water scheme
-
వర్మా.. ఇది ధర్మమా..!
తాగునీటి సదుపాయం కోసమంటూ మంచినీళ్ల ప్రాయంలా కోట్ల రూపాయలను వ్యయం చేస్తున్నట్టుగా హడావుడి చేస్తున్న అధికార పార్టీ నేతలు ఆ నీడలో కమీషన్లు దండుకుంటున్నారన్న విమర్శలున్నాయి. వైఎస్ హయాంలో నిధులు మంజూరై పనులు జరిగినా తమ ఖాతాలో వేసుకుంటూ ప్రారంభోత్సవాలకు సమాయత్తమవడాన్ని చూసి జనమే నవ్వుకుంటున్నారు. ఇంకోవైపు రక్షిత మంచినీటి పథకాల శుభ్రతంటూ నిధులు పక్కదారి మళ్లిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖామంత్రి నారా లోకేష్ శుక్రవారం జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా నీటి పథకాల డొల్లతనాలపై ప్రత్యేక కథనాలు. తూర్పుగోదావరి, పిఠాపురం: 2009 మార్చి 2న అప్పటి కేంద్రమంత్రి ఎంఎం పళ్లంరాజు పిఠాపురంలో మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు. ముఖ్య అతిథిగా అప్పటి తాజా మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు హాజరు కాగా అప్పటి మున్సిపల్ చైర్పర్సన్ దేవరపల్లి రాజరాజేశ్వరి అధ్యక్షత వహించారు. ఆ నుంచి ప్రారంభమైన మంచినీటి పథకం పనులు తరువాత ఎమ్మెల్యేగా వంగా గీతా విశ్వనాథ్ హయాంలో అంటే 2014కి 80 శాతం పూర్తయ్యాయి. అప్పటి ప్రతిపక్ష నేత 2014లో ఎమ్మెల్యేగాఎన్నికైన ప్రస్తుత ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ నిధులున్నా ఎందుకు పూర్తి చేయడం లేదంటూ అప్పటి ఎమ్మెల్యేపై విరుచుకు పడిన సంఘటనలున్నాయి. అలాగే తనను గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే పథకం పనులు పూర్తి చేయించి ప్రారంభిస్తానని హామీలు కూడా ఇచ్చారు కానీ ఈ నాలుగున్నరేళ్లు ఆ పథకం పనులు కొనసాగుతూనే ఉన్నాయి. అంటే గత ఎమ్మెల్యే వంగా గీత హయాంలో ఐదేళ్లు, ఇప్పుడు నాలుగున్నరేళ్లు పనులు జరిగాయి. ఎట్టకేలకు ఇప్పుడు పూర్తయ్యాయి. 2009 నుంచి ఇప్పటి వరకు పదేళ్లుగా పనులు సాగడం, అదనపు నిర్మాణాలు చేపట్టడం వల్ల నిర్మాణ వ్యయం పెరిగి రూ.21.90 కోట్లు నుంచి రూ.35 కోట్ల వరకూ ఖర్చయింది. ఇంత వరకూ బాగానే ఉంది కానీ ఎమ్మెల్యే వర్మ మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.35 కోట్లు మంజూరు చేసినట్లు, తమ ప్రభుత్వమే ఈ పథకం నిర్మించినట్లు చెప్పుకోవడం పట్ల నియోజకవర్గ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అసలు 2009లో పనులు ప్రారంభమైతే 2014లో 80 శాతం పూర్తయితే ఇప్పటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు రూ.35 కోట్లు మంజూరు చేయడమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గతమంతా అవినీతా...? గత ప్రభుత్వం హయాంలో అవినీతి చోటుచేసుకుంటే అధికారంలోకి వచ్చిన తమరు ఆ అవినీతిని ఎందుకు బయటపెట్టలేదని, అలాగే 20 శాతం మాత్రమే మిగిలి ఉన్న పనులను గత నాలుగున్నరేళ్లుగా ఎందుకు పూర్తి చేయలేక పోయారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పిఠాపురంలో పెరిగిన జనాభాకు అనుగుణంగా మంచినీటి వనరులు కల్పించడం కష్టంగా మారిన నేపథ్యంలో అప్పటి ఎమ్మెల్యే పెండెం దొరబాబు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఈ పథకానికి నిధులు మంజూరు చేశారు. పిఠాపురం పట్టణ దాహార్తిని తీర్చడానికి గత 11 ఏళ్ల క్రితం రూ.20 కోట్లు వెచ్చించి చిత్రాడ చెరువులో నిర్మించిన మంచినీటి పథకం ప్రారంభానికి ముందే కూలిపోతోంది. రూ.21.90 కోట్ల వ్యయంతో ప్రారంభించిన ఈ మంచి నీటి పథకం గత పదేళ్లుగా కొనసాగుతుండగా ఈ ఏడాది పనులు పూర్తి చేసి ప్రారంభించడానికి సిద్ధం చేశారు. ఎమ్మెల్యే వర్మ హయాంలో జరిగిన పనుల్లో ఇంతలోనే నాణ్యతా లోపాలు బయటపడుతున్నాయి. లక్షల గ్యాలన్ల నీటిని నిల్వ చేసే స్టోరేజ్ ట్యాంక్ ప్రారంభానికి ముందే అండలు జారి కూలిపోతుండగా నిండా నీరుపెడితే పరిస్థితి ఏమిటని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు ప్రారంభించాలన్న హడావిడి తప్ప పక్కా పర్యవేక్షణ కొరవడడంతో నాణ్యాతాలోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అవినీతి వల్ల పనులు జరగలేదన్న ఎమ్మెల్యే వర్మ ఇప్పుడు నాణ్యతా లోపాలపై పెదవి విప్పకపోవడం వెనుక రహస్యం ఏమిటో ఆయనకే తెలియాలని స్థానికులు మండిపడుతున్నారు. ఈ పథకాన్ని రాష్ట్రమంత్రి నారా లోకేష్‌తో శుక్రవారం ప్రారంభించడానికి ఎమ్మెల్యే వర్మ సన్నాహాలు చేస్తున్నారు. -
కనీస వేతనం అందని ద్రాక్షే!
