‌సభలో ఒక ప్రకటన చేస్తూ, గగన్‌యాన్‌ను 2024 నాలుగో త్రైమాసికంలో ప్రయోగించే అవకాశం ఉన్నట్లు తెలపడం ప్రస్తావించాల్సిన అంశం. సిబ్బంది తప్పించు కునేందుకు అవసరమైన వ్యవస్థ, పారాషూట్‌ ఆధారంగా వేగాన్ని తగ్గించుకునేందుకు చేయాల్సిన ఏర్పాట్ల విషయంలో జాప్యం జరగడం వల్ల గగన్‌యాన్‌ మరోసారి వాయిదా పడింది. ఈ ప్రయో గాలు ఈ ఏడాది చివరిలో జరగవచ్చు. 2024 రెండో త్రైమాసికంలో సిబ్బంది లేకుండా ఒక ప్రయోగాన్ని నిర్వహించి ఆ తరువాత అసలు ప్రయోగం చేపట్టవచ్చు. గగన్‌యాన్‌లో పాల్గొనే వ్యోమగాముల ఎంపిక ఇప్పటికే జరిగిపోయింది. వీరు రష్యాలో తొలిదశ శిక్షణ పూర్తి చేసుకుని ప్రస్తుతం బెంగళూరులో ఇతర శిక్షణలు పొందుతున్నారు. 

చిన్న అణు రియాక్టర్లకు సమయం?
ఈ ఏడాది దేశంలో అణు విద్యుత్తు రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. స్మాల్‌ మాడ్యులర్‌ రియాక్టర్లకు సంబంధించి కొంత కదలిక కనిపించవచ్చు. కాలుష్య రహిత విద్యుత్తును ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఏర్పడటం వల్ల, పైగా ఉక్రెయిన్‌ యుద్ధం పుణ్యమా అని ప్రపంచస్థాయిలో విద్యుత్తు రంగం తీరుతెన్నులు మారి పోయాయి. భారీస్థాయి అణు రియాక్టర్ల మాదిరిగా కాకుండా, 300 మెగావాట్ల సామర్థ్యమున్న ఈ స్మాల్‌ మాడ్యులర్‌ రియాక్టర్లను ఫ్యాక్టరీల్లో తయారు చేసే సౌలభ్యం ఉంది. పెద్ద రియాక్టర్లనైతే విద్యుత్తు కేంద్రం ఏర్పాటు చేసే స్థలంలోనే అమర్చాల్సి ఉంటుంది. దీనివల్ల నిర్మాణానికి చాలా సమయం పట్టేస్తుంది. ఈ నేపథ్యంలోనే స్మాల్‌ మాడ్యులర్‌ రియాక్టర్ల తయారీలో ప్రైవేట్‌ కంపెనీలకూ అవ కాశం కల్పించేందుకు ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. 

డిజిటల్‌ రూపాయి కూడా..
రిజర్వ్‌ బ్యాంక్‌ డిజిటల్‌ రూపాయిని అందుబాటులోకి తేనుండటం ఈ ఏడాది ఎదురు చూడాల్సిన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానపరమైన అంశాల్లో ఒకటి. దీంతోపాటు జన్యుమార్పిడి ఆవాల పంట క్షేత్ర ప్రయోగాలు, జీ20 అధ్యక్ష స్థానంలో భాగంగా చేపట్టనున్న సైన్స్‌ డిప్లొ మసీ, కృత్రిమ మేధ రంగాల్లోని మార్పులనూ నిశితంగా చూడాల్సి ఉంటుంది. డిజిటల్‌ పేమెంట్స్‌ పెరిగిపోతున్న నేపథ్యంలో డిజిటల్‌ రూపాయి ఒక చారిత్రక ఘట్టంగా నిలవనుంది. భౌతిక రూపాయి కున్నంత భద్రత, ఫీచర్లు, నమ్మకం డిజిటల్‌ రూపాయికీ ఉంటాయని ఆర్‌బీఐ చెబుతోంది. గోప్యత ఎంత వరకన్నది ఒక సందేహమే. 

ఈ ఏడాది జరగనున్న జీ20 సమావేశాలు భారతదేశంలో జరుగుతున్న సైన్స్, టెక్నాలజీ ఇన్నొవేషన్లను ప్రపంచానికి పరిచయం చేసేందుకు చక్కటి అవకాశాల్ని కల్పిస్తున్నాయి. జీ20 సభ్యదేశా లన్నింటికీ మరింత దగ్గరయ్యేందుకు సైన్స్‌ డిప్లొమసీని ఉపయోగించు కోవాలి. ఇందులో భాగంగానే కోయంబత్తూరు, లక్ష్యద్వీప్, అగర్తలా, ఇండోర్, రాంచీ, సిమ్లా, డయూ, ఇటానగర్, దిబ్రూఘర్‌లలో శాటి లైట్‌ ఈవెంట్లు, సైన్స్‌ శాఖల మంత్రుల సమావేశాలు ఏర్పాటు చేశారు. అయితే... వీటిల్లో ఏ ఒక్కటీ సైన్సు, టెక్నాలజీలకు హబ్‌ అయిన బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లేదా అహ్మదాబాద్‌లలో నిర్వ హించకపోవడం ఆశ్చర్యకరమైన విషయం!


దినేశ్‌ సి. శర్మ.
వ్యాసకర్త సైన్సు అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement