సాక్షి, హైదరాబాద్: కరోనా టీకా వేసుకున్న తర్వాత దాని దుష్ప్రభావాల ఫలితంగా తెలంగాణలో 37 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కోవిడ్ టీకా ప్రారంభమైన 2021 జనవరి 16 నుంచి ఈ ఏడాది మార్చి 15వ తేదీ వరకు సంభవించిన మరణాలు, టీకా తర్వాత దుష్ప్రభావాలపై ఒక నివేదికను వెలువరించింది. నివేదిక ప్రకారం టీకా తర్వాత దు్రష్పభావాల కారణంగా దేశంలో 92,479 మంది ఆసుపత్రుల పాలయ్యారు. అందులో తెలంగాణలోనే 10,370 మంది ఆసుపత్రుల్లో చేరారు.
ఈ తరహా కేసుల్లో దేశంలో తెలంగాణ రెండో స్థానంలో ఉండగా, మధ్యప్రదేశ్ మొదటి స్థానంలోఉంది. ఆ రాష్ట్రంలో 10,513 ఘటనలు చోటుచేసుకున్నాయి. గుజరాత్‌లో 10,127 ఘటనలు జరిగాయి. దేశవ్యాప్తంగా ఈ మూడు రాష్ట్రాల్లోనే పదివేలకు పైగా ఇటువంటి ఘటనలు నమోదయ్యాయి. అలాగే మహారాష్ట్రలో 8,212, పశ్చిమబెంగాల్‌లో 8,130, కర్ణాటకలో 6,628 మంది ఆసుపత్రులపాలయ్యారు. కాగా, టీకా అనంతరం దేశంలో మొత్తం 1,156 మంది మరణించారు. అందులో అత్యధికంగా కేరళలో 244 మంది మృతి చెందారు. ఆ తర్వాత మహారాష్ట్రలో 102 మంది, ఉత్తరప్రదేశ్‌లో 86 మంది మరణించారు. మధ్యప్రదేశ్‌లో 85, కర్ణాటకలో 75, పశి్చమ బెంగాల్‌లో 70 మంది మరణించారు. కాగా, ఛత్తీస్‌గఢ్‌లో కేవలం ఒకరే మృతిచెందడం గమనార్హం.
ప్రతి 19.03 లక్షల డోసులకు ఒక మరణం..
దేశంలో ఇప్పటివరకు కోట్లాది మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు. అందులో కరోనా టీకా వేసుకున్న ప్రతీ 23 వేల మందిలో ఒకరు ప్రతికూల ప్రభావాలతో ఆసుపత్రుల్లో చేరారు. తెలంగాణలో ఇప్పటివరకు 3.24 కోట్ల మంది కరోనా టీకా మొదటి డోసు వేసుకున్నారు. ఇందులో 3.15 కోట్ల మంది రెండో డోసు, అలాగే 1.35 కోట్ల మంది బూస్టర్ డోసు తీసుకున్నారు.మొత్తం మూడు డోసులు కలిపి 7.75 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేశారు. కాగా, రాష్ట్రంలో టీకా తీసుకున్నవారిలో 37 మంది చనిపోయారు.
ఇప్పటివరకు దేశంలో 220 కోట్ల టీకా డోసులు ఇచ్చారు. అంటే ప్రతి 19.03 లక్షల డోసులకు ఒక మరణం సంభవించింది.తెలంగాణలో ప్రతీ 20.96 లక్షల డోసులకు ఒక మరణం సంభవించింది. వీటిని దుష్ప్రభావాలతో ఆస్పత్రుల్లో చేరిన తర్వాత జరిగిన మరణాలుగానే ప్రభుత్వం ప్రకటించింది. అంతేగానీ కరోనా వ్యాక్సిన్ వల్లే నేరుగా సంభవించిన మరణాలుగా ప్రకటించలేదని నిపుణులు అంటున్నారు. కోవిడ్ వ్యాప్తితీవ్రతతో సంభవించిన మరణాలతో పోలిస్తే టీకా అనంతర మరణాలు చాలా స్వల్పమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో 8.42 లక్షల మందికి కరోనా సోకగా, అందులో 8.38 లక్షల మంది కోలుకున్నారు. కరోనా కారణంగా అధికారికంగా 4,111 మంది చనిపోయారు.
ఇతర వ్యాక్సిన్లతోనూ ఇలాగే మరణాలు
ఇతర వ్యాక్సిన్లతోకూడా ఇదే తీరులో మరణాలు సంభవిస్తాయి. ప్రతీ మిలియన్ వ్యాక్సిన్ డోసుల్లో ఒక మరణం సంభవిస్తుంది. కరోనా వ్యాక్సిన్ అనంతరం జరుగుతున్న మరణాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. అయితే మరే ఇతర వ్యాక్సిన్ కూడా కరోనా టీకా అంత పెద్ద ఎత్తున అన్ని వర్గాలకు వేసినట్లు లేదు. అయినా కూడా సాధారణ స్థాయిలోనే మరణాలు ఉన్నాయి. కరోనా టీకాతోనే కాకుండా ఇతరత్రా అనారోగ్య సమస్యలున్నవారు మృతిచెందితే వారిని కూడా టీకా అనంతర మరణాల జాబితాలో చేర్చే అవకాశముంది. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
–ప్రొఫెసర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ
Comments
Please login to add a commentAdd a comment