- సమస్యల్లో సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు - 20 ఏళ్లుగా పనిచేస్తున్నా ఎదుగూ బొదుగు లేని వైనం ధర్మవరం : ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది..సత్యసాయి తాగునీటి పథకంలో పనిచేసే కార్మికుల వ్యథ. 20 ఏళ్లుగా పనిచేస్తున్నా ఎదుగూబొదుగు లేని వేతనాలతో బతుకులీడుస్తున్నారు. ప్రభుత్వ కనీస వేతన జీఓలు (జీఓ ఎంఎస్ 11/2011, జీఓఎంఎస్151/2016)ల ప్రకారం వృత్తితో సంబంధం లేకుండా బతకడానికి కనీస వేతనం ఇవాల్సి ఉంది. అయితే ఈ జీఓలు వారికి వర్తించడం లేదు. తాగునీటి సమస్యను పరిష్కరించాలన్న ఉద్ధేశంతో సత్యసాయిబాబా ప్రారంభించిన సత్యసాయి తాగునీటి పథకం జిల్లాలోని దాదాపు 860 గ్రామాలకు తాగునీరు అందిస్తోంది. ప్రభుత్వ తాగునీటి పథకాలు పడకేసినా నిత్యం జిల్లా వ్యాప్తంగా దాదాపు 15 లక్షల మందికి తాగునీటిని అందిస్తోంది. ఈ పథకంలో మొత్తం 600 మంది దాకా కార్మికులు పని చేస్తున్నారు. సత్యసాయి తాగునీటి పథకాన్ని సత్యసాయి ట్రస్ట్ నుంచి 1995లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అదే ఏడాది పథకం నిర్వహణ బాధ్యతలను ఎల్అండ్టీ కంపెనీకి అప్పజెప్పింది. నిర్వహణకు గానూ ప్రతి నెలా ప్రభుత్వం రూ.1.60 కోట్లు ఇస్తోంది. 400 మంది దాకా కార్మికులు ఈ పథకం ప్రారంభం నుంచి పనిచేస్తున్నారు. వీరు తొలినాళ్లలో రూ.900కే పనికి కుదిరి, నేటికీ రూ.9,300కే పని చేస్తున్నారు. ఇన్నేళ్లుగా పనిచేస్తున్నా వారికి మాత్రం కనీస వేతనం దక్కడం లేదు. తమకు కనీస వేతనం అమలు చేయాలని కార్మికులు ఎన్నిసార్లు అందోళనలు చేసినా ఫలితం శూన్యం. యాజమాన్యం పట్టించుకోవడం లేదని, కనీసం గుర్తింపుకార్డులు కూడా ఇవ్వకపోవడంతో కార్మికులు కార్మిక సంక్షేమశాఖకు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును స్వీకరించిన ఆశాఖ విషయాన్ని మరుగునపడేసింది. తాగునీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులు కనీసం కాంట్రాక్ట్ కార్మికులా, ఔట్సోర్సింగ్ కార్మికులా అని కూడా «ధ్రువీకరించిన పాపాన పోలేదని వాపోతున్నారు. రూ.900తో పనికెక్కా.. పథకం ప్రారంభంలో రూ.900తో పనికి కుదిరా. 20 ఏళ్లుగా పనిచేస్తుంటే ఇప్పుడు కేవలం రూ.9వేలు మాత్రమే వేతనం ఇస్తున్నారు. సర్వీస్ లేదు, ఇంక్రిమెంట్లు లేవు, పనికి తగిన వేతనం లేదు..కనీసం గుర్తింపు కార్డు కూడా లేదు. ఇదేమని అడిగితే యాజమాన్యం పెద్దలతో చర్చించి పెంచుతామంటున్నారు. –భగవాన్, పంప్ ఆపరేటర్, సత్యసాయి తాగునీటి పథకం కనీస వేతనం అమలు చేయాలి జీఓ 151 ప్రకారం కనీసం వేతనం రూ.12వేలు చొప్పున కార్మికులకు వేతనం అందజేయాలి. ఇప్పటికే చాలా సార్లు ఆందోళనలు చేపట్టినా యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందనా లేదు. దీంతో ఒక్కో కార్మికుడు ఏడాదికి రూ.1.50 లక్షలు నష్టపోతున్నారని, కార్మికశాఖకు ఫిర్యాదు చేశాం. వారు ఫిర్యాదును కనీసం విచారించిన పరిస్థితి కూదా లేదు. అలాగే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా మాకు మాత్రం న్యాయం జరగలేదు. ఉపేంద్ర, సత్యసాయి వాటర్ సప్లై కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షులు -
శివార్లకు కొత్త నీటి పథకం
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) లోపల చుట్టూ ఉన్న 190 గ్రామాలకు తాగునీటి సరఫరా కోసం రూ.628 కోట్లతో కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. జీహెచ్ఎంసీకి శివార్లలో ఉన్న ఈ గ్రామాలకు సరైన నీటి సరఫరా లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ గ్రామాలకు నీటి సరఫరా బాధ్యతలను గ్రామీణ నీటి సరఫరా విభాగం(ఆర్డబ్ల్యూఎస్) నుంచి జల మండలికి బదలాయించాలని, ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్య(పీపీపీ) పద్ధతిలో ఇంటింటికి నీటిసరఫరా కోసం రూ.628 కోట్ల అంచనా వ్యయంతో కొత్త తాగునీటి ప్రాజెక్టును నిర్మించాలని చాలా కాలంగా ప్రతిపాదనలు ఉన్నాయి. వీటిని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడంతో.. ఈ ప్రాజెక్టు పనులకు పాలనాపర అనుమతులు ఇస్తూ ఒకట్రెండు రోజుల్లో రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేయనుందని తెలిసింది. మిషన్ భగీరథ పథకంలో అంతర్భాగంగానే ఈ కొత్త తాగునీటి సరఫరా ప్రాజెక్టును నిర్మించనున్నారు. -
గొంతు తడిపిన జలధార
♦ దుబ్బాకలో సాక్షి జల రథాన్ని ప్రారంభించిన సోలిపేట ♦ ఒక్క రోజే 10 వేల లీటర్ల నీటి సరఫరా ‘తాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నం.. సాక్షి జల రథాలు తరలిరావడంతో ప్రాణాలు లేసొచ్చాయి.. మా గొంతులు తడిశాయి..’ అంటూ దుబ్బాక వాసులు ఆనందం వ్యక్తం చేశారు. గురువారం దుబ్బాక నగర పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో జల రథాన్ని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నీటి పొదుపుపై స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. ఒక్క రోజే సుమారు 10 వేల లీటర్ల నీటిని సరఫరా చేశారు. గర్జిస్తున్న కరువులో.. దుబ్బ తేలిన నేలలో దూప తీర్చిన సాక్షికి జేజేలు అంటూ స్థానికులు కొనియాడారు. దుబ్బాక/దుబ్బాక రూరల్: జలం లేక తల్లడిల్లుతున్న జనానికి ‘సాక్షి’ నీటిపథకం సాయం చేసింది. రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి బాసటగా నిలవడంతో.. పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీకి గురువారం వాటర్ ట్యాంకర్ వచ్చింది. కాలనీలో దాదాపు 500 కుటుం బాలు ఉన్నాయి. త్రీఫేజ్ కరెంట్ వస్తేనే నీళ్లు వచ్చే పరిస్థితి ఏర్పడింది. దళితులు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చేందుకు ‘సాక్షి’ ముందడుగు వేసింది. ఈక్రమంలో గురువారం నీటి ట్యాంకర్ ద్వారా ప్రజల దాహార్తిని తీర్చింది. ‘సాక్షి పత్రిక పంపిస్తున్న తాగునీటిని వృథా చేయకుండా వాడుకుంటామని, భూ గర్భజలాలను భవిష్యత్ తరాలకు అందించడానికి పాటు పడుతామని’ కాలనీ వాసులతో ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేయిం చారు. అనంతరం ఆయన మట్లాడుతూ.. ప్రజల అవసరాల దృష్ట్యా సాక్షి పంపిస్తున్న రెండు ట్యాంకర్లతో పాటు అదనంగా మరో ట్యాంకర్‌ను పంపిస్తామన్నారు. ఈనెలాఖరులోగా మిషన్ భగీరథ నీళ్లు వస్తాయని, అప్పటి వరకు ‘సాక్షి’ నీళ్లను పొదుపుగా వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు పర్స యాదగిరి, టీఆర్ఎస్ అధికార ప్రతినిధి గుండవెళ్లి ఎల్లారెడ్డి, నాయకులు బండి రాజు, కోమటిరెడ్డి సంజీవరెడ్డి, పర్స కృష్ణ, ఇస్తారిగల్ల స్వామి, గజం కల్యాణ్ తదితరులున్నారు. -
రామన్‌పాడులో సమ్మె సైరన్
- నేటినుంచి పెండింగ్ జీతాల కోసం ఆందోళనలకు సిద్ధమవుతున్న కార్మికులు - శుక్రవారం అర్ధరాత్రి నుంచి మోటార్లు బంద్ - 130 గ్రామాలకు నిలిచిపోనున్న నీటి సరఫరా గోపాల్పేట : అచ్చంపేట రక్షిత మంచినీటి పథకంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు సమ్మె సైరన్ మోగిస్తున్నారు. పెండింగ్ జీతాల కోసం శుక్రవారం అర్ధరాత్రి నుంచి పంప్‌హౌసుల్లో మోటార్లు బంద్ చేసి సరఫరాను నిలిపివేయనున్నారు. దీంతో రామన్‌పాడు హెడ్‌వర్క్ నుంచి పూర్తి స్థాయిల్లో సరఫరా స్తంభించిపోయి వనపర్తి, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల్లోని సుమారు 130 గ్రామాల ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఇటీవల పలుచోట్ల లీకేజీలు, పగిలిన చోట మరమతు పనులు పూర్తి చేసి గురువారం నుంచి సరఫరాను పునరుద్ధరించారు. తిరిగి శుక్రవారం అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. దీంతో 130 గ్రామాల ప్రజలకు తాగునీటి సమస్య తీవ్రతరమైంది. 4 నెలల పెండింగ్ జీతాలు, పీఎఫ్ అమలు చేయాలని, లేకుంటే అగస్టు 1 నుంచి సమ్మె చేస్తామని ముందస్తుగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు రామన్‌పాడు కార్మికులు నోటీసులు ఇచ్చారు. అయినా స్పందించకపోవడంతో సమ్మె చేస్తున్నట్లు కార్మికులు తెలిపారు. రామన్‌పాడు మంచినీటి పథకంలో పనిచేస్తున్న సుమారు 80 మంది కార్మికులకు ఏప్రిల్ నుంచి జూలై వరకు జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. పీఎఫ్ అమలు కావడంలేదు. గతంలో కార్మికుల జీతాలు, తదితర డిమాండ్ల పరిష్కారం కోసం మోటార్లు బంద్ చేసి పంప్‌హౌస్‌లకు తాళాలు వేసి ఆందోళనలకు దిగారు. ప్రతిసారి కార్మికులు ఆందోళనలు చేయడం ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సంబంధిత కాంట్రాక్టర్‌తో మాట్లాడడం.. ఆ తర్వాత గడువు ఇచ్చి జీతాలు చెల్లించడం జరుగుతుంది. ఇలా రోజుల తరబడి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాసిరకం పైపులతో తరుచూ సరఫరాను నిలిపివేస్తుండడంతో దీనిపైనే ఆదారపడిన ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. నిధులు మంజూరు కాలేదు జీతాల కోసం కార్మికులు సమ్మె చేస్తున్నారని తెలుసు. కానీ, రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి పథకాల మెయింటెనెన్స్‌కు నిధులు విడుదల కాలేదు. కాబట్టి ఏప్రిల్ నుంచి కార్మికులకు జీతాలు ఇవ్వలేదు. కనీసం కాంట్రాక్టర్‌ను ఒప్పించి సరఫరా ఆగకుండా చూడాలి. -రాములుగౌడు, ఆర్డబ్ల్యూఎస్ డీఈ -
నీటి ఖర్చు తడిసి మోపెడు
కర్నూలు సిటీ: వర్షాకాలంలోనూ ఎండలు పెరిగిపోతున్నాయి. వడగాలులతో ప్ర‘జల’ దాహార్తి తీరడం లేదు. గ్రామాల్లో నీటి ఎద్దడి పరిష్కారం కాకపోవడంతో ట్యాంకర్లతో అధికారులు నీటిని సరఫరా చేస్తున్నారు. ఫలితంతా తాగునీటి కోసం వెచ్చిస్తున్న ఖర్చు తడిసి మోపెడవుతోంది. జిల్లాలో 893 గ్రామ పంచాయతీలు, 1498 గ్రామాలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంతంలో 29,04,177 మంది ఉన్నారు. వీరికి తాగు నీటిని అందించేందుకు 2504 ప్రజా నీటి పథకాలు(పి.డబ్ల్యూ.ఎస్ స్కీమ్స్), 56 సీ.పి.డబ్ల్య స్కీమ్స్, 15,051 చేతి పంపులు ఉన్నాయి. ప్రతి ఏటా వేసవి కాలంలో ప్రజలకు తాగు నీటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు అవసరమైన బడ్జెట్ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తారు. ఈ ప్రతిపాదనలకు అనుగుణంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. ఈ ఏడాది వేసవిలో కాలంలో తాగు నీటి ఎద్దడి ఏర్పడకుండా తాత్కాలికంగా నివారించడం కోసం గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్యం శాఖ అధికారులు రూ. 5,70,00,000 రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం మాత్రం 3,55,000 మంజూరు చేసింది. ఇప్పటి వరకు సుమారు రూ. 3 కోట్ల దాకా ఖర్చు చేశారు. వరుణుడు కరుణించక పోవడంతో తాగు నీటి కోసం ఇంకా కొంత నిధులు ఖర్చు అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తాగు నీటి ఎద్దడి తీవ్రంగా ఉండే ఎనిమిది గ్రామాలలో మాత్రమే తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో తుగ్గలి మండలం జొన్నగిరి, కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లె, ఉయ్యాలవాడ మండలం పుచ్చకాయలపల్లి, పాణ్యం మండలం సుగాలిమెట్ట, ప్యాపిలి మండలం అలేబాద్తాండా, రాచర్ల, నేరేడుచెర్ల, జలదుర్గం గ్రామాలు ఉన్నాయి. మరో మూడు గ్రామాలకు మాత్రం ఆయా గ్రామాలకు సమీపంలో ఉండే రైతుల బోర్లను అద్దెకు తీసుకోని తాగు నీటిని సరఫరా చేస్తున్నామంటున్నారు. ఇందులో కొత్తపల్లి మండలం బట్టువారిపల్లి, డోన్ మండలం తాడూరు, కొత్త బురుజు గ్రామాలు ఉన్నాయి. గతేడాది వేసవిలో రూ. 2.5 కోట్లకు చేసిన ప్రతిపాదనలు చేస్తే రూ. 1.05 కోట్లు మంజూరు చేసింది. గతేడాది రూ. 2 కోట్లదాక ఖర్చు అయినట్లు తెలిసింది. ఈఏడాది వర్షా కాలం మొదలై నెల రోజులు కావస్తున్నా...నేటికీ ఆశించిన మేరకు వర్షాలు కురవక పోవడంతో తాగు నీటి ఖర్చులు మరింత పెరిగాయి. వీటికి అదనంగా సీ.పి.డబ్ల్యూ స్కీమ్‌ల నిర్వహణ ఖర్చులు, చేతి పంపుల నిర్వహణ, మరమ్మతులు, నీటి పథకాల మరమ్మతుల ఖర్చులు అదనంగా అవుతాయి. -
పల్లెపల్లెకూ తాగునీరు.. ఇంటింటికీ నల్లా: కేటీఆర్
గంభీరావుపేట: తెలంగాణ రాష్ట్రంలోని పల్లె పల్లెకూ తాగునీరు, ఇంటింటికీ నల్లా నీరిస్తామని, ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని చెప్పిన దమ్మున్న సీఎం కేసీఆర్ అని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లా గంభీరావుపేటలోని వెంకటాద్రి చెరువులో గురువారం మిషన్ కాకతీయ పనులను ప్రారంభించిన అనంతరం, అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై ఆయన మాట్లాడారు. ఓట్ల కోసమో, ఎన్నికల సమయంలోనో సీఎం ఈ మాట చెప్పలేదని, అధికారంలోకి వచ్చాక చెప్పిన మాటలేనని అన్నారు. 5 నుంచి కేటీఆర్ అమెరికా పర్యటన మంత్రి కేటీఆర్ ఈ నెల 5 నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. ప్రవాస భారతీయుల నుంచి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా రెండు వారాల పాటు ఈ పర్యటన సాగనుంది. ఆయన పర్యటనలో అమెరికాలో భారత రాయబారి అరుణ్ కె.సింగ్‌తో ప్రత్యేక విందులో పాల్గొననున్నారు. మంత్రితో పాటు ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ కూడా వెళ్లనున్నారు. -
పాలమూరుకు ‘నీళ్ల’లా అంచనాలు
సాక్షి, హైదరాబాద్: పాలమూరు పట్టణం తాగునీటి సరఫరా పథకం వ్యయ అంచనాలు ఆకాశాన్నంటాయి. అయితే అనుమానంవచ్చి వెనక్కి పంపితే ఒక్కసారిగా భూమికి దిగివచ్చాయి. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఈ పథకం అంచనా వ్యయం రూ.350 కోట్ల నుంచి రూ.121 కోట్లకు తగ్గిపోయింది. వివరాలు ఇలా ఉన్నాయి.. సీఎం కేసీఆర్ మహబూబ్‌నగర్ పట్టణంలో పర్యటించిన సందర్భంగా స్థానికంగా నెలకొన్న నీటి ఎద్దడిపై ప్రజల నుంచి అధిక ఫిర్యాదులు వచ్చాయి. కొన్ని చోట్లలో కేవలం 15 రోజులకోసారి నీటి సరఫరా జరుగుతోందని స్థానికులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై పట్టణానికి నీటి సరఫరా చేస్తున్న పథకం సామర్థ్యం సరిగా లేదని అధికారులు సీఎంకు వివరణ ఇచ్చుకున్నారు. దాంతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం జలాలను మహబూబ్‌నగర్‌కు తరలించి కొత్త పథకం నిర్మించాలని సీఎం అక్కడికక్కడే నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల్లో ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని ప్రజారోగ్య, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు ఆగమేఘాల మీద మహబూబ్‌నగర్ పట్టణాన్ని సందర్శించి .. పట్టణాభివృధ్దిపై సర్వే జరిపారు. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీతో పాటు అందులో విలీనమైన 10 గ్రామ పంచాయతీలకు నీటి సరఫరాకు రూ.350 కోట్లతో కొత్త తాగునీటి పథకం, బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ.88 కోట్లు, ఇతర అభివృద్ధి పనుల ప్రతిపాదనలు కలిపి మొత్తం రూ.500 కోట్ల అంచనాలతో నివేదిక రూపొందించారు. జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి ఈ ప్రతిపాదనలను సీఎం కేసీఆర్‌కు అందజేశారు. ఈ ‘భారీ’ ప్రతిపాదనలను పరిశీలించిన సీఎం కేసీఆర్ ఆగ్రహంతో కాగితాలను నేలపై విసిరికొట్టినట్లు సమాచారం. ఒక్క పట్టణానికే రూ.500 కోట్లా? అని అక్కడే ఉన్న ప్రజారోగ్య, మున్సిపల్ ఇంజనీరింగ్ ముఖ్య ఇంజనీర్‌పై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రతిపాదనలను ప్రభుత్వం తిరస్కరించడంతో కంగుతిన్నఅధికారులు.. పాలమూరు తాగునీటి పథకానికి మళ్లీ రూ.121 కోట్ల అంచనా వ్యయంతో మరో నివేదికను సిద్ధం చేసి, శనివారం సీఎం కార్యాలయంలో సమర్పించారు. మూడు రోజుల్లోనే పథకం అంచనాలు తగ్గిపోవడం గమనార్హం. అసలేం జరిగింది..? శ్రీశైలం జలాశయం నుంచి నీటిని ఎల్లూరు జలాశయానికి తరలించి అక్కడి నుంచి మహబూబ్‌నగర్ పట్టణానికి సరఫరా చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఎల్లూరు జలాశయం నుంచి పట్టణానికి నీటిని తరలించి, శుద్ధి చేసి పంపిణీ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే, ప్రతిపాదనల దశలో ఓ నేత జోక్యం చేసుకున్నట్టు తెలిసింది. అవసరం లేకపోయినా కొత్త రిజర్వాయర్ల నిర్మాణం, ప్రస్తుత సరఫరా పైప్లైన్ల మార్పు, సరఫరా మెయిన్స్ మార్పు, మీటర్లతో నల్లా కనెక్షన్లు తదితర పనులతో పథకం అంచనా వ్యయాన్ని రూ.360 కోట్లకు పెంచేశారు. ఆ నేత జోక్యంవల్లనే అంచనాలు పెరిగాయని చర్చజరుగుతోంది. -
వాటర్ గ్రిడ్‌కు సిద్దిపేటే ‘దిక్సూచి’
తరలివస్తొన్న మంత్రులు, రాష్ట్రస్థాయి అధికారులు సిద్దిపేట జోన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్‌కు ఒకప్పటి సిద్దిపేట మంచినీటి పథకం దిక్సూచిగా నిలుస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కె. చంద్రశేఖర్‌రావు తన కేబినెట్లోని సింహభాగం మంత్రులు, అధికార యంత్రాంగాన్ని తీసుకుని బుధవారం సిద్దిపేటకు రానున్నారు. పట్టణ శివారులోని మంచినీటి పథకం తీరు తెన్నులను రాష్ట్ర పాలక, అధికార యంత్రాంగానికి క్షేత్రస్థాయిలో వివరించి భవిష్యత్తులో వాటర్ గ్రిడ్ సఫలీకృతానికి శ్రీకారం చుట్టారు. తాగునీటి సమస్య తీర్చిన ఆ ఇద్దరు సుమారు రూ. 25 వేల కోట్లతో తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి గడపకు తాగునీరును అందించి ఫ్లోరైడ్ భూతాన్ని నిర్మూలించే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. అలాంటి ప్రాజెక్ట్ రూపకల్పనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మరో వ్యక్తికి కూడా అపారమైన అనుభవం ఉంది. అతడే ఒకప్పటి సిద్దిపేట మంచినీటి పథకం నిర్వహణలో కీలక పాత్ర పోషించి నేడు రాష్ట్ర ప్రభుత్వ వాటర్‌గ్రిడ్ చీఫ్ టెక్నికల్ కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న సత్యపాల్‌రెడ్డి. సరిగ్గా 14 సంవత్సరాల క్రితం సిద్దిపేట నియోజకవర్గ ప్రజల దాహార్తి తీర్చడానికి అపర భగీరథ ప్రయత్నం చేసిన ఆ ఇద్దరు మళ్లీ సిద్దిపేట గడ్డపై బుధవారం గత సృ్మతులను గుర్తు తెచ్చుకోనున్నారు. తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొన్న క్రమంలో సుమారు 185 గ్రామాలకు దప్పిక తీర్చి ప్రాజెక్ట్ రూపకల్పనలో నిర్వీరామంగా కృషి చేసిన సత్యపాల్‌రెడ్డి పేరు నియోజకవర్గ ప్రజలకు సుపరిచితమే. సిద్దిపేట ప్రాజెక్ట్ నిర్వహణలో చోటుచేసుకున్న అపార అనుభవంతో జిల్లాలోని సింగూర్ నీటి పథకంతో పాటు, గుంటూరు, కృష్ణా జిల్లాలో తాగునీటి పథక నిర్వహణలో ఆయన భాగస్వాములయ్యారు. ఈ ఏడాది జూన్‌లో పదవీ విరమణ పొందినప్పటి కీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాటర్ గ్రిడ్ రూపకల్పనలో సాంకేతిక సలహాలతో పాటు పర్యవేక్షణకు సత్యపాల్ సేవలను వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే కన్సల్టెంట్ హోదాలో సత్యపాల్‌రెడ్డి మంగళవారం సిద్దిపేటలోని ఫిల్టర్‌బెడ్‌ను, కరీంనగర్ జిల్లా లోయర్ మానేర్ డ్యాం ను, మార్గమధ్యలో