సెప్టెంబర్ 17న ఒకే రోజు దేశంలో రెండున్నర కోట్లమందికి టీకాలు వేయడం ద్వారా కోవిడ్–19 వ్యాక్సినేషన్ ప్రక్రియ పతాక స్థాయికి చేరింది. గత ఎనిమిది నెలలకాలంలో ఒకే రోజు అత్యధిక సంఖ్యాక ప్రజలకు వ్యాక్సిన్ వేయడంలో ఇది సరికొత్త రికార్డు. ఈ రికార్డు ప్రదర్శన కూడా రాజకీయ వివాదాలకు దారితీసింది. పైగా ఆయా రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీల ప్రాతిపదికన వ్యాక్సినేషన్ పంపిణీలో వ్యత్యాసాలు పాటిస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. బీజేపీ పాలనలో ఉన్న చాలా రాష్ట్రాలు చెప్పుకోదగిన రీతిలో వ్యాక్సినేషన్‌ని అమలు చేస్తుంటే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఈ అంకెలలో వెనుకబడిపోయాయి. ప్రధాని మోదీ తన పుట్టిన రోజును తరచుగా జరుపుకుంటూ వస్తే భారత్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగంగా పూర్తి చేసుకుంటుందని కాంగ్రెస్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది.
గతవారం భారత్‌లో రెండు పరిణామాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. ఒకటి సెన్సెక్స్ 60,000 సూచిని తాకడం, కోవిడ్–19 వ్యాక్సినేషన్ ప్రక్రియ ఒక్కసారిగా పుంజుకోవడం. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ ఉద్దీపన చర్యల ఫలితంగా స్టాక్ మార్కెట్ రెక్కలు విప్పుకోగా, ప్రధాని నరేంద్రమోదీ జన్మదిన సందర్భంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను గత రికార్డులనూ బద్దలుగొట్టేలా అమలుపర్చారు. గతంలో ఒకే రోజు కోటిమంది ప్రజలకు కోవిడ్–19 వ్యాక్సిన్ వేసిన చరిత్ర ఉండగా సెప్టెంబర్ 17న ఒకే రోజు 2.5 కోట్లమందికి వ్యాక్సిన్ వేసి దిగ్భ్రాంతి కలిగించారు.
ఈ సంవత్సరం జనవరిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యాక, దేశంలో వ్యాక్సిన్ రూపొందిస్తున్న రెండు సంస్థల నుంచి సరఫరా విషయంలో సమస్యలు తలెత్తడం, దేశంలోని వయోజనులందరికీ రెండు డోస్‌లు వేయడంలో ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో ఈ ఒక రోజు అధిక వ్యాక్సిన్ రికార్డును సాధించడం మామూలు విషయం కాదు. ప్రపంచంలోనే అత్యంత అధికంగా వ్యాక్సినేషన్ చేపట్టిన దేశాల్లో భారత్ ఒకటి. ఇటీవలి కాలంలో చైనాను మినహాయిస్తే, సెప్టెంబర్ 17న ఒకేరోజున రెండున్నర కోట్లమందికి వ్యాక్సిన్ వేయడం కోవిడ్ కాలంలో ప్రజారోగ్యం సాధించిన గొప్ప విజయం. కోవిడ్–19 వ్యాక్సిన్ అభివృద్ధి 18 నెలల క్రితం ప్రారంభమైన తర్వాత భారత్ ఇంత గొప్ప ఫీట్ సాధించడం విశేషమనే చెప్పాలి.
అయితే కరోనా మహమ్మారి సమయంలో ప్రతిదీ వివాదాస్పదమైనట్లే వ్యాక్సినేషన్ విషయంలో సాధించిన ఈ రికార్డు ప్రదర్శన కూడా రాజకీయ వివాదాలకు దారితీసింది. వ్యాక్సిన్ సిరంజిని పోలిన ఒక భారీ కేక్‌ని భోపాల్‌లో కట్ చేశారు. ఆ రోజంతా అనేక వ్యాక్సిన్ సెంటర్లలో స్వీట్లు పంచారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన పుట్టిన రోజును తరచుగా జరుపుకొంటే భారత్ తన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగంగా పూర్తి చేసుకుంటుందని కాంగ్రెస్ పార్టీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. అయితే ప్రధాని కూడా దీనికి దీటుగా స్పందిస్తూ దేశంలో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ జరిగినందుకు తన ప్రత్యర్థులకు జ్వరం వచ్చినట్లుందని చెణికారు. ఈ రాజకీయ కుమ్ములాటలో వ్యాక్సినేషన్‌కి సంబంధించిన సీరియస్ సమస్యలన్నీ పక్కకుపోయాయి.
కోవిడ్–19కి వ్యతిరేకంగా మొత్తం జనాభాకు నిరోధక శక్తిని అందించే లక్ష్యంలో భాగంగా వ్యాక్సినేషన్ సంఖ్య పెరిగితే దాన్ని కచ్చితంగా ఆహ్వానించాల్సిందే. వ్యాక్సినేషన్ లక్ష్యం ప్రధానమైనది కాబట్టి ఈ ప్రక్రియ మొత్తంలో రికార్టుల స్థాపన, వెనుకపట్టు పట్టడం అనేవి మొత్తం ప్రక్రియలో భాగంగానే ఉంటాయి. సాధారణంగా, వ్యాక్సినేషన్ సంఖ్య పెరగడం అనేది వ్యాక్సిన్ డోసుల సరఫరా, ఆరోగ్యవ్యవస్థ సన్నద్ధత వంటి పలు కారణాలతో జరుగుతుంటుంది.
వ్యాక్సిన్ సరఫరా ఇప్పుడు మెరుగుపడుతోంది కాబట్టే వ్యాక్సిన్ నంబర్ల పెరుగుదలలో అది ప్రతిఫలించడం సహజం. అయితే వ్యాక్సినేషన్ పెరుగుదల ఆకస్మికంగా జరిగేది కాదు. కొన్ని రాష్ట్రాల్లో సెప్టెంబర్ 17 తరహా వ్యాక్సినేషన్ రికార్డులు దాదాపు 15 సార్లు సంభవించాయి. అయితే వ్యాక్సిన్ సరఫరాలో అనూహ్య పెరుగుదల లేనప్పటికీ ఒక రోజులో రెండున్నర కోట్లమందికి టీకాలు వేయడం అనేది వ్యూహాత్మక ఎత్తుగడతోనే సాధ్యమైనట్లు కనిపిస్తోంది. సెప్టెంబర్ 17 తరహా రికార్డు స్థాయి వ్యాక్సినేషన్‌లను నమోదు చేసిన రాష్ట్రాలు అంతకుముందు కానీ, ఆ తర్వాతి రోజుల్లో కానీ చాలా తక్కువ డోసులు వేసినట్లుగా తేటతెల్లమైంది. దేశంలో అద్భుతం జరిగి వ్యాక్సిన్ ఉత్పత్తి అమాంతంగా పెరిగినందున భారీ స్థాయిలో సరఫరా సాధ్యమై సెప్టెంబర్ రికార్డు సాధ్యమై ఉండాలి. లేదా కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు సెప్టెంబర్ 17 రికార్టు సాధించే లక్ష్యం కోసం గానూ వ్యాక్సిన్ డోసులను భారీ సంఖ్యలో నిల్వ చేసుకోవాలని ముందుగానే కేంద్రం సూచించి ఉండాలి.
అధికారంలో ఉన్న పార్టీలను బట్టి వ్యాక్సినేషన్ లో తీవ్ర వ్యత్యాసాలు చోటు చేసుకున్నాయి. ఇది అనుమానాలు రేగడానికి మరొక కారణమైంది. చాలావరకు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గణనీయంగా వ్యాక్సినేషన్ జరగగా, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు వెనుకబడిపోయాయి. ఆయా రాష్ట్రాలకు వ్యాక్సిన్ కేటాయింపు జరిపేది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖే కాబట్టి అధికారంలో ఉన్న ఒక ప్రత్యేక పార్టీ పట్ల పక్షపాతం చూపటం జరిగిందా అనే విషయమై అది వివరించాల్సిన అవసరం వచ్చి పడింది.
ప్రధాని మాత్రం పర్యాటక రంగానికి ఆర్థిక ఉద్దీపనతో వ్యాక్సినేషన్ డ్రైవ్‌ని అనుసంధానిస్తున్నట్లు సెప్టెంబర్ 18న సూచించారు. హిమాచల్‌ప్రదేశ్, గోవా అర్హులైన వయోజనులందరికీ తొలి డోస్‌లు పూర్తి చేయడానికి కారణం ఇదే. ఈ రెండు రాష్ట్రాలూ తమ పర్యాటక ప్రదేశాలకు ఇప్పటికే తలుపులు తెరిచేశాయి. సిక్కిం, అండమాన్–నికోబార్, కేరళ, లదాఖ్, ఉత్తరాఖండ్ వంటి ఇతర పర్యాటక ప్రముఖ రాష్ట్రాలు కూడా వ్యాక్సినేషన్ విషయంలో ఏమంత వెనుకబడి లేవని ప్రధాని పేర్కొన్నారు. ఇలాంటి ప్రాధాన్యతపై మొదట్లో పెద్దగా ఎవరూ మాట్లాడకపోవడానికి కారణం అప్పట్లో ఈ విషయంలో రాజకీయాలు తలదూర్చకపోవడమేనని ప్రధాని ఎత్తిపొడిచారు. వ్యాక్సిన్ల లభ్యత, ప్రజారోగ్యం కోసం వ్యాక్సిన్ ప్రాధాన్యతను నిర్ణయించడానికి బదులుగా కేంద్రప్రభుత్వం మరొక వర్గీకరణను ఎంచుకుంటోందని ప్రధాని ప్రకటనే తేటతెల్లం చేస్తోంది.
