- ఊరివారిని మింగేస్తున్న కిడ్నీ రోగం
- వరుస మరణాలతో కలకలం
- నీటి కాలుష్యం, స్టోన్‌క్రషర్ల వ్యర్థాల వల్లే అని అనుమానం
- అయినా ఊరు విడిచి వెళ్లని వైనం
- మొండిపాలెం దుస్థితి ఇది
అనకాపల్లి, న్యూస్‌లైన్: ఎన్నికలొస్తే అన్ని గ్రామల్లోనూ సందడే సందడి. అప్పటికే అమలు చేసిన సంక్షేమ పథకాలు, నెరవేర్చాల్సిన డిమాండ్లు, దీర్ఘకాలిక సమస్యలు ఇలా చెప్పుకుంటే అన్నిటికీ హామీలే. వారి సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదు. మాటిచ్చిన వారు నెరవేర్చిన పాపాన పోరు. తాగే నీరు మృత్యుపాశమవుతు న్నా... పీల్చే గాలి కాటికి పంపుతున్నా వారిని ఆదుకునే నాథుడు లేడు. అలాఅని గ్రామం విడిచి వారూ వెళ్లరు. అంత మహా‘మొండి’ వాళ్లు. అందుకు తగ్గట్టే ఆ ఊరి పేరు మొండిపాలెం. అనకాపల్లి మండలంలోని సుందరయ్యపేట శివారు గ్రామమిది.
కిడ్నీ‘భూతం’ : 400 జనాభా ఉన్న మొండిపాలెంలో అచ్చమైన పల్లెతనం ఉట్టిపడుతుంది. ఈ ఊరికి వెళ్లాలంటే ఒకటే దారి. 60 నుంచి 70 వరకూ ఇళ్లున్నాయి. అందరికీ కలిపి 150 ఎకరాల మెట్ట, పల్లపు భూములున్నాయి. రెండు దశాబ్దాల క్రితం వరకు ఆ గ్రామస్తులు పరిపూర్ణ ఆరోగ్యవంతులు. గ్రామస్తులకు తెలిసింది వ్యవసాయం, కూలిపని మాత్రమే. పదిహేనేళ్ల క్రితం గ్రామాన్ని ఆనుకుని ఉన్న కొండలపై క్వారీ తవ్వకం మొదలైంది. స్టోన్ క్రషర్లు ఏర్పడ్డాయి. దగ్గరలోనే పనిదొరకడంతో గ్రామస్తులంతా క్రషర్లలో కూలీలుగా మారిపోయారు. అదే తమ పాలిట శాపమవుతుందని ఆ తర్వాతగాని వారికి తెలియలేదు.
మూడేళ్ల నుంచి మరణమృదంగం : మూడేళ్ల క్రితం గ్రామంలో మంచినీటి పథకం ఏర్పాటు చేశారు. కుళాయి నీటి సదుపాయం కలిగిందని గ్రామస్తులంతా ఆనందించారు. కాకతాళీయమో...శాపమో తెలియదుగాని అప్పటి నుంచే గ్రామంలో రోగాలు ప్రారంభమయ్యాయి. కిడ్నీ బాధితుల సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకు 15 మంది కిడ్నీ వ్యాధి బారినపడి మృతి చెందారు. ప్రస్తుతం గ్రామంలో ఇద్దరు బాధితులు వైద్య సహాయం పొందుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు ఈ వ్యాధి బారిన పడుతుండడం గ్రామస్తులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎప్పుడు ఎవరిని వ్యాధి కబళిస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. స్పష్టంగా కారణం తెలియక పోయినా స్టోన్‌క్రషర్ల బుగ్గి, నీటి కాలుష్యమే తమను తినేస్తోందని వారు భావిస్తున్నారు.
మినరల్ వాటర్ కోసం... : గ్రామానికి వెళ్లి ఎవరిని పలకరించినా అమాయకంగా చూస్తారు. మీ సమస్య ఏంటని ప్రశ్నిస్తే కిడ్నీ వ్యాధి భయమంటారు. స్వచ్ఛమైన నీటిని ఎవరైనా అందిస్తారేమోనని ఎదురు చూస్తున్నారు. దాతలెవరైనా ముందుకువచ్చి వాటర్‌ప్లాంట్ ఏర్పాటుచేస్తే తమ భయంపోతుందని భావిస్తున్నారు. గ్రామంలో నీటిని మరగబెడితే మడ్డిలాంటి చెత్త తేలుతుంది. అదే తమ వ్యాధులకు కారణమని వారి నమ్మకం.
డయాలసిస్‌తో బతుకుతున్నా
క్రషర్లో పనిచేస్తున్నాను. మూడేళ్ల క్రితం రోగం బయటపడింది. కా లు పొంగిపోయాయి. ఆస్పత్రికి వెళితే కిడ్నీ సమస్యన్నారు. ఇప్పు డు పనులు చేయలేను. డయాలసిస్ సాయంతో కాలంనెట్టుకు వస్తున్నాను.
-తేలపు చిన్నారావు
మానాన్న చనిపోయారు
కిడ్నీ వ్యాధి బారినపడే మా నాన్న చనిపోయారు. మా ఊర్లో కిడ్నీ బాధితులు ఎక్కువే. ఇటీవల 15 మందిదాకా చనిపోయారు. నీటికాలుష్యం, స్టోన్‌క్రషర్ల కాలుష్యం అంటున్నారు.
- కె.భాస్కరరావు