ఇన్‌టెక్ వెల్లను మాక్ ట్రయల్‌గా పరిశీలించి పథకం పని తీరును తెలుసుకున్నారు. సిద్దిపేట తాగునీటి పథక స్వరూపమిది పాతికేళ్ల క్రితం సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని సిద్దిపేట, చిన్నకోడూరు, నం గునూరు మండలాలతో పాటు పట్టణం లో తీవ్ర తాగునీటి సమస్య ఏర్పడింది. ఈ క్రమంలోనే 1999లో అప్పటి ఎమ్మె ల్యే, ప్రస్తుత సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో కరీంనగర్ జిల్లాలోని లోయర్ మా నేరు డ్యాం నుంచి సిద్దిపేట నియోజకవర్గానికి తాగునీరు అందించేందుకు శాశ్వ త మంచినీటి పథక రూపకల్పన చేశారు. ఈ నిర్వహణ బాధ్యతను గ్రా మీణ మంచినీటి సరఫర శాఖ విభాగానికి అప్పగించారు. అప్పట్లో స్థానిక ఆర్డబ్ల్యూఎస్ డిప్యూటీ ఈఈగా పని చేస్తున్న సత్యపాల్‌రెడ్డితో శాశ్వత మంచినీటి పథ కం గూర్చి ఎమ్మెల్యే హోదాలో కేసీఆర్ పలుమార్లు సమీక్షించారు. సుమారు రూ.60 కోట్ల వ్యయంతో కరీంనగర్ జిల్లా నుంచి 60 కిలోమీటర్ల దూరం నుంచి 407 కిలోమీటర్ల పైప్ లైన్ పొడుగుతో మార్గమధ్యన మూడు ఇన్‌టెక్ వెల్ నిర్మాణాల ద్వారా భూగర్భం నుంచి తాగునీటిని లిఫ్టింగ్ చేసే ప్రక్రియను చేపట్టారు. రెండేళ్ల సుదీర్ఘ కృషి అనంతరం 2001లో సిద్దిపేట నియోజకవర్గంలోని సుమారు 185 గ్రామాల ప్రజలకు తాగునీటి అందించే ప్రక్రియ సఫలీకృతమైంది. సిద్దిపేట పథకం సత్ఫలితాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం దొమ్మాట, రామాయంపేట, గజ్వేల్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో సింగూరు నీటి పథకానికి శ్రీకారం చుట్టింది. ఆ పథక నిర్వహణలో కూడా సత్యపాల్‌రెడ్డి సిద్దిపేటలోని అపార అనుభవాన్ని సాంకేతిక పరిజ్ఞాన రూపంలో దోహదపడ్డారు. -
సోషల్ మీడియాలో ‘సాక్షి‘ కథనం హల్చల్
* సిద్దిపేట నీటి పథకంపై సర్వత్ర చర్చ * పరిశీలించిన మంత్రి హరీష్ సిద్దిపేట అర్బన్: సిద్దిపేటకే తలమాణికం శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఫేస్బుక్, ట్విట్టర్లో ప్రపంచ వ్యాప్తంగా తిరిగింది. 15 సంవత్సరాల క్రితం సిద్దిపేటలో నెలకొన్న తాగునీటి సమస్య, ఆ తర్వాత శాశ్వత మంచినీటి పథకాలతో కేసీఆర్, హరీష్‌రావుల కృషితో ప్రతిరోజూ మంచినీటి సరఫరా నేపథ్యాన్ని వివరిస్తూ రూపొం దించిన కథనం ఇక్కడ చర్చనీయాంశమైంది. గులాబీ శ్రేణులు ఈ సమగ్ర ‘సాక్షి’ కథనాన్ని విస్తృతంగా ప్రచారం చేశాయి. ఎంతోమంది ఫేస్బుక్లో ఈ కథనాన్ని షేర్ చేసుకున్నారు. విభిన్న ప్రాంతాల వారు ఈ వార్తపై ఆసక్తిని కనబరిచారు. మంత్రి హరీష్‌రావు ఈ వార్తను ఫేస్బుక్లో చూసి సోమవారం సిద్దిపేట పర్యటనలో భాగంగా సాక్షి దినపత్రికలో ప్రచురితమైన వార్తను మాజీ మున్సిపల్ మున్సిపల్ రాజనర్సు, శేషుకుమార్‌ల ద్వారా తెప్పించుకొని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను పత్రికలు విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల మిగతా వారికి స్ఫూర్తిగా నిలవడంతోపాటు ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. మున్ముందు కూడా ప్రభుత్వం ప్రజలకు కోసం ప్రవేశపెట్టే అభివృద్ధి కార్యక్రమాలను పత్రికలు ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. -
కలగానే పోతార్లంక
తెనాలిరూరల్: వేలాది ఎకరాలకు సాగు నీరందిస్తామంటూ ఆర్భాటంగా చేపట్టిన పోతార్లంక పథకానికి పురిట్లోనే సంధి కొట్టిన వైనం తెలిసిందే. పథకం నిర్మాణం పూర్తి చేసినా ట్రయల్ రన్‌లోనే పూర్తిగా విఫలమయివడంతో ఇక ఆ ఊసే ఎత్తలేదు నాటి పాలకులు. కొల్లూరు, భట్టిప్రోలు మండలాలకు చెందిన దాదాపు 13 గ్రామాల పరిధిలోని ఐదువేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ పథకానికి తొమ్మిదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూపుమార్చి ‘ఎత్తిపోతల’గా శంకుస్థాపన చేసినా అదీ శిలాఫలకానికే పరిమితమైంది. ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోకుండా లంక గ్రామాల రైతుల్ని, ప్రజలను చిన్నచూపు చూస్తున్న పాలకుల నిర్వాకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనైనా పథకం ఫలితాలనిస్తుందేమోనని లంక గ్రామాల ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. నీటి పథకానికి కొరటాల ప్రతిపాదన.. 1977 సంవత్సరంలో వచ్చిన ఉప్పెనతో కృష్ణానది పరీవాహక లంక గ్రామాల్లో తాగు, సాగునీటికి అవస్థలు మొదలయ్యాయి. 1978-83 మధ్య రేపల్లె ఎమ్మెల్యేగా వున్న సీపీఎం నేత కొరటాల సత్యనారాయణ నీటిపథకం అమలుకు ప్రతిపాదించారు. 1986 నుంచి రైతులు నీటి పథకం ఏర్పాటుపై అభ్యర్ధిస్తూ వచ్చారు. దీనిపై అధ్యయనం చేసిన అప్పటి ప్రభుత్వ ఇంజినీరింగ్ సలహాదారు శ్రీరామకృష్ణయ్య రేపల్లె బ్యాంక్ కెనాల్ నుంచి కొల్లూరు నీటిని తీసుకుని లంక గ్రామాలకు తరలించడమే పరిష్కారమని భావించారు. ఇందుకు కొల్లూరు లాకుల్నుంచి పోతార్లంక వరకు ప్రధాన కాలువ, అక్కడ నుంచి కుడి, ఎడమ కాలువలు తవ్వితే లంక గ్రామాల్లోని 5 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ప్రభుత్వానికి నివేదించారు. ఇందుకు రూ.1.06 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఎనిమిదేళ్లకు కదిలిన ఫైలు.. అప్పటి నుంచి దాదాపు ఎనిమిదేళ్ల అనంతరం 1994 తర్వాత ఫైలులో కదలిక వచ్చింది. పోతార్లంక సాగునీటి పారుదల పథకం నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి, 1995లో హెడ్ స్లూయిజ్ నిర్మాణం చేపట్టారు. 1997లో ఈ పథకాన్ని పూర్తిచేసే బాధ్యతను ‘ది కృష్ణ లంక నీటిపారుదల అభివృద్ధి సంఘం, జువ్వలపాలెం’ అధ్యక్షుడికి నామినేషను ప్రాతిపదికన ప్రభుత్వం అప్పగించింది. పథకం వ్యయం రూ.2.21 కోట్లుగా అంచనా వేశారు. రైతుల వాటా రూ.85 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో రూ.20 లక్షలు నగదుగా వసూలు చెల్లించారు. మిగిలిన డబ్బు రూ.65 లక్షలను జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో రైతుల పొలాల దస్తావేజులు తనఖా పెట్టించి రుణాల పేరిట తీసుకున్నారు. 1997 డిసెంబర్ 3వ తేదీన శంకుస్థాపన చేశారు. నాలుగు దశాబ్దాలుగా ఉప్పిరిసిన భూగర్భ జలాలతో పంట దిగుబడులు నష్టపోతున్న లంక గ్రామాల పరిధిలోని ఐదువేల ఎకరాల రైతులకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. 