వ్యాక్సిన్ల సరఫరాని నిర్ణయించేది ఒక రాష్ట్రానికి ఉన్న పర్యాటక సామర్థ్యమే అయినట్లయితే, దేశీయంగానూ, విదేశీయులకు కూడా అత్యంత పెద్ద పర్యాటక ఆకర్షణగా ఉంటున్న కేరళ, రాజస్తాన్ రాష్ట్రాలకే వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. ఆర్థిక వ్యవస్థలోని ఇతర రంగాలకు కూడా వ్యాక్సినేషన్ ప్రా«థమ్యతను కల్పిస్తారా అని మనకైతే తెలీదు. గతవారం రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్, ఒకేరోజులో అంత పెద్ద రికార్డు చోటు చేసుకోవడంపై పుకార్లు అనేవి ప్రభుత్వ వ్యాక్సినేషన్ విధానంలో అనూహ్య మార్పుపై తమదైన ప్రభావం వేశాయి. పోలియో, చిన్న పిల్లలకు వ్యాక్సిన్ సమయంలో జాతీయ రోగనిరోధకతా రోజులు వంటివాటిని ప్రకటించి ప్రచారోద్యమం లాగా చేసి ఉంటే కోవిడ్–19 వ్యాక్సినేషన్ కూడా మరింతగా విజయవంతమై ఉండేదని నిపుణుల కమిటీ అభిప్రాయపడుతుంటే దానికి తగిన నిర్దిష్ట ప్రణాళికతో అది ముందుకు రావల్సి ఉంది.
గత వారం సంభవించినట్లుగా వ్యాక్సినేషన్ కోసం రాజకీయ కార్యకర్తలు ప్రజలను సమీకరించడానికి అనుమతించడం సానుకూలమైన విషయమని ఆరోగ్య సంస్థలు భావిస్తే దానిపట్ల స్పష్టత అవసరం. వ్యాక్సినేషన్ కోసం ప్రజలను సమీకరించడానికి ప్రత్యేక ఇమ్యునైజేషన్ రోజుల్నీ, వారాలనూ నిర్దేశించుకుంటే అవి మరింత సహాయకారిగా ఉంటాయి. అలాంటి సంఘటిత కార్యక్రమాలను ముందస్తు సన్నద్ధతతో ఆరోగ్య వ్యవస్థ అమలు చేయగలదు కూడా! ఇలాంటి ప్రత్యేక దినాల్లో ఆరోగ్య వ్యవస్థ గతంలోనే గొప్ప ఫలితాలను సృష్టించింది. ముఖ్యంగా చిన్నపిల్లలకు వ్యాక్సిన్ విషయంలో భారత్ ప్రపంచాన్నే ఆకట్టుకుంది. ఉదాహరణకు 2011లో ఒకేరోజులో భారత్ 17 కోట్ల పోలియో వ్యాక్సిన్‌లను ఇవ్వగలిగింది.
వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను నిర్దేశిస్తున్న, దాన్ని అమలుచేస్తున్న అన్ని అంశాలను ఆరోగ్య మంత్రిత్వశాఖ, ఐసీఎమ్‌ఆర్ వంటి శాస్త్రీయ సంస్థలు ప్రజా ప్రయోజనం రీత్యా బహిర్గతపరచాలి. ఈ ప్రక్రియలో రాష్ట్రాలను కూడా భాగస్వాములుగా పరిగణించాలి తప్ప కేంద్రం నుంచి వ్యాక్సిన్ పుచ్చుకుంటున్న పాత్రకు వాటిని పరిమితం చేయకూడదు. వ్యాక్సిన్ ఉత్పత్తి పెంపుదలతో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. అదే సమయంలో విదేశాలకు వ్యాక్సిన్ పంపిణీ చేసే ‘వ్యాక్సిన్ మైత్రి’ కార్యక్రమాన్ని కూడా పునరుద్ధరించడానికి ప్రభుత్వం పథకమేస్తోంది. రోగనిరోధకతా పెంపు కార్యక్రమాన్ని శాస్త్రీయ, హేతుపూర్వక, పారదర్శక రీతిలో నిర్వహించడం ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ప్రజారోగ్య నిపుణుల బాధ్యత. ఏరకంగానైనా సరే దీన్ని రాజకీయాలకు అతీతంగా ఉంచాలి. వ్యక్తులతో లేక రాజకీయ పార్టీలతో దీన్ని అనుసంధానించకూడదు.
-దినేష్ సి. శర్మ, సైన్స్ వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment