గొంతు తడిపిన జలధార
♦ దుబ్బాకలో సాక్షి జల రథాన్ని ప్రారంభించిన సోలిపేట
♦ ఒక్క రోజే 10 వేల లీటర్ల నీటి సరఫరా
‘తాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నం.. సాక్షి జల రథాలు తరలిరావడంతో ప్రాణాలు లేసొచ్చాయి.. మా గొంతులు తడిశాయి..’ అంటూ దుబ్బాక వాసులు ఆనందం వ్యక్తం చేశారు. గురువారం దుబ్బాక నగర పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో జల రథాన్ని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నీటి పొదుపుపై స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. ఒక్క రోజే సుమారు 10 వేల లీటర్ల నీటిని సరఫరా చేశారు. గర్జిస్తున్న కరువులో.. దుబ్బ తేలిన నేలలో దూప తీర్చిన సాక్షికి జేజేలు అంటూ స్థానికులు కొనియాడారు.
దుబ్బాక/దుబ్బాక రూరల్: జలం లేక తల్లడిల్లుతున్న జనానికి ‘సాక్షి’ నీటిపథకం సాయం చేసింది. రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి బాసటగా నిలవడంతో.. పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీకి గురువారం వాటర్ ట్యాంకర్ వచ్చింది. కాలనీలో దాదాపు 500 కుటుం బాలు ఉన్నాయి. త్రీఫేజ్ కరెంట్ వస్తేనే నీళ్లు వచ్చే పరిస్థితి ఏర్పడింది. దళితులు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చేందుకు ‘సాక్షి’ ముందడుగు వేసింది. ఈక్రమంలో గురువారం నీటి ట్యాంకర్ ద్వారా ప్రజల దాహార్తిని తీర్చింది. ‘సాక్షి పత్రిక పంపిస్తున్న తాగునీటిని వృథా చేయకుండా వాడుకుంటామని, భూ గర్భజలాలను భవిష్యత్ తరాలకు అందించడానికి పాటు పడుతామని’ కాలనీ వాసులతో ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేయిం చారు.
అనంతరం ఆయన మట్లాడుతూ.. ప్రజల అవసరాల దృష్ట్యా సాక్షి పంపిస్తున్న రెండు ట్యాంకర్లతో పాటు అదనంగా మరో ట్యాంకర్‌ను పంపిస్తామన్నారు. ఈనెలాఖరులోగా మిషన్ భగీరథ నీళ్లు వస్తాయని, అప్పటి వరకు ‘సాక్షి’ నీళ్లను పొదుపుగా వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు పర్స యాదగిరి, టీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి గుండవెళ్లి ఎల్లారెడ్డి, నాయకులు బండి రాజు, కోమటిరెడ్డి సంజీవరెడ్డి, పర్స కృష్ణ, ఇస్తారిగల్ల స్వామి, గజం కల్యాణ్ తదితరులున్నారు.