1998లో ఎడమ కాలువ, 1999లో కుడి కాలువ నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి. ట్రయల్ రన్ విఫలం... కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లోని పోతార్లంక, తోకలవారిపాలెం, తురకపాలెం, తిప్పలకట్ట, కిష్కిందపాలెం, శివడరాంపురం, జువ్వలపాలెం, తడికలపూడి, గంటూరు గూడెం, కొత్త గూడెం, చింతమోటు, పెసర్లంకతో పాటు కృష్ణా జిల్లా పరిధిలోకి వచ్చే ఆముదాలలంక గ్రామాల సాగునీటి అవసరాల కోసం ఉద్దేశించిన పోతార్లంక పథకం నిర్మాణం పూర్తి చేసుకున్నాక ట్రయల్ రన్‌లోనే ఘోరంగా విఫలమైంది. ఎలాగోలా పథకాన్ని పూర్తి చేయించారే గాని నిర్మాణంలో పర్యవేక్షణ లేకపోవడంతో కొల్లూరు లాకుల దగ్గర నీరు విడుదల చేసినా చివరి వరకు అందక నిరుపయోగంగా మారింది. ఎలైన్మెంటు మార్పు చేసిన ఫలితంగా నీరు కాల్వకు ఎక్కనేలేదు. మరమ్మతుల పేరుతో నిలిచిపోయిన ఈ పథకాన్ని ఆ తర్వాత కాలంలో పట్టించుకున్న నాథుడు లేడు. కాలువల్లో పూడిక పేరుకుని పథకం ఆనవాళ్లు కోల్పోయింది. రైతుల వాటా డబ్బు, ప్రభుత్వం ఆర్ఐడీఎల్-2 కింద నాబార్డు నుంచి విడుదల చేయించిన మొత్తం, కాలువలో కొట్టుకుపోయాయి. అంచనాలు మార్చినా శంకుస్థాపనతోనే సరి.. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేపల్లె ఎమ్మెల్యేగా ఉన్న దేవినేని మల్లికార్జునరావు దీనిపై దృష్టి సారించారు. ఎత్తిపోతల పథకంగా మార్పు చేశారు. ఇటుక, ఇసుక ధరలు పెరిగిపోతుండటంతో కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. చివరకు అంచనాలను సవరించి రూ.13.86 కోట్ల వ్యయంతో పథకం చేపట్టేందుకు నిర్ణయించారు. 2009 ఫిబ్రవరి 8వ తేదీ కిష్కింధపాలెం వద్ద శంకుస్థాపన చేశారు. తర్వాత రెండు నెలల్లోనే ఎన్నికలొచ్చాయి. దీంతో ఈ పథకం శిలాఫలకానికే పరిమితమైంది. ఆ తర్వాత అదే ఏడాది వచ్చిన వరదలతో కాల్వలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం డెల్టా ఆధునికీకరణ పనులు జరుగుతున్న తరుణంలో పోతార్లంక పథకాన్ని పూర్తి చేస్తే తమకు మేలు కలుగుతుందని లంక గ్రామాల ప్రజలు భావిస్తున్నారు. ఈసారైనా ప్రభుత్వం పథకం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
పల్లె క‘న్నీరు’
గుక్కెడు నీటి కోసం పల్లె కన్నీరుపెడుతోంది. భూగర్భజలాలు అడుగంటడంతో కిలోమీటర్ల కొద్దీ వెళ్లి పల్లె ప్రజలు నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఎడ్లబండ్లు, సైకిళ్లు, కాలినడకన నీటి కోసం పాట్లు పడుతున్నారు. మైదానం, అటవీప్రాంతం అనే తేడాలేకుండా జిల్లావ్యాప్తంగా పలుచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. నీళ్లు లేనిచోట లేకపోగా..ఉన్నచోట నిర్లక్ష్యం వెంటాడుతోంది. చేతిపంపులు, ట్యాంకులు, పైపులైన్లకు మరమ్మతులు చేయించడంలో ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. పంపు ఆపరేటర్ల అలసత్వం..విద్యుత్ సక్రమంగా లేకపోవడంతో మైదాన ప్రజల నోళ్లు ఎండుతున్నాయి. పక్కనే గోదావరి ఉన్నా చెలమల నీళ్లే అడవి బిడ్డలకు దిక్కయ్యాయి. వెరసి పల్లె క‘న్నీటి’ గోడు ఎవరికీ పట్టడంలేదనేందుకు ఈ కథనాలే నిదర్శనం... వేలేరుపాడు, న్యూస్‌లైన్: దాహం దాహం అంటూ గుక్కెడు నీటికోసం పల్లె ప్రజలు అల్లాడుతున్నారు. మండు వేసవిలో గొంతు తడుపుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు. మండలంలోని ఎర్రతోగు, రామవరం ఊటగుంపు, ఉదయ్‌నగర్, పాతరెడ్డిగూడెం, ఒంటిబండ, బోళ్లపల్లి, మేడేపల్లి, బుర్రెడ్డిగూడెం, చింతలపాడు తదితర గ్రామాల్లో ఉన్న తాగునీటి పథకాలు, చేతి పంపులు చెడిపోయి నెలలు దాటుతుతోంది. కొన్ని చోట్ల చేతిపంపులు కూడా లేకపోవడంతో వాగులు, కాల్వలు, చెలమల నీరుతాగాల్సి వస్తోంది. ఎర్రతోగు గ్రామంలో ఉన్న ఏకైక చేతిపంపు చెడిపోయి నాలుగునెలలు కావస్తున్నా మరమ్మత్తులు చేపట్టడం లేదు. ఇక్కడ మొత్తం 55 కొండరెడ్ల కుటుంబాలున్నాయి. ఈ గ్రామస్తులు తాగునీటి కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. వీరంతా అరకిలోమీటరు దూరంలోని ఎర్రకాల్వ వద్ద చెలమల నీరు తెచ్చుకొని తాగుతున్నారు. ఈ కలుషిత నీటిని తాగుతూ వ్యాధుల బారిన పడుతున్నారు. 80 కుటుంబాలున్న బోళ్ళపల్లి గ్రామంలో రక్షిత మంచినీటి పథకం చెడిపోయి ఏడునెలలు అవుతుంది. గ్రామంలో ఉన్న ఏకైక చేతిపంపే దిక్కైంది. పాతరెడ్డిగూడెం గ్రామంలో మంచినీటి పథకం చెడిపోయి పదిరోజులకు పైగా అవుతుంది. ఈ గ్రామస్తులు అరకిలోమీటరు దూరంలోని పెదవాగు నుంచి నీళ్లు తెచ్చుకుని వాడుకుంటున్నారు. ఒంటిబండ గ్రామంలోనూ పథకం మరమ్మతులకు గురై వారం దాటుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మేడేపల్లిలో తాగునీటి పథకం సక్రమంగా పనిచేయడం లేదు. పైప్‌లైన్ నీరు ట్యాంక్ ఉన్న ప్రాంతంలోని కొన్ని ఇళ్ళకు మాత్రమే అందుతున్నాయి. పాఠశాల ఉన్న గుంపునకు అసలు నీళ్ళురావడం లేదు. ఈ ప్రాంత గిరిజనులు చేతిపంపును ఆశ్రయిస్తున్నారు. మరికొందరు పెదవాగు నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. రామవరం ఊటగుంపు, ఉదయ్‌నగర్ గ్రామాల్లో చేతిపంపులు పనిచేయకపోవడంతో పెదవాగు, లోతువాగు చెలమల నీరు తాగుతున్నారు. అధికారులు స్పందించి ఆయా గ్రామాల్లో మంచినీటి పథకాలకు మరమ్మతులు చేయించి సక్రమంగా నీరందేలా చర్యలు తీసుకోవాలని మండలవాసులు కోరుతున్నారు. మణుగూరు,న్యూస్‌లైన్: మండలంలోని సమితిసింగారం పంచాయతీలో సర్వయ్యగుంపు వలస గిరిజనులకు తోగునీరే తాగునీరవుతోంది. ఐదేళ్ల క్రితం ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చిన సుమారు 32 కుటుంబాల వలస గిరిజనులు రేగలగండి చెరువు సమీపంలో నివాసం ఉంటున్నారు. జనావాసాలకు దూరంగా ఉంటున్న ఈ గిరిజనులకు ఎటువంటి సౌకర్యాలు లేవు. వీరికి కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేదు. వీరి నివాసప్రాంతానికి సమీపంలోని రేగులగండి చెరువుకు వెళ్లే తోగునీటినే తాగునీరుగా వాడుతున్నారు. గ్రామానికి కిలోమీటర్ దూరంలోని తోగులో నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. అత్యంత మురికిగా ఉన్న ఆ నీటిని తాగడం వల్ల గ్రామస్తులు అనారోగ్యానికి గురవుతున్నారు. గ్రామంలో ఓ చేతిపంపును నిర్మించాలని, విద్యుత్ సౌకర్యం కల్పించాలని గుంపువాసులు కోరుతున్నారు. తిరుమలాయపాలెం, న్యూస్‌లైన్ : మండలంలోని పలు గ్రామాల ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. కొన్ని గ్రామాలలో నీటి వసతి లేక, మరికొన్ని గ్రామాలలో నీరున్నా విద్యుత్ కొరత, పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యంతో ఇబ్బందులు తప్పడం లేదు. మండలంలోని తిరుమలాయపాలెం, పాతర్లపాడు, మేకలతండా, జింకలగూడెం, మహ్మదాపురం శివారు బోడా తండా తదితర గ్రామాలలో తాగునీటి సమస్య వేధిస్తోంది. పాతర్లపాడు తదితర గ్రామాలలో తాగునీటి వనరులు ఉన్నప్పటికీ సకాలంలో నీరు సరఫరా కావడం లేదు. పంచాయతీ సిబ్బందని ప్రశ్నిస్తే విద్యుత్ కొరతతో సరఫరా చేయలేకపోతున్నామని సాకులు చెపుతున్నారు. తమ గ్రామంలో రెండురోజులకు ఒకసారి నీరు సరఫరా చేసేవారని, ఇటీవలి కాలంలో అది కూడా సక్రమంగా రావడం లేదని స్థానికులు చెప్పారు. ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
కబళిస్తున్న ‘మొండి’వ్యాధి
ఊరివారిని మింగేస్తున్న కిడ్నీ రోగం వరుస మరణాలతో కలకలం నీటి కాలుష్యం, స్టోన్క్రషర్ల వ్యర్థాల వల్లే అని అనుమానం అయినా ఊరు విడిచి వెళ్లని వైనం మొండిపాలెం దుస్థితి ఇది అనకాపల్లి, న్యూస్‌లైన్: ఎన్నికలొస్తే అన్ని గ్రామల్లోనూ సందడే సందడి. అప్పటికే అమలు చేసిన సంక్షేమ పథకాలు, నెరవేర్చాల్సిన డిమాండ్లు, దీర్ఘకాలిక సమస్యలు ఇలా చెప్పుకుంటే అన్నిటికీ హామీలే. వారి సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదు. మాటిచ్చిన వారు నెరవేర్చిన పాపాన పోరు. తాగే నీరు మృత్యుపాశమవుతు న్నా... పీల్చే గాలి కాటికి పంపుతున్నా వారిని ఆదుకునే నాథుడు లేడు. అలాఅని గ్రామం విడిచి వారూ వెళ్లరు. అంత మహా‘మొండి’ వాళ్లు. అందుకు తగ్గట్టే ఆ ఊరి పేరు మొండిపాలెం. అనకాపల్లి మండలంలోని సుందరయ్యపేట శివారు గ్రామమిది. కిడ్నీ‘భూతం’ : 400 జనాభా ఉన్న మొండిపాలెంలో అచ్చమైన పల్లెతనం ఉట్టిపడుతుంది. ఈ ఊరికి వెళ్లాలంటే ఒకటే దారి. 60 నుంచి 70 వరకూ ఇళ్లున్నాయి. అందరికీ కలిపి 150 ఎకరాల మెట్ట, పల్లపు భూములున్నాయి. రెండు దశాబ్దాల క్రితం వరకు ఆ గ్రామస్తులు పరిపూర్ణ ఆరోగ్యవంతులు. గ్రామస్తులకు తెలిసింది వ్యవసాయం, కూలిపని మాత్రమే. పదిహేనేళ్ల క్రితం గ్రామాన్ని ఆనుకుని ఉన్న కొండలపై క్వారీ తవ్వకం మొదలైంది. స్టోన్ క్రషర్లు ఏర్పడ్డాయి. దగ్గరలోనే పనిదొరకడంతో గ్రామస్తులంతా క్రషర్లలో కూలీలుగా మారిపోయారు. అదే తమ పాలిట శాపమవుతుందని ఆ తర్వాతగాని వారికి తెలియలేదు. మూడేళ్ల నుంచి మరణమృదంగం : మూడేళ్ల క్రితం గ్రామంలో మంచినీటి పథకం ఏర్పాటు చేశారు. కుళాయి నీటి సదుపాయం కలిగిందని గ్రామస్తులంతా ఆనందించారు. కాకతాళీయమో...శాపమో తెలియదుగాని అప్పటి నుంచే గ్రామంలో రోగాలు ప్రారంభమయ్యాయి. కిడ్నీ బాధితుల సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకు 15 మంది కిడ్నీ వ్యాధి బారినపడి మృతి చెందారు. ప్రస్తుతం గ్రామంలో ఇద్దరు బాధితులు వైద్య సహాయం పొందుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు ఈ వ్యాధి బారిన పడుతుండడం గ్రామస్తులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎప్పుడు ఎవరిని వ్యాధి కబళిస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. స్పష్టంగా కారణం తెలియక పోయినా స్టోన్క్రషర్ల బుగ్గి, నీటి కాలుష్యమే తమను తినేస్తోందని వారు భావిస్తున్నారు. మినరల్ వాటర్ కోసం... : గ్రామానికి వెళ్లి ఎవరిని పలకరించినా అమాయకంగా చూస్తారు. మీ సమస్య ఏంటని ప్రశ్నిస్తే కిడ్నీ వ్యాధి భయమంటారు. స్వచ్ఛమైన నీటిని ఎవరైనా అందిస్తారేమోనని ఎదురు చూస్తున్నారు. దాతలెవరైనా ముందుకువచ్చి వాటర్‌ప్లాంట్ ఏర్పాటుచేస్తే తమ భయంపోతుందని భావిస్తున్నారు. గ్రామంలో నీటిని మరగబెడితే మడ్డిలాంటి చెత్త తేలుతుంది. అదే తమ వ్యాధులకు కారణమని వారి నమ్మకం. డయాలసిస్‌తో బతుకుతున్నా క్రషర్లో పనిచేస్తున్నాను. మూడేళ్ల క్రితం రోగం బయటపడింది. కా లు పొంగిపోయాయి. ఆస్పత్రికి వెళితే కిడ్నీ సమస్యన్నారు. ఇప్పు డు పనులు చేయలేను. డయాలసిస్ సాయంతో కాలంనెట్టుకు వస్తున్నాను. -తేలపు చిన్నారావు మానాన్న చనిపోయారు కిడ్నీ వ్యాధి బారినపడే మా నాన్న చనిపోయారు. మా ఊర్లో కిడ్నీ బాధితులు ఎక్కువే. ఇటీవల 15 మందిదాకా చనిపోయారు. నీటికాలుష్యం, స్టోన్క్రషర్ల కాలుష్యం అంటున్నారు. - కె.భాస్కరరావు -
చిత్తూరు జిల్లా మంచినీటి పథకంలో రూ.600 కోట్ల అవినీతి
సాక్షి, హైదరాబాద్: చిత్తూరు జిల్లాకు తాగునీరు అందించే పథకం పేరుతో ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి రూ. 600 కోట్లు ముడుపులు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారని ఈ కుంభకోణంపై ఒక సిటింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని తిరుపతి ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ సీజీసీ సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రి సోదరుడు ఎన్.సంతోష్‌కుమార్‌రెడ్డి దళారీ పాత్ర పోషించారని, నెల్లూరుకు చెందిన కాంట్రాక్టర్ శ్రీధర్‌రెడ్డి చక్రం తిప్పారని ధ్వజమెత్తారు. పైకి చూడటానికి ఈ పథకం చిత్తూరుకు నీరందించేదిగా ఉందని వాస్తవానికి ఇది ముఖ్యమంత్రి జేబులు నింపే వ్యవహారంగా ఉందని ఆయన విమర్శించారు. కమిషన్లకు కక్కుర్తిపడి ఈ పథకం అంచనా వ్యయాన్ని 30 నుంచి 40 శాతం మేరకు పెంచేసి టెండర్లు పెంచారన్నారు. నెల్లూరు జిల్లా కండలేరు నుంచి చిత్తూరు జిల్లాకు 6.6 టీఎంసీలను తరలించాలనే ఈపథకం ద్వారా ప్రజల దాహార్తి తీరుతుందని పైకి చెబుతున్నా ఇందులో పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. రూ. 2500 కోట్ల రూపాయల అంచనాతో పూర్తయ్యే ఈ పథకం వ్యయాన్ని రూ.5300 కోట్లకు పెంచి సుమారు రూ.2000 కోట్లు కాంట్రాక్టర్లకు మేలు జరిగేలా చేసి అందులో నుంచి రూ. 600 కోట్లు ముఖ్యమంత్రి కాజేయాలనుకుంటున్నారని భూమన వివరించారు. ఐదు ప్యాకేజీలుగా విభజించిన ఈ టెండర్లలో ఎవరినీ పాల్గొననీయకుండా తమకు రహస్యంగా డబ్బు ఇచ్చే కంపెనీలనే అధికారుల చేత సాంకేతికంగా అర్హత పొందేలాగా చేసుకున్నారని పేర్కొన్నారు. కొన్ని కంపెనీలను ఏదో ఒక సాంకేతిక కారణాలు చూపి అనర్హులుగా చేశారన్నారు. ఈ బిడ్లను సోమవారం తెరిచి తాము అనుకున్న విధంగా కంపెనీలకు ప్యాకేజీలు క ట్టబెట్ట బోతున్నారన్నారు. తనది నిజాయితీ, పారదర్శక పాలన అని పైకి చెప్పుకుంటున్న కిరణ్ వాస్తవానికి మేక వన్నె గల పులిలాగా అవినీతికి బాటలు వేస్తున్నారని, రాష్ట్ర విభజన విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తున్నారన్నారు. సమైక్యవాదినని చెప్పుకుంటూ ముఖ్యమంత్రి రాష్ట్ర విభజనకు కేంద్రానికి అన్ని విధాలా ఎలా సహకరిస్తున్నారో ఇందులో కూడా తాగునీటి పథకం అని చెప్పి ముడుపులు కైంకర్యం చేసే కార్యక్రమం పెట్టుకున్నారన్నారు. కిరణ్ ద్విముఖుడు అని పైకి చెప్పేది ఒకటి, లోపల చేసేది మరొకటి అని ఆయన దుయ్యబట్టారు. మరో మూడు నెలల్లో ముగియనున్న తన పాలన ఆరిపోయే దీపంలాగా ఉందని గ్రహించిన ముఖ్యమంత్రి ముడుపులు దండుకునే కార్యక్రమం పెట్టుకున్నారన్నారు. కిరణ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నది రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు ఏమాత్రం కాదని చరమాకంలో అందిన కాడికి ముడుపులు దండుకోవడానికేనని విమర్శించారు. నిజంగా కిరణ్ సమైక్యవాది అయితే విభజన ప్రక్రియను ప్రారంభించినపుడే తన పదవికి రాజీనామా చేసి ఉండేవారని అలా చేయకుండా ఇంకా కొనసాగుతున్నారంటే ముడుపులు దండుకోవడానికేనన్నారు. పార్లమెంటుకు బిల్లు రాకముందే విభజనకు వ్యతిరేకంగా తీర్మానం చేయడానికి అసెంబ్లీని సమావేశ పర్చమని వైఎస్సార్ కాంగ్రెస్ డిమాండ్ చేసినా కిరణ్ పట్టించు కోకుండా విభజనకు అన్ని తలుపులూ తెరిచి ఉంచారన్నారు. చివరకు టీచర్ల బదిలీల్లో కూడా ముఖ్యమంత్రి కార్యాలయంలోనే లక్ష రూపాయల చొప్పున ముడుపులు దండుకునే కార్యక్రమం జరుగుతోందని ఆయన విమర్శించారు. కిరణ్ పాలన మూడేళ్లు పూర్తయిన సందర్భంగా వ్యాఖ్యానించాల్సిందిగా కోరగా ‘ఆయనది ఓ అసమర్థుని జీవన యాత్ర...మూడేళ్లయితేనేమి, ముప్ఫై ఏళ్లయితేనేమి!’ అని భూమన అన్నారు. సి.ఎం.రమేష్ ఓ లఫంగి వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, సోనియాగాంధీతో కుమ్మక్కు అయ్యారని,జగన్ వెళ్లి సోనియాను అడిగితే రాష్ట్ర విభజన ఆగిపోతుందని లేదంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని అర్థం లేకుండా ఓండ్ర పెడుతున్న రాజ్యసభ సభ్యుడు సి.ఎం.రమేష్ ఒక రాజకీయ లఫంగి అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘డబ్బులిచ్చి రాజ్యసభ టికెట్ కొనుక్కున్న వాడివి, దొంగసారా అమ్మినవాడివి, కల్తీసారా తయారీలో నిష్ణాతుడివి అయిన నువ్వా...జగన్ మీద ఆరోపణలు చేసేది, అసలు నువ్వేమిటి, రాజకీయ సన్యాసం చేయడం ఏమిటి! నీకు రాజకీయం ఏముంది, నువ్వు సారా సన్నాసివి, ఒట్టి సన్నాసివి, సన్నాసులు కూడా సవాళ్లు విసరడం దిగజారుడుతనం తప్ప మరొకటి కాదు’ అని భూమన విమర్శించారు. సోనియాతో అవగాహన ఉన్నందునే జగన్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదే పదే అపాయింట్మెంట్లు ఇస్తున్నారని చెబుతున్న టీడీపీ నేతలు రాష్ట్రపతి హైదరాబాద్‌కు వచ్చినపుడు చంద్రబాబునాయుడు ఆయనను కలవడానికి అనుమతి ఎందుకు కోరలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరితే ఇవ్వలేదనడం అర్థరహితమని తాము కలవడానికి అనుమతి కోరామని పత్రికలకు టీడీపీ వాళ్లు చెప్పడమే తప్ప వాస్తవానికి వారడిగిందే లేదన్నారు. ప్రణబ్ వంటి అందరి మన్ననలూ పొందిన మేధావిపై అభాండాలు వేయడం తగదన్నారు. అవిశ్వాసతీర్మానం, ఎమ్మెల్సీ ఎన్నికలు, రాజ్యసభలో ఎఫ్‌డీఐ ఓటింగ్‌తో సహా అడుగడుగునా కాంగ్రెస్‌తో కుమ్మక్తవుతున్నది చంద్రబాబేనని ఆయన అన్నారు. -
ఆదిలోనే అడ్డంకులు
గజ్వేల్, న్యూస్‌లైన్: గజ్వేల్-సింగూర్ మంచినీటి పథకం ప్రతిపాదనలకు అడ్డంకులెదురవుతున్నాయి. ఈ ప్రతిపాదనలకు మరిన్ని సవరణలు చేసి తిరిగి సమర్పించాలని ప్రజారోగ్యశాఖ చీఫ్ ఇంజినీర్ ఈ ఫైల్‌ను ఎన్సీపీఈ (నేషనల్ కన్సల్టెన్సీ ఫర్ ప్రాజెక్ట్ ఎంటర్ప్రీమియర్)కు పంపారు. ప్రస్తుతం ఆ కన్సల్టెన్సీ మార్పులు, చేర్పులు చేపట్టే పనిలో ఉంది. అంచనా వ్యయాన్ని రూ.234 కోట్ల నుంచి రూ.197 కోట్లకు కుదించారు. సవరణలు పూర్తయిన తర్వాత సీఈ ద్వారా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు సమర్పించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియంతా పూర్తయిన తర్వాతే నిధుల మంజూరయ్యే అవకాశం. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు ఈ వ్యవహారంపై దృష్టి సారిస్తే పథకం వేగంగా మంజూరయ్యే అవకాశముందని స్థానికులు నగర పంచాయతీకి వరంగా మారునున్న గజ్వేల్-సింగూర్ పథకానికి ప్రతిపాదనల దశలోనే అడ్డంకులెదురవుతున్నాయి. పట్టణంలో మంచినీటి సమస్యను శాశ్వతంగా నిర్మూలించేందుకు గజ్వేల్‌కు మంజీరా నదిపై నిర్మించిన సింగూర్ ప్రాజెక్టు నుంచి 8.3 ఎల్ఎండీ నీటిని నిత్యం ఇక్కడికి తరలించే పథకానికి రూపకల్పన చేశారు. ఇందుకోసం అక్కడినుంచి పైప్‌లైన్, ఇతర 53 రకాల పనులను చేపట్టడానికి రూ.234 కోట్లు అవసరమని తొలుత ప్రతిపాదించారు. కానీ ప్రజారోగ్యశాఖ ఉన్నతాధికారుల సూచన మేరకు మార్పులు చేసి అంచనా వ్యయం ప్రతిపాదనలను రూ.211 కోట్లకు కుదించి ప్రతిపాదనలు అందజేయగా మార్పులు చేయాలని సీఈ ఆదేశించారు. ఈ మేరకు అంచనా వ్యయాన్ని మరింతగా తగ్గించి రూ.197 కోట్లతో ఇటీవల సీఈకి సమర్పించారు. దీనిపై మరోసారి మార్పులు జరగాలని ఆయన తాజాగా ఆదేశించగా ప్రస్తుతం ఈ ఫైల్ ఎన్సీపీఈ వద్దకు చేరింది. ఆ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో మార్పులు, చేర్పులు జరగనున్నాయి. ఈ పథకం కింద చేపట్టబోయే పనులు, అంచనా వ్యయంపై సవరణలు జరిగే అవశాశమున్నది. అది పూర్తయిన తర్వాత ప్రజారోగ్య శాఖ సీఈ ద్వారా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు సమర్పించే అవకాశముంది. ఈ ప్రక్రియంతా పూర్తయిన తర్వాతే నిధుల మంజూరుపై ఆశలు పెట్టుకునే అవకాశముంటుంది. ఇదంతా వేగంగా జరగాలంటే స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా చొరవ చూపాల్సిన అవసరముంది. ఈ వ్యవహారంపై గజ్వేల్ మున్సిపల్ కమిషనర్ సంతోష్‌కుమార్‌ను వివరణ కోరగా గజ్వేల్-సింగూర్ పథకానికి ప్రజారోగ్య శాఖ చీఫ్ ఇంజినీర్ సవరణలు కోరిన మాట వాస్తమేనని ధ్రువీకరించారు. తొందర్లోనే సవరణలు పూర్తిచేసి ప్రతిపాదనలు సమర్పించి నిధులు రాబడతామన్